సుమంత్ కథ మళ్లీ మొదలైంది
గత కొన్నిరోజులుగా సుమంత్ మళ్లీ పెళ్లిచేసుకోబోతున్నారు అంటూ ఓ వెడ్డింగ్ కార్డ్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతూ ఉంది. దీనిపై హీరో సుమంత్ స్పందిస్తూ `తాను మళ్లీ పెళ్లి చేసుకోవడం లేదని, ప్రస్తుతం తాను నటిస్తున్న సినిమా డైవర్స్ మరియు రీ మ్యారేజ్ కి సంభందించిన అంశాలతో కూడుకున్నదని, తెలుగులో ఇలాంటి కథతో మొదటిసారి ఓ సినిమా వస్తుందని అందులో నుండే ఒక వెడ్డింగ్‌కార్డ్ లీకైందని` వివరణ ఇచ్చిన విషయం తెలిసిందే.
సుమంత్ హీరోగా నటిస్తున్న ఆ చిత్రానికి `మళ్ళీ మొదలైంది` అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌ను ప్రకటించారు మేకర్స్. విడాకులు, మళ్లీ పెళ్లి చేసుకోవడం నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం ద్వారా టీజీ కీర్తికుమార్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. నైనా గంగూలి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీని రెడ్ సినిమాస్ పతాకంపై కె. రాజశేఖర్ రెడ్డి నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయ్యింది.
ఫస్ట్ లుక్ పోస్టర్ లో మొదటిఫోటోలో సుమంత్ - నైనా ఒకరినొకరు హత్తుకొని బెడ్ మీద పడుకొని ఉండడం అలాగే రెండో ఫోటోలో వారిద్దరి మధ్య దూరం మరింత పెరిగినట్లు చూపించారు. విడాకుల తర్వాత జీవితాన్ని ఈ చిత్రంలో చూపించబోతున్నారనేది ఈ పోస్టర్ ద్వారా తెలుస్తోంది.
సుహాసిని మణిరత్నం, వెన్నెల కిషోర్, మంజుల ఘట్టమనేని, పోసాని కృష్ణ మురళి కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీత దర్శకుడు. జీఆర్ఎన్ సినిమాటోగ్రాఫర్.