'మురారి' చిత్ర పూజారి పాత్రధారి ఇకలేరు
సినీ, రంగస్థల నటుడు శ్రీనివాస దీక్షితులు ఇకలేరు. ఆయన వయసు 62 యేళ్లు. హైదరాబాద్‌లోని నాచారం స్టూడియోలో సినీ దర్శకుడు రాఘవేంద్రరావు నిర్మాతగా రూపొందిస్తున్న 'సిరిసిరిమువ్వ' టీవీ సీరియల్‌లోని ఓ సన్నివేశంలో నటిస్తూ గుండెపోటుతో కుప్పకూలిన ఆయనను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్థారించారు.
ఆయన భార్య లక్ష్మీచిత్రలేఖ మూడేళ్ల క్రితం కన్నుమూశారు. కుమార్తె, కుమారుడు ఉన్నారు. అక్కినేని ఇనిస్టిట్యూట్ ఆఫ్ మీడియా యాక్టింగ్ వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఆయన ప్రస్తుతం సేవలందిస్తున్నారు.
రేపల్లెలో విద్యాభ్యాసం చేసి అధ్యాపక వృత్తిలో స్థిరపడ్డారు. థియేటర్ ఆర్ట్స్‌లో శిక్షణ పొంది పలు నాటకాలకు దర్శకత్వం వహించారు. టీవీ రంగంలో అడుగిడి పలు సీరియల్స్‌లో నటించడమేకాకుండా దర్శకత్వం కూడా వహించారు. ఆయన దర్శకత్వం వహించిన 'ఆగమనం' సీరియల్ నంది అవార్డు గెలుచుకుంది.
'మురారి' సినిమాలో పూజారి పాత్రలో నటించిన ఆయన 62 సినిమాలలో తన నటనతో మెప్పించారు. ఉమ్మడి రాష్ట్రంలో వేలాది ప్రదర్శనలు ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఉత్తమ దర్శకుడి అవార్డు అందుకున్నారు.