శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chj
Last Modified: సోమవారం, 30 జులై 2018 (18:38 IST)

చంద్రబాబుపై వ్యక్తిగత దూషణలు సరికాదు... వైసీపీపై డొక్కా ఆగ్రహం

అమరావతి : రాష్ట్ర విభజన చట్టం అమలులో విఫలమైన నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని పార్లమెంట్ సాక్షిగా దోషిగా నిలబెడుతున్న సీఎం చంద్రబాబు నాయుడును సమర్థించకపోగా, వ్యక్తిగతంగా విమర్శించడం సరికాదని శాసనమండలి ప్రభుత్వ విప్ డొక్కా మాణిక్యవరప్రసాద్ ఆగ్రహం వ్యక్తంచేశ

అమరావతి : రాష్ట్ర విభజన చట్టం అమలులో విఫలమైన నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని పార్లమెంట్ సాక్షిగా దోషిగా నిలబెడుతున్న సీఎం చంద్రబాబు నాయుడును సమర్థించకపోగా, వ్యక్తిగతంగా విమర్శించడం సరికాదని శాసనమండలి ప్రభుత్వ విప్ డొక్కా మాణిక్యవరప్రసాద్ ఆగ్రహం వ్యక్తంచేశారు. బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణతో ఆయన పార్టీకి చెందిన నేతలు అవినీతిపై క్లాస్‌లు చెప్పించుకోవాలని ఎద్దేవా చేశారు. సచివాలయంలోని నాలుగో బ్లాక్ పబ్లిసిటీ సెల్‌లో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వంపై సీఎం చంద్రబాబు నాయుడు పోరాటం ప్రారంభించినప్పటి నుంచి దేశంలో నరేంద్రమోదీ ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారన్నారు. 
 
బీజేపీ మిత్రపక్షాలుగా ఉన్న శివసేన నాయకులు, జేడీయూ నితీష్ కుమార్, పాశ్వాన్ వంటివారు నరేంద్ర మోదీ ప్రజా వ్యతిరేక విధానాలను నిలదీస్తున్నారన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టానికి పాత రూపం కల్పించాలంటూ టీడీపీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు... రాష్ట్రపతి కోవింద్‌ను కలిసి కోరామన్నారు. 9వ షెడ్యూల్‌లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని చేర్చాలని కోరామన్నారు. దేశంలో ఎవరూ చేయనివిధంగా పీఎం నరేంద్రమోడీకి వ్యతిరేకంగా రాష్ట్రానికి రావాల్సిన హక్కుల కోసం సీఎం చంద్రబాబునాయుడు పోరాటం ప్రారంభించారన్నారు. 
 
సీఎంను సమర్ధించకపోగా, రాష్ట్రంలోని ప్రతిపక్షాలు ముఖ్యంగా వైఎస్ఆర్ సిపి విమర్శలకు దిగడం దారుణమన్నారు. సీఎంపై వ్యక్తిగత దాడులకు దిగడం సరికాదన్నారు. ప్రస్తుతం బ్యాంకులు దివాలా తీయడానికి కారణం నరేంద్రమోడీ విధానాలేనని విమర్శించారు. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయే పారిశ్రామికవేత్తల కోసం పనిచేస్తున్నానని నరేంద్రమోదీ చెప్పడం దారుణమన్నారు. బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ... అవినీతి గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఆయన దగ్గర బీజేపీ నేతలు, అన్నా హజారే వంటి వారు క్లాసులు తీసుకోవాలని ఎద్దేవా చేశారు. కన్నా వ్యాఖ్యలకు ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. 
 
మహాత్ముడు.. బిర్లాతో ఉన్నారని, ఆయనలాగే తానూ పారిశ్రామిక వేత్తల కోసం పనిచేస్తున్నాని ప్రధాని నరేంద్రమోదీ అనడం దుర్మార్గమన్నారు. గాంధీజీతో ప్రధాని నరేంద్రమోడీ పోల్చుకోవడం దారుణమన్నారు. దీనిద్వారా ఆయన దుర్నీతి వెల్లడవుతుందన్నారు. విదేశీ బ్యాంకుల్లో మూలుగుతున్న నల్లధనాన్ని వెలికితీసి, దేశ ప్రజలకు ఒక్కొక్కరికీ రూ.15 లక్షల చొప్పున వేస్తానన్న నరేంద్రమోడీ ఇపుడా ఆ ఊసేఎత్తడం లేదన్నారు. దెయ్యాలు వేదాలు వల్లిస్తునట్లు నరేంద్రమోడీ మాట్లాడుతున్నారన్నారు. 
 
రాష్ట్రం కోసం కేంద్ర ప్రభుత్వంతో సీఎం చంద్రబాబు చేస్తున్న పోరాటం కీలకదశలో చేరుకున్న సమయంలో కేవీపీ వంటి నేతలు కూడా అండగా ఉండకపోగా, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా లేఖలు రాయడం సరికాదన్నారు. దీనివల్ల ప్రజల దృష్టి వేరే విషయాలపై మళ్లే ప్రమాదముందన్నారు. పార్లమెంట్ చర్చ సందర్భంగా కాపు రిజర్వేషన్లను 9వ షెడ్యూల్ చేర్చాలని తమ ఎంపీ అవంతి శ్రీనివాస్ లోక్‌సభలో మాట్లాడారన్నారు. రాజ్యసభలో ఉన్న వైఎస్ఆర్ సిపి ఎంపీ విజయసాయిరెడ్డి కనీసం కాపు రిజర్వేషన్లపై మాట్లాడకపోవడం దారుణమన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం పోరాటం చేయడమే కాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీలతో నిరుద్యోగుల సంక్షేమానికి కృషి చేస్తున్న సీఎం చంద్రబాబు నాయుడుపైనా, మంత్రి లోకేష్ పైనా అనవసర విమర్శలు మానుకోవాలని వైఎస్ఆర్ సిపి నేతలకు శాసనమండలి ప్రభుత్వ విప్ డొక్కా మాణిక్యవరప్రసాద్ హితవు పలికారు.