భారత్ పోరాడుతుంది.. తిరిగి నవ్వుతుంది : ప్రధాని మోడీ
ప్రపంచాన్ని చుట్టేసిన కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు భారత్ శక్తికిమించి పోరాడుతోందని, భారత్ తిరిగి నవ్వుతుందని, ఈ మహమ్మారిపై భారత్ విజయం సాధిస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ అభిప్రాయపడ్డారు.
ఈ మేరకు ఆయన మంగళవారం ఓ ట్వీట్ చేశారు. దీనికి ఓ మ్యూజిక్ వీడియోను కూడా జతచేశాడు. "భారత్ తిరిగి నవ్వుతుంది, భారత్ మరోసారి విజయం సాధిస్తుంది. ఇండియా పోరాడుతుంది. గెలిచి తీరుతుంది" అంటూ ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ ట్వీట్ ఇపుడు ట్విట్టర్‌లో వైరల్ అయింది.
అలాగే, మోడీ అటాచ్ చేసిన మ్యూజిక్ వీడియోలో బాలీవుడ్ తారలు ఆక్షయ్ కుమార్, ఆయుష్మాన్ ఖురానా, కార్తీక్ ఆర్యన్, తాప్సీ, అనన్యాపాండే తదితరులు ఇందులో నటించారు. సినీ కుటుంబం వేసిన మంచి అడుగు అని ఈ వీడియోను అభివర్ణించిన ప్రధాని, కరోనా వైరస్‌పై ప్రజల్లో మరింత అవగాహన పెంచుతోందని కితాబిచ్చారు.
'ముస్కురాయేగా ఇండియా' పేరిట ఈ సాంగ్ విడుదలైంది. ఈ కష్టకాలంలో ప్రజలు సహకరిస్తే, భారతావని మరోమారు నవ్వుతుందన్న సందేశం ఇందులో ఉంది. మూడు నిమిషాల, 25 సెకన్లు ఉన్న ఈ వీడియో సోమవారం సాయంత్రం విడుదల కాగా, ఇప్పటికే ఆరు లక్షలకు పైగా వ్యూస్ సాధించడంతో వైరల్ అయింది.