బాలీవుడ్‌కి మరో షాక్.. గిల్డ్ ఆఫ్ ఇండియా సీఈవో మృతి
బాలీవుడ్‌కి మరో షాక్ తగిలింది. ప్రముఖ నిర్మాత, టెలివిజన్ అండ్ సినిమా ప్రొడ్యూసర్ గిల్డ్ ఆఫ్ ఇండియా సీఈవో కుల్మీత్ మక్కర్ శుక్రవారం ఉదయం గుండెపోటుతో మరణించారు. హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలలో గల ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కుల్మీత్ శుక్రవారం తుదిశ్వాస విడిచారు. లాక్‌డౌన్ విధించకముందే ఇంట్లోనే గుండెపోటుకు గురైన కుల్మీత్ అప్పటి నుంచి ధర్మశాలలోని ఆస్పత్రిలోనే చికిత్స తీసుకుంటున్నారు.
బాలీవుడ్ నటి విద్యాబాలన్, ప్రముఖ నిర్మాత, దర్శకుడు కరణ్ జోహర్ తదితరులు ట్విట్టర్‌లో నివాళులర్పించారు. కుల్మీత్ మృతిపై ప్రముఖ నటి విద్యాబాలన్ స్పందిస్తూ.. ఇది నిజంగా షాకింగ్..ఇండస్ట్రీకి మీరు అందించిన సేవలు ఎప్పటికీ గుర్తుంచుకుంటామని.. మా కన్నీటితో ఘన నివాళులు అర్పిస్తున్నామని చెప్పారు. ఆయన కుటుంబీకులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని ట్వీట్ చేశారు.
ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ కుల్మీత్ మృతిపై స్పందిస్తూ.. ప్రొడ్యూసర్ గిల్డ్ ఆఫ్ సీఈవోగా మీరు నిస్వార్థ సేవలందించారు. పని పట్ల మీకున్న విశ్వసనీయతను ఎల్లప్పుడు గుర్తుంచుకుంటాం. అలాంటి మీరు మమ్మల్ని వదిలిపెట్టి వెళ్లడం చాలా బాధాకరం. మీ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నానంటూ ట్వీట్ చేశారు.
బాలీవుడ్‌కు వరసగా దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే స్టార్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ అరుదైన క్యాన్సర్‌తో పోరాటం చేస్తూ మృతి చెందాడు. ఆయన మృతి చెందడానికి నలుగురు రోజుల ముందు తల్లి మరణించింది. ఈ రెండు విషాదాల నుంచి బాలీవుడ్ పరిశ్రమ కోలుకోక ముందు మరో దుర్వార్త బాలీవుడ్‌కు పలకరించింది. అలనాటి స్టార్ నటుడు రిషికపూర్ కూడా ప్రాణాలు కోల్పోయారు. తాజాగా ప్రముఖ నిర్మాత, టెలివిజన్ అండ్ సినిమా ప్రొడ్యూసర్ గిల్డ్ ఆఫ్ ఇండియా సీఈవో కుల్మీత్ మక్కర్ కూడా మృతి చెందడం బాలీవుడ్‌ను శోకంలో నెట్టేసింది.