గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : ఆదివారం, 5 ఆగస్టు 2018 (13:45 IST)

ఉద్యోగాలే లేనపుడు రిజర్వేషన్లు ఎందుకు : నితిన్ గడ్కరీ

దేశంలో ఉద్యోగాలే లేనపుడు రిజర్వేషన్ల కోసం పోరాటం ఎందుకని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రశ్నించారు. మహారాష్ట్రలో రిజర్వేషన్ల కోసం మరాఠీలు ఆందోళన చేస్తున్న విషయం తెల్సిందే. ఇటీవల ఈ ఉద్యమం హింసకు దారితీస

దేశంలో ఉద్యోగాలే లేనపుడు రిజర్వేషన్ల కోసం పోరాటం ఎందుకని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రశ్నించారు. మహారాష్ట్రలో రిజర్వేషన్ల కోసం మరాఠీలు ఆందోళన చేస్తున్న విషయం తెల్సిందే. ఇటీవల ఈ ఉద్యమం హింసకు దారితీసింది. మరోవైపు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కాపు సామాజిక వర్గం రిజర్వేషన్ కల్పించాలని కోరుతోంది. అయితే దేశవ్యాప్తంగా పెరుగుతున్న ఈ తరహా డిమాండ్లపై కేంద్ర ఉపరితల రవాణా, షిప్పింగ్ మంత్రి నితిన్ గడ్కరీ స్పందించారు.
 
ప్రస్తుతం ఆటోమేషన్ కారణంగా దేశంలో ఉద్యోగాలు తగ్గిపోతున్నాయనీ, ఇలాంటి పరిస్థితుల్లో ఎవరి ఉద్యోగానికీ గ్యారెంటీ లేదన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు ఇతర ప్రభుత్వ విభాగాల్లో సైతం నియామకాలు మందగించిన విషయాన్ని గడ్కరీ గుర్తుచేశారు. అన్ని సామాజిక వర్గాల్లోనూ ధనికులు ఉన్నారనీ, అదేసమయంలో కనీసం తిండి, బట్టలకు నోచుకుని నిరుపేదలు కూడా అగ్రవర్ణాల్లో ఉన్నారని అభిప్రాయపడ్డారు.
 
మరాఠాల రిజర్వేషన్ పోరాటంపై స్పందిస్తూ.. 'ప్రస్తుతం ఐటీ, ఆటోమేషన్ కారణంగా బ్యాంకుల్లో ఉద్యోగాలు తగ్గిపోయాయి. ప్రభుత్వ నియామకాలు స్తంభించాయి. ఇలాంటప్పుడు రిజర్వేషన్ ఇచ్చినా ప్రయోజనం ఏముంటుంది?' అని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం. రిజర్వేషన్ అన్నది ఓ రాజకీయ అస్త్రంగా మారుతోందనీ, బిహార్, ఉత్తరప్రదేశ్‌లో బలంగా ఉన్న బ్రాహ్మణులు సైతం తాము వెనుకబడ్డామని చెప్పుకుంటున్నారని గుర్తుచేశారు.