ఆదివారం, 24 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 25 జులై 2024 (16:03 IST)

మదనపల్లె సబ్ కలెక్టరేట్‌ను పరిశీలించిన సిసోడియా

fire accident
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఇటీవల సబ్ కలెక్టరేట్‌లో అగ్నిప్రమాదం జరిగింది. ఇది ప్రమాదవశాత్తు జరిగిన ఘటనలా లేదని ఇప్పటికే డీజీపీ ద్వారకా తిరుమల రావు అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పది పోలీసు బృందాలు విచారణ కొనసాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా మదనపల్లెకు వెళ్లి ఇక్కడి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని కూడా సందర్శించి, అక్కడ పలు రికార్డులను పరిశీలించారు.
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మదనపల్లె ఘటనపై కుట్ర కోణాన్ని వెలికితీసే పనిలో ఉన్నామని తెలిపారు. ఈ ఘటనలో సిబ్బంది ప్రమేయం ఉందా? లేక బయటి వ్యక్తుల పనా? అనేది దర్యాప్తులో తేలుతుందని అన్నారు. ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి నివేదిక వస్తే మరిన్ని విషయాలు తెలుస్తాయని చెప్పారు. ఈ ఘటనలో రెవెన్యూ, పోలీసుల విచారణ సమాంతరంగా సాగుతోందని పేర్కొన్నారు.
 
రెవెన్యూ శాఖకు సంబంధించి 2,400 ఫైళ్లు కాలిపోయాయని సిసోడియా వెల్లడించారు. దాదాపు 700 ఫైళ్లను రికవరీ చేయగలిగామని, కాలిపోయిన ఫైళ్లను రీక్రియేట్ చేస్తున్నామని వివరించారు. అగ్నిప్రమాదం జరిగిన ప్రదేశంలో జులై 10వ తేదీ నుంచి సీసీ టీవీ కెమెరాలు పనిచేయడంలేదని గుర్తించామని సిసోడియా తెలిపారు.