శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్

#SyeRaaNarasimhaReddy పక్కా బ్లాక్‌బస్టర్ హిట్... నెటిజన్స్ కామెంట్స్

మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం "సైరా నరసింహా రెడ్డి". ఈ చిత్రం గాంధీ జయంతి రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాన్ ఇండియా సినిమాగా వచ్చిన సైరా నరసింహా రెడ్డి... తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల చేశారు. 
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా బెనిఫిట్ షోలు ప్రదర్శించారు. తెలంగాణలో ఉదయం 8 గంటలకు తొలి షో ప్రారంభమైంది. పొరుగు రాష్ట్రమైన తమిళనాడులో 8.30 గంటలకు తొలి ఆట పడింది. బాలీవుడ్‌లో గత రాత్రే జర్నలిస్టులకు ప్రత్యేకంగా ‘సైరా’ సినిమాను ప్రదర్శించారు. 
 
ఇక, అమెరికాలో ప్రీమియర్ షోలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. చూసినవారు సినిమాపై తమ అభిప్రాయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాను చూసిన వారు చిరంజీవి నటనకు ముగ్ధులవుతున్నారు. సినిమా పక్కాగా బ్లాక్ బస్టర్ అని చెబుతున్నారు. 
 
సినిమాలోని డైలాగులు రోమాలు నిక్కబొడిచేలా చేస్తున్నాయని, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, విజువల్స్, యుద్ధ సన్నివేశాలు సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయని ప్రశంసిస్తున్నారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రకు చిరంజీవి జీవం పోశారని కొనియాడుతున్నారు. నయనతార, తమన్నాల నటన కూడా అద్భుతమని ట్వీట్లు చేస్తున్నారు.
 
ఓవర్సీస్ రివ్యూ 
 
చిత్రం: సైరా న‌ర‌సింహా రెడ్డి
నిర్మాణ సంస్థ: కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ
న‌టీన‌టులు: చిరంజీవి, అమితాబ్ బ‌చ్చ‌న్‌, విజ‌య్ సేతుప‌తి, కిచ్చాసుదీప్, జ‌గ‌ప‌తిబాబు, న‌య‌న‌తార‌, త‌మ‌న్నా, అనుష్క‌, ర‌వికిష‌న్‌, నిహారిక‌, బ్ర‌హ్మానందం, ర‌ఘుబాబు త‌దిత‌రులు. 
ర‌చ‌న‌: ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్‌, సాయిమాధ‌వ్ బుర్రా
సంగీతం: అమిత్ త్రివేది
నిర్మాత‌: రామ్‌చ‌ర‌ణ్‌
ద‌ర్శ‌క‌త్వం: సురేంద‌ర్ రెడ్డి
 
మెగాస్టార్ చిరంజీవి రెండు దశాబ్దాల కల ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి. ఎట్టకేలకు ఆయన కల సైరా నరసింహా రెడ్డి రూపంలో ఫలించింది. తన 151వ చిత్రంగా సైరా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ హీరో 150 చిత్రాలు చేసినప్పటికీ.. ఇప్పటివరకు ఒక్కటంటే ఒక్క హిస్టారికల్ మూవీ కూడా చేయలేదు. ఎప్ప‌టి నుంచో భ‌గ‌త్ సింగ్ త‌ర‌హా స్వాతంత్ర్యోద‌మ వీరుడి పాత్ర చేయాల‌నుకున్నాడు. కానీ అది ఇప్పటికీ సాధ్యపడలేదు. 
 
ఇంతలోనే, చ‌రిత్ర‌లో క‌నుమ‌రుగైన తొలి సాతంత్ర్య వీరుడు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి చిత్రాన్ని చేయాల‌ని ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ అడిగినా.. బ‌డ్జెట్ ప‌రిమితులు లేక‌పోవ‌డం, తెలుగు సినిమా మార్కెట్ పరిమితంగా ఉండ‌టంతో ఈ సినిమాను చిరంజీవి చేయ‌లేక‌పోయారు. అయితే దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి నిర్మించిన "బాహుబ‌లి"తో తెలుగు సినిమా మార్కెట్ పెరిగింది. 
 
ఈ పరిస్థితుల్లో వెండితెరపై రీ ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి.. ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి సినిమా చేయాల‌నే విష‌యం చేరింది. హిస్టారిక‌ల్ మూవీ కావ‌డంతో భారీ బడ్జెట్ అవ‌స‌రం. ఇలాంటి స‌మ‌యంలో తండ్రి రీ ఎంట్రీ చిత్రాన్ని నిర్మించిన రామ్‌చ‌రణే ఈ హిస్టారిక్ మూవీ చేయ‌డానికి ముందుకు వ‌చ్చారు. తండ్రి డ్రీమ్ ప్రాజెక్ట్ కావ‌డంతో చ‌ర‌ణ్ ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. ప్యాన్ ఇండియా సినిమాగా చేయాల‌నే ఉద్దేశంతో అమితాబ్‌, విజ‌య్ సేతుప‌తి, కిచ్చాసుదీప్‌, న‌య‌న‌తార‌, అనుష్క‌, త‌మ‌న్నా, జ‌గ‌ప‌తిబాబు ఇలా భారీ తారాగ‌ణంతో సినిమాను నిర్మించారు.
 
అదేసమయంలో ఈ చిత్రం మొదలైనప్పటి నుంచి వచ్చిన వివాదాలు అన్నీ ఇన్నీకావు. ఉయ్యాల‌వాడ వంశీకుల నుంచి వివాదం, ఆందోళ‌న‌లు, కోర్టులు, కేసులంటూ సాగాయి. ఈ విఘ్నాలన్నింటీ విజయవంతంగా దాటుకుని గాంధీ జయంతి రోజున ప్రేక్షకుల ముందుకు సైరా రూపంలో వచ్చారు చిరంజీవి. మరి ఈ సైరా నరసింహా రెడ్డి కథ ఎలా ఉందో ఓసారి తెలుసుకుందాం.
 
క‌థ‌:
తొలి స్వాతంత్ర్య స‌మ‌ర స‌మయంలో పాల్గొన్న ఝాన్సీ ల‌క్ష్మీబాయ్(అనుష్క‌) త‌న సైనికుల్లో స్ఫూర్తి నింప‌డానికి రేనాడు వీరుడు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి క‌థ‌ను చెప్ప‌డంతో సినిమా ప్రారంభమవుతుంది. ప్ర‌థ‌మ స్వాతంత్య్ర స‌మ‌రం కంటే ముందు.. అంటే 1847లో రాయ‌ల‌సీమలోని ఉయ్యాల‌వాడ ప్రాంతానికి చెందిన పాలెగాడు న‌ర‌సింహా రెడ్డి(చిరంజీవి). బ్రిటీష్ వారు ప‌రిపాల‌న‌లో ఉన్న ఈ ప్రాంతంలో 61 మంది పాలెగాళ్లు ఉండేవారు. వారిలో న‌ర‌సింహారెడ్డి కూడా ఓ పాలెగాడు. 
తీవ్ర‌మైన క‌రువు వ‌చ్చిన‌ప్పుడు బ్రిటీష్‌వారు ఆ ప్రాంతంలోని రైతులు, వ్యాపారుల‌ను ప‌న్నులు క‌ట్ట‌మ‌ని వేధించ‌డం మొద‌లు పెడతారు. గురువు గోసాయి వెంక‌న్న(అమితాబ్ బ‌చ్చ‌న్‌) స్ఫూర్తితో బ్రిటీష్‌వారు చేసే అకృత్యాలు చూడ‌లేక న‌ర‌సింహా రెడ్డి వారికి ఎదురుతిరుగుతాడు. ఈయ‌న‌కు అవుకు రాజు(కిచ్చాసుదీప్‌), రాజా పాండి(విజ‌య్ సేతుప‌తి), వీరా రెడ్డి(జ‌గ‌ప‌తిబాబు) త‌దిత‌రులు అండ‌గా నిలుస్తారు. 
 
వీరందరి సహకారంతో పాటు.. గురువు ప్రోత్సాహంతో బ్రిటీష్‌వారిని ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి ఎదిరించాడు. అలాగే, వారితో న‌ర‌సింహా రెడ్డి ఎలాంటి పోరాటాలు చేశాడు. చివ‌ర‌కు ఆయ‌న్ని బ్రిటీష్‌వారు ఎలా బంధించి ఉరి తీశారనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే..
 
విశ్లేష‌ణ‌:
ఆరవై యేళ్ళ వయసులోనూ యాక్ష‌న్ పార్ట్ ఉన్న స్వాతంత్ర్యోద్య‌మ నాయ‌కుడి సినిమాలో న‌టించ‌డం అంత సుల‌భం కాదు. కానీ మెగాస్టార్ చిరంజీవి ఉయ్యాల‌వాడ న‌ర‌సింహా రెడ్డి పాత్ర‌లో జీవించాడు. ఆయన లుక్ చ‌క్క‌గా స‌రిపోయింది. ఇక యాక్ష‌న్ పార్ట్‌లో చిరు చేసిన స్టంట్స్ చూసి ఆశ్చ‌ర్య‌పోవాల్సిందే. ఇక ఎమోష‌న‌ల్ సీన్స్‌లోనూ అద్భుతంగా న‌టించాడు. ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశంలో చిరు న‌ట‌న అభినంద‌నీయం. 
 
ఇక బాలీవుడ్ సూప‌ర్‌స్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్ ఉన్న కాసేపు కూడా త‌న‌దైన న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్నారు. అవుకురాజు పాత్ర‌లో కిచ్చాసుదీప్, రాజా పాండి పాత్ర‌లో విజ‌య్ సేతుప‌తి, సిద్ధ‌మ్మ పాత్ర‌లో న‌య‌న‌తార‌, లక్ష్మీ పాత్ర‌లో త‌మ‌న్నా, వీరారెడ్డి పాత్ర‌లో జ‌గ‌ప‌తిబాబు ఇలా అంద‌రూ వారి వారి పాత్ర‌ల‌కు త‌మ న‌ట‌న‌తో ప్రాణం పోశారు. 
 
సాంకేతికంగా చూస్తే.. ఓ స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుడి సినిమాను అప్ప‌టి కాలానికి తగిన‌ట్లు తెర‌కెక్కించ‌డం అంటే అంత సులువైన విష‌యం కాదు. అది కూడా చ‌రిత్ర‌లో క‌నుమ‌రుగైన ఓ స‌మ‌ర‌యోధుడి క‌థ‌ను రూపొందిన ద‌ర్శ‌కుడు సురేంద‌ర్ రెడ్డి, నిర్మాత రామ్‌చ‌ర‌ణ్‌ల‌ను అభినందించాలి. ముఖ్యంగా రామ్‌చ‌ర‌ణ్ ప్రొడ‌క్ష‌న్ విలులకు ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. సినిమాలోని ప్ర‌తి స‌న్నివేశం ఎంతో రిచ్‌గా ఉంది.
 
ద‌ర్శ‌కుడు సురేంద‌ర్ రెడ్డి సినిమాను విజువ‌ల్ వండ‌ర్‌లా తెరకెక్కించాడు. ఇప్ప‌టివ‌ర‌కు సురేంద‌ర్ రెడ్డి చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తు అయితే, సైరా నరసింహా రెడ్డి మరో ఎత్తు. సినిమాను ఆయ‌న శ‌క్తిమేర చ‌క్క‌గా తెర‌కెక్కించాడు. అమిత్ త్రివేది సంగీతం, జూలియ‌స్ పేకియం నేప‌థ్య సంగీతం బావున్నాయి. రత్నవేలు సినిమాటోగ్ర‌ఫీ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌ర‌క్క‌ర్లేదు. ప్ర‌తి స‌న్నివేశాన్ని చ‌క్క‌గా త‌న కెమెరాలో బంధించాడు. ముఖ్యంగా యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను కెమెరాలో చ‌క్క‌గా విజువ‌లైజ్ చేశాడు. 
 
హిస్టారిక‌ల్ మూవీని ఓ స్టార్ హీరో చేస్తున్న‌ప్పుడు అందులో కాస్త సినిమాటిక్ లిబ‌ర్టీని తీసుకోవ‌డంలో త‌ప్పులేదు. కానీ ఇందులో ఆ స్వేచ్ఛ కాస్త ఎక్కువగా ఉందని చెప్పొచ్చు. మూడు నాలుగు తాలూకాలను పాలించే పాలెగాడు న‌ర‌సింహారెడ్డి. ఆయ‌న వేలాది మంది బ్రిటీష్ సైన్యాన్ని ఊచ‌కోత కోయ‌డం అన్న‌ట్లు చూపించారు. అలాగే న‌ర‌సింహా రెడ్డి ఎక్కువ‌గా గొరిల్లా యుధ్ధానికి ప్రాధాన్య‌త ఇచ్చి పోరాటం చేశాడు. మొత్తంమీద సైరా చిత్రంతో చిరంజీవి మరోమారు వెండితెర రారాజు అనిపించుకున్నారు. 
 
ఈ చిత్రం ప్లస్ పాయింట్లను పరిశీలిస్తే, చిత్ర హీరో మెగాస్టార్‌త పాటు అమితాబ్, ఇంటెన్స్ ఇంట‌ర్వెల్‌, యాక్ష‌న్ ఎపిసోడ్స్‌, దేశ‌భ‌క్తి స‌న్నివేశాలు, భారీ తారాగ‌ణం, వారి న‌ట‌న‌, అదిరిపోయే నిర్మాణ విలువ‌లు. మైనస్ పాయింట్ల విషయానికి వస్తే, ఫ‌స్టాఫ్ స్లోగా ఉండ‌టం, చిన్న పాలెగాడుని ఓ పెద్ద చ‌క్ర‌వ‌ర్తి అనే త‌ర‌హాలో సినిమా యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను చిత్రీకరించడం. మొత్తంమీద ఈ చిత్రం చూస్తున్నంత సేపు ప్రేక్షకుడికి రోమాలు నిక్కబొడుచుకోవడమే కాదు మనస్సంతా దేశభక్తితో నిండిపోతుంది.