ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 27 అక్టోబరు 2020 (19:24 IST)

పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

టాలీవుడ్ అగ్రనటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో యువ నిర్మాత సూర్యదేవర నాగవంశీ సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నం:12గా ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు అధికారికంగా, విజయదశమి పర్వదినం సందర్భంగా ప్రకటించారు. ఈ చిత్రానికి ప్రతిభావంతమైన యువ దర్శకుడు సాగర్.కె. చంద్రను దర్శకునిగా ఎంపిక చేసుకున్నారు. ఇదే విషయాన్ని వివరంగా పొందుపరుస్తు వినూత్నంగా ఓ వీడియో రూపంలో ప్రకటించారు.
 
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో తొలిసారి తమ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించనుందని తెలిపారు. ఈ చిత్రంలో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కనిపించనున్నారు. 'గబ్బర్ సింగ్'గా పోలీస్ ఆఫీసర్ పాత్రలో తనదైన నటనతో అశేష ప్రేక్షకులను అలరించిన పవన్ కళ్యాణ్ మరోమారు పోలీస్ పాత్రలో ఈ చిత్రం ద్వారా రక్తి కట్టించనున్నారు. కాగా ఈ చిత్రానికి ప్రధాన సాంకేతిక నిపుణులుగా సంగీత ప్రపంచంలో సంచలనాలు సృష్టిస్తున్న సంగీత దర్శకుడు థమన్. ఎస్ ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహిస్తున్నారు.
 
అలాగే సమున్నత ప్రతిభావంతులైన 'ప్రసాద్ మూరెళ్ళ' ఛాయాగ్రాహకునిగా, ఎడిటర్‌గా 'నవీన్ నూలి', కళాదర్శకునిగా 'ఏ. ఎస్. ప్రకాష్‌లు ఎంపికయ్యారు అని తెలిపారు నిర్మాత సూర్యదేవర నాగవంశీ. పి.డి.వి.ప్రసాద్ సమర్పణలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకోనున్న ఈ చిత్రం షూటింగ్ ఎప్పుడు ప్రారంభమయ్యేది, చిత్రంలోని ఇతర నటీనటులు సాంకేతిక నిపుణులు ఎవరన్న వివరాలు, విశేషాలు మరో ప్రకటనలో తెలియపరుస్తామని చెబుతూ మీడియా వారికి, అభిమానులకు, ప్రేక్షకులకు, విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ.