శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వాసు
Last Updated : బుధవారం, 13 మార్చి 2019 (13:20 IST)

‘చిత్రలహరి’ టీజర్.. సాయి ధరమ్ తేజ్ కొత్త లుక్!

'సుప్రీమ్' హీరో సాయిధ‌రమ్ తేజ్ కథానాయకుడిగా ‘నేను శైల‌జ’ ఫేమ్ కిషోర్ తిరుమ‌ల ద‌ర్శక‌త్వంలో ‘శ్రీమంతుడు’, ‘జ‌న‌తా గ్యారేజ్‌’, ‘రంగ‌స్థలం’ వంటి బ్లాక్ బ‌స్టర్ చిత్రాల‌ను నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై న‌వీన్ ఎర్నేని, య‌ల‌మంచిలి ర‌విశంక‌ర్‌, చెరుకూరి మోహ‌న్ నిర్మాతలుగా తెరకెక్కుతున్న చిత్రం ‘చిత్రలహరి’. ఇందులో సాయిధ‌ర‌మ్ తేజ్ స‌ర‌స‌న క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శన్‌, నివేదా పేతురాజ్ హీరోయిన్లుగా న‌టిస్తుండగా సునీల్, వెన్నెల కిషోర్‌లు ముఖ్య పాత్రలు పోషించారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చిన ఈ సినిమా ఏప్రిల్‌ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. 
 
కాగా... విడుదలకు నెలరోజుల గడువు మాత్రమే ఉండటంతో మైత్రీ మూవీస్ చిత్ర ప్రచార కార్యక్రమాలను మొదలుపెట్టి ఇందులో భాగంగా బుధవారం చిత్ర టీజర్‌ను విడుదల చేసింది. సుమారు నిమిషం వ్యవధి ఉన్న ఈ టీజర్‌లో ముఖ్య పాత్రలన్నింటినీ పరిచయం చేసేసారు. ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ పూర్తిగా కొత్తగా కనిపిస్తున్నారు. 
 
గత చిత్రాలతో పోలిస్తే ఆయన లుక్, నటనలో ఏదో కొత్తదనం కనిపిస్తోంది. ఇక సునీల్ మరోసారి తనలోని చమత్కారంతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేలా కనిపిస్తున్నారు. దర్శకుడు సుకుమార్ వాయిస్ ఓవర్‌తో ప్రారంభమయ్యే టీజర్‌లో నివేదా పేతురాజ్‌తో పాత్రల పరిచయం మొదలైంది. ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ పాత్ర పేరు విజయ్. తన పేరులోని విజయం తన జీవితంలోకి ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తూ ఉండే పాత్రగా దీనిని రూపుదిద్దినట్లు సమాచారం.