శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: శనివారం, 28 సెప్టెంబరు 2019 (14:54 IST)

ఓ మంచి ప‌నికి శ్రీకారం చుట్టిన పూరీ... ఏంటా మంచి ప‌ని..?

డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్... ఎన‌ర్జిటిక్ హీరో రామ్‌తో తెర‌కెక్కించిన ఇస్మార్ట్ శంక‌ర్ సినిమాతో బ్లాక్‌బ‌ష్ట‌ర్ సొంతం చేసుకున్న విష‌యం తెలిసిందే. అయితే... సెప్టెంబ‌ర్ 28 పూరి జ‌గ‌న్నాథ్ పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా పూరి... ఓ మంచి కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టారు. అది ఏంటో ఆయ‌న మాట‌ల్లో...
 
సినిమాతో మ‌మేక‌మై వుండే ప్ర‌తి ఒక్క‌రిపైన మాకు అపార‌మైన గౌర‌వం ఉంది. సినిమా అన్న‌ది వ్యాపార‌మే అయినా.. డ‌బ్బులు పెట్టే నిర్మాత కూడా ద‌ర్శ‌కుడి ప్ర‌తిభ‌నే న‌మ్ముతాడు. ద‌ర్శ‌కుడి మేథ‌స్సు, సృజ‌నాత్మ‌క‌త అవిశ్రాత‌మైన శ్ర‌మ‌కు ప్ర‌తిరూపం సినిమా. ఒక ద‌ర్శ‌కుడికి సినిమా అవ‌కాశం వ‌స్తే... ఎంతోమందికి ప‌ని దొరుకుతుంది. అందుకే ద‌ర్శ‌కులు మ‌రియు ద‌ర్శ‌క‌త్వశాఖ బాగుండాల‌ని కోరుకుంటున్నాం.
 
విజ‌యాలు, అప‌జ‌యాలు స‌హ‌జం. అయినా... సినిమానే న‌మ్ముకుని మ‌న‌దైన రోజు కోసం ఎదురుచూస్తూ ఉంటాం. 
 
ద‌ర్శ‌క‌త్వ శాఖ‌లోని మ‌న‌వాళ్లు కొంద‌రు పనిలేక‌, సినిమాలు చేసే అవ‌కాశం రాక‌నో ఖాళీగా ఉండి ఇబ్బంది ప‌డ‌టం చూసి మా మ‌న‌సుకు క‌ష్టం అనిపించింది. అంద‌రూ బాగుండాల‌ని దేవుడిని ప్రార్థించ‌డం క‌న్నా కొంద‌రికి కొంత‌లో కొంతైనా ఆర్ధికంగా స‌హాయం చేయాల‌నిపించింది. చిత్ర ప‌రిశ్ర‌మ అందించిన ఇస్మార్ట్ శంక‌ర్ సినిమా అద్భుత విజ‌యాన్ని పుర‌స్క‌రించుకుని ఆ సంతోషాన్ని మీ అంద‌రితో పంచుకోవాల‌నిపించింది. 
 
ఒక‌ప్పుడు సినిమాలు చేసి ప్ర‌స్తుతం ప‌నిలేక ఖాళీగా ఉండి త‌మ జీవితాల‌ను సినిమాకి అంకితం చేసి క‌ష్ట‌ప‌డి ప‌ని చేసిన డైరెక్ట‌ర్స్ & కో - డైరెక్ట‌ర్స్ 20 మందికి మా వంతు ఆర్ధిక స‌హాయం చేయాల‌నుకుంటున్నాం. ప్రేమ‌తో అంగీక‌రించండి. ఇదేమీ పెద్ద స‌హాయం కాదు. చిన్న చిరున‌వ్వు లాంటి ప‌ల‌క‌రింపు అంతే..! 
 
మా ఈ చిన్న స‌హాయం మీకు ఏమాత్రం ఊర‌ట‌నిచ్చినా చాలు. అది మా ప్ర‌య‌త్నానికి ఆశీస్సులుగా భావిస్తాం. మేము త‌ల‌పెట్టే ఇలాంటి ఓ మంచి కార్య‌క్ర‌మానికి మీ అంద‌రినీ ఆహ్వానిస్తున్నాం. మేము బ్ర‌తికి ఉన్నంతకాలం ఇదేవిధంగా దేవుడు శ‌క్తిని ఇచ్చిన‌ట్లు అయితే... మేము ప్ర‌తి సంవ‌త్స‌రం ఇలాగే స‌హాయం చేయాల‌ని అనుకుంటున్నాం అని పూరి జ‌గ‌న్నాథ్, ఛార్మి తెలియ‌చేసారు. 
 
డ‌బ్బు చాలామంది ద‌గ్గ‌ర ఉండ‌చ్చు కానీ... చేత‌నైనంత స‌హాయం చేయాల‌నే మంచి మ‌న‌సు మాత్రం కొంద‌రికే ఉంటుంది. త‌న సినిమాల‌తోనే కాకుండా... ఇలా మంచి ప‌ని చేస్తూ... ఎంద‌రికో ఆద‌ర్శంగా నిలుస్తున్న డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్. అందుకే... పూరీ ఈజ్ గ్రేట్.!