సీరియల్‌ తరహాలో సాగే నితిన్ "శ్రీనివాస కళ్యాణం"

నిన్నామొన్నటివరకు మాస్ కథలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన యువ హీరో నితిన్. ఆ తర్వాత "ఇష్క్‌"తో తన పంథాను మార్చుకుని ముందుకుసాగుతున్నారు. ఈ ఏడాది 'ఛల్‌ మోహన్‌రంగా' చిత్రంతో అలరించిన నితిన్‌.. తాజాగా నటించ

pnr| Last Updated: గురువారం, 9 ఆగస్టు 2018 (14:24 IST)
చిత్రం : శ్రీనివాస కళ్యాణం. 
బ్యాన‌ర్‌: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
న‌టీన‌టులు: నితిన్, రాశీ ఖన్నా,నందితా శ్వేత‌, పూన‌మ్‌కౌర్‌, జ‌య‌సుధ‌, ఆమ‌ని, సితార‌, సీనియ‌ర్ న‌రేశ్‌, ప్ర‌కాష్‌రాజ్‌, రాజేంద్ర‌ప్ర‌సాద్ త‌దిత‌రులు
సంగీతం: మిక్కీ జె మేయర్
ద‌ర్శ‌క‌త్వం: సతీష్ వేగేశ్న‌
స‌మ‌ర్ప‌ణ‌: శ్రీమ‌తి అనిత‌
నిర్మాత‌లు: దిల్ రాజు, శిరీష్, లక్ష్మణ్
 
నిన్నామొన్నటివరకు మాస్ కథలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన యువ హీరో నితిన్. ఆ తర్వాత "ఇష్క్‌"తో తన పంథాను మార్చుకుని ముందుకుసాగుతున్నారు. ఈ ఏడాది 'ఛల్‌ మోహన్‌రంగా' చిత్రంతో అలరించిన నితిన్‌.. తాజాగా నటించిన చిత్రం "శ్రీనివాస కళ్యాణం"లో నటించాడు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించారు. కథల ఎంపికలో తనదైన ముద్రవేయడమేకాకుండా, కుటుంబ ప్రేక్షకులను సైతం థియేటర్లకు రప్పించగల నైపుణ్యం దిల్ రాజుకు బాగా తెలుసు.
 
గతేడాది సతీష్‌ వేగేశ్నతో కలిసి 'శతమానం భవతి'తో బాక్సాఫీస్‌ వద్ద మంచి హిట్‌ అందించారు. ఇప్పుడు అదే దర్శకుడితో 'శ్రీనివాస కళ్యాణం' అంటూ మరోసారి కుటుంబ కథా నేపథ్యాన్నే ఎంచుకున్నారు. గత చిత్రంలో పండగ విశిష్టతను చెప్పిన దర్శకుడు, ఈసారి పెళ్లి ప్రాముఖ్యతను వివరించే ప్రయత్నం చేశారు. మరి "శ్రీనివాస కళ్యాణం" కమనీయంగా జరిగిందా? లేదా అన్నది తెలుసుకోవాలంటే చిత్ర కథలోకి వెళ్లాల్సిందే.
 
క‌థ‌: 
శ్రీనివాస్ (నితిన్) స‌గినేటి ప‌ల్లెకు చెందిన యువ‌కుడు. ఆర్కిటెక్చ‌ర్‌గా ప‌నిచేస్తుంటాడు. విలువలు, కట్టుబాట్లు, సంప్రదాయాలకు పెద్ద పీట వేసే కుటుంబం నుంచి వచ్చిన యువకుడు. అలాగే, ప్రతి నిమిషాన్నీ డబ్బుతో కొలుస్తూ, వ్యాపారమే పరమావధిగా భావించే వ్యక్తి ఆర్కే(ప్రకాష్‌రాజ్‌). అతని కుమార్తె శ్రీదేవి(రాశీ ఖన్నా). ఈమెను ఓ కాఫీ డే షాపులో చూసి మనసు పారేసుకుంటాడు శ్రీనివాస్. పెళ్లన్నా, పెళ్లి సంప్రదాయాలన్నా శ్రీనివాస్‌కు చాలా ఇష్టం. తన పెళ్లిని ఒక వేడుకలా చేసుకోవాలనుకుంటాడు. నాయనమ్మ(జయసుధ) కూడా తన మనవడి పెళ్లిని ఉత్సవంలా చేయాలని అనుకుంటుంది. అయితే, ఆర్కే మాత్రం సంప్రదాయాలకన్నా బిజినెస్‌కే ఎక్కువ విలువ ఇస్తాడు. మరి అలాంటి వ్యక్తి తన కూతురి ప్రేమకు విలువ ఇచ్చాడా? తన కుమార్తెను ఒక సంప్రదాయ కుటుంబంలోకి పంపించాడా? వీరిద్దరి పెళ్లి చేయడానికి అతను పెట్టిన షరతులేంటి? అనేదే మిగిలిన కథ.
 
విశ్లేష‌ణ‌:
ఈ చిత్ర కథ ఏంటో సినిమా టైటిల్‌లోనే చెప్పేశాడు. ఆచారాలు, కట్టుబాట్లు పెళ్లితంతు వీటి గురించి ఒక కథ చెప్పబోతున్నామని సినిమా రూపకర్తలు ముందే బహిర్గతం చేశారు. ఈ సినిమా దానికి తగ్గటుగానే ఉంది. సంప్ర‌దాయాలు, సంస్కృతిని కాపాడుకోవాల్సిన బాధ్య‌త అంద‌రికీ ఉంది. ఇదే కాన్సెప్ట్‌తో మ‌న సంప్ర‌దాయంలో ముఖ్య‌మై ఘ‌ట్ట‌మైన పెళ్లి అనే అంశం చుట్టూ ద‌ర్శ‌కుడు స‌తీశ్ వేగేశ్న కథను అల్లాడు. 
 
'శ‌త‌మానం భ‌వ‌తి' అనే చిత్రంతో విజ‌యాన్ని అందుకున్న ద‌ర్శ‌కుడు స‌తీశ్ వేగేశ్న.. రాసుకున్న క‌థ ఇది. ఇందులో ఇద్ద‌రు మ‌నుషుల‌ను, రెండు కుటుంబాల‌ను ఒక్క‌టి చేసే పెళ్లి గురించి ఏదో చెప్పాయాల‌ని చెప్పేయ‌కుండా.. ఎలా జ‌రిపిస్తారు. పెళ్లి కూతురు తండ్రి ఏం చేయాలి.. పెళ్లికొడుకు కుటుంబ స‌భ్యులు ఏం చేస్తారు? ఇలా అన్ని విష‌యాల‌ను చ‌క్క‌గా వివ‌రించే ప్ర‌య‌త్నం చేశారు. 
 
ఇక పాత్ర‌లు, వాటిని మ‌లిచిన తీరు, వాటి మ‌ధ్య భావోద్వేగాలు ఎఫెక్టివ్‌గా అనిపించ‌వు. నితిన్‌, రాశీఖ‌న్నా పాత్ర‌లు జ‌స్ట్ ఓకే. లుక్ ప‌రంగా ఇద్ద‌రి జంట తెర‌పై చూడ‌టానికి చ‌క్క‌గా ఉంది. ఇక మిలియ‌నీర్‌గా న‌టించిన ప్ర‌కాశ్‌రాజ్ .. పాత్ర‌ను సునాయ‌సంగా చేసేశాడు. ముఖ్యంగా క్లైమాక్స్‌లో నితిన్, ప్ర‌కాశ్ రాజ్ మ‌ధ్య న‌డిచే ఎమోష‌న‌ల్ సీన్‌లో నితిన్ డైలాగ్స్ వివ‌ర‌ణ మ‌రీ ఎక్కువైన‌ట్లు అనిపించేస్తుంది.
 
నందితా శ్వేతా, జ‌య‌సుధ‌, రాజేంద్ర‌ప్ర‌సాద్‌, సీనియ‌ర్ న‌రేశ్‌, ప్ర‌భాస్ శ్రీను, సితార‌, ఆమ‌ని ఇలా అంద‌రూ వారి వారి పాత్ర‌ల‌కు న్యాయం చేశారు. పాత్ర‌ధారులు కంటే పాత్ర‌లను స‌రిగా డిజైన్ చేయ‌క‌పోవ‌డం అనేది సినిమాలో ఫీల్‌ను క్యారీ చేయ‌దు. హీరో హీరోయిన్ మ‌ధ్య స‌న్నివేశాలు, స‌త్యం రాజేశ్‌, హ‌రితేజ‌, ప్ర‌వీణ్‌, విద్యుల్లేఖ ఇలా అన్ని పాత్ర‌ల మ‌ధ్య స‌న్నివేశాలు ఏదో ర‌న్ అవుతున్నాయంటే.. ర‌న్ అవుతున్నాయ‌నేలా ఉంటాయి. 
 
మిక్కీ జే మేయర్‌ పాటలు వింటుంటే పాతట్యూన్లు గుర్తొస్తాయి. 'కల్యాణం.. వైభోగం..' పాట మాత్రం ఆకట్టుకుంది. పల్లెటూరి నేపథ్యంలో తీసిన సన్నివేశాలు ఎక్కువగా కనిపిస్తాయి. దాంతో వెండితెర ఆహ్లాదంగా మారుతుంది. సతీశ్‌ వేగేశ్న చెప్పాలనుకున్న విషయం చాలా మంచిది. ఈతరం తెలుసుకోవాల్సింది. అయితే, దాన్ని కథలో అంతర్లీనంగాకాకుండా కాస్త బలవంతంగా రుద్ది చెప్పే ప్రయత్నం చేసినట్లు అనిపిస్తుంది. సీరియల్‌ తరహాలో సాగే కొన్ని సన్నివేశాలు, ఈ కథలోని వేగాన్ని అందుకోలేపోయాయి. సంభాషణల్లో బలం ఉన్నప్పటికీ సన్నివేశాలు తేలిపోవడంతో వాటిలో ఉన్న పదును పూర్తిగా బయటకు రాలేదు. చిత్రం నిర్మాణపు విలువలు బాగున్నాయి. 
 
ఇకపోతే, ఈ చిత్ర ప్లస్ పాయింట్లను పరిశీలిస్తే, నేప‌థ్య సంగీతం, కెమెరా పనితనం, పెళ్లి స‌న్నివేశంలో వ‌చ్చే సంభాష‌ణ‌లు, నిర్మాణ విలువ‌లు బాగున్నాయి. అలాగే, మైనస్ పాయింట్లను పరిశీలిస్తే, పాట‌లు ఆక‌ట్టుకోవు, పాత్ర‌లు, వాటిని డిజైన్ చేసిన తీరు, వాటి మ‌ధ్య ఎమోష‌న్స్ బలంగా అనిపించ‌వు, కాలంతో పోటీ ప‌డుతున్న యువ‌త‌కు సినిమా ఎంతవ‌ర‌కు క‌నెక్ట్ కాదు, బ‌లహీన‌మైన క‌థ‌. దీనిపై మరింత చదవండి :