గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 11 నవంబరు 2023 (16:23 IST)

నాలుగు తరాల జ్ఞాపకాలు మిగిల్చిన చంద్రమోహన్

Chandrmohan
Chandrmohan
సీనియర్ నటులు, కథనాయకులు చంద్రమోహన్ ఈ రోజు తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో 9.45 గంటలకు హృద్రోగంతో కన్ను మూశారు. ఆయన వయసు 82 ఏళ్ళు. ఆయనకు భార్య జలంధర, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సోమవారం హైదరాబాద్ లో అంత్యక్రియలు జరుగుతాయి. కె. విశ్వనాథ్ గారు చంద్రమోహన్ కు పెద్ద నాన్న అవుతారు.
 
నటుడు చంద్రమోహన్ మృతి పట్ల తెలుగు సినిమారంగం కలత చెందింది. అలనాటి నటుల్లో గుర్తుగా వున్న చంద్రమోహన్  మరణించడం చాలా బాధాకరమని తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు.  చంద్రమోహన్‌తో నటించాలని అప్పట్లో చాలామంది హీరోయిన్లు ఆసక్తి చూపేవారు. ఆయనతో నటిస్తే హిట్ హీరోయిన్‌గా పేరు రావడమే అందుకు కారణం. ఆయనది గోల్డెన్ హ్యాండ్ అనే పేరుంది. జయప్రద, జయసుధ, మాధవి, శ్రీదేవి ఇలా అప్పటి నటీమణులు మొదట్లో చంద్రమోహన్‌కు జతగా నటించారు. ఆయన నటించిన సినిమాలో కంచికి పోదామా క్రిష్ణమ్మా.. అనే పాటకు తగినట్లుగా ఆయన కథ కంచికి చేరుకుంది.
 
నందమూరి బాలక్రిష్ణ సంతాపం 
జీవితం క్షణికం, జీవం పోసిన పాత్రలు శాశ్వతం, అలాంటి ఎన్నో పాత్రలకు ప్రాణం పోసిన మన అలనాటి అభిమాన నటుడు చంద్రమోహన్ గారు ఇక లేరు.
 
కళ్యాణ్ రామ్.
విలక్షణ నటుడు చంద్రమోహన్ గారి అకాల మరణం సినిమా జగత్తుకు తీరని లోటు. ఆయనతో పలు సినిమాల్లో కలిసి నటించి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.
ఎన్.టి.ఆర్.
ఎన్నో దశాబ్దాలుగా చలనచిత్రాల్లో విభిన్నమైన పాత్రలు పొషించి, తనకంటూ ప్రత్యేక గుర్తింపుని సంపాదించుకున్న చంద్రమోహన్ గారు అకాల మరణం చెందడం చాలా బాధాకరం. 
వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్దిస్తున్నాను.
 
ఇలాంటి నటుడు మరలా పుడతారా.
చంద్రమోహన్‌తో తమకున్న అనుబంధాన్ని జయసుధ, జయప్రద కూడా పంచుకున్నారు. ఆయన లేని లోటు పూడ్చలేనిదని, అటువంటి నటుడు మరలా పుట్టడని పేర్కొన్నారు.
ఇక ఫిలింఛాంబర్ ఆప్ కామర్స్, మూవీ ఆర్టిస్ట్ అసోసయేషన్, సినీ రంగ ప్రముఖులు చంద్ర మోహన్ మృతికి సంతాపం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ లోనే  ఆయన నివాసం కనుక ఛాంబర్ దగ్గరకు సోమవారం భౌతికకాయం సందర్శనార్థం వుంచనున్నారు.