శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 8 ఏప్రియల్ 2020 (11:56 IST)

కరోనాపై పోరాటం .. ట్విట్టర్ ఫౌండర్ భారీ విరాళం

ప్రపంచం కరోనా వైరస్ గుప్పెట్లో చిక్కుకుని తల్లడిల్లిపోతోంది. ఈ కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు అనేక ప్రపంచ దేశాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. శక్తిమేరకు పోరాటం చేస్తున్నాయి. ఈ పోరాటం కోసం తమవంతుగా అనేకమంది దాతలు విరాళాలను ఇస్తున్నారు. ఇలాంటి వారిలో ట్విట్టర్ వ్యవస్థాపకుడు జాక్ డార్సే కూడా చేరిపోయారు. ఈయన బిలియన్ డాలర్ల విరాళాన్ని ప్రకటించారు. కోవిడ్‌19పై పోరాటానికి బిలియ‌న్ డాల‌ర్ల స‌హాయం చేయ‌నున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. 
 
త‌న సంప‌ద‌లోని 28 శాతాన్ని విరాళంగా ఇవ్వ‌నున్న‌ట్లు డార్సే పేర్కొన్నారు. త‌న వ్య‌క్తిగ‌త ట్విట్ట‌ర్ అకౌంట్ ద్వారా ఆయ‌న ఈ స‌మాచారాన్ని తెలిపారు. అయితే తాను ఇవ్వ‌బోయే నిధుల‌ను ఎవ‌రికి ఇస్తార‌న్న విష‌యంపై మాత్రం ఆయన స్పష్టత ఇవ్వలేదు. 
 
ప్ర‌స్తుతానికి అమెరికాలో వెంటిలేట‌ర్లు, పీపీఈల కొర‌త ఉన్న‌ది. స్క్వేర్ సంస్థ‌లో ఉన్న‌ త‌న షేర్ల‌ను విరాళం రూపంలో వినియోగించ‌నున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. సార్ట్ స్మాల్ ఫౌండేష‌న్ ద్వారా వీటిని ఖ‌ర్చు చేస్తారు. 
 
ట్విట్ట‌ర్‌తో పాటు స్క్వేర్ సంస్థ‌కు కూడా డార్సీ సీఈవోగా ఉన్నారు. అయితే విరాళం కోసం వాడే షేర్ల‌న్నీ స్క్వేర్ సంస్థ‌వే అన్నారు. బాలిక‌ల చ‌దువు, ఆరోగ్యం, ప‌రిశోధ‌న గురించి వాటిని వినియోగించ‌నున్న‌ట్లు జాక్ డార్సే చెప్పారు. మొత్తంగా ఆయన ఒక బిలియన్ డాలర్ల మేరకు విరాళంగా ఇవ్వనున్నారని ఫోర్బ్స్ తన ట్విట్టర్ ఖాతాలో తెలిపింది.