తల్లి మనసు కి వినోదపుపన్ను మినహాయింపు ఇవ్వాలి:ఆర్.నారాయణమూర్తి
R. Narayanamurthy, Mutyala Subbaiah, Pokuri Baburao etc
"తల్లి మనసు" చిత్రానికి ప్రభుత్వం వినోదపుపన్ను మినహాయింపు ఇవ్వాలని ప్రముఖ నటుడు, దర్శకనిర్మాత ఆర్. నారాయణ మూర్తి అభిలషించారు. రచిత మహాలక్ష్మి, కమల్ కామరాజు, సాత్విక్, సాహిత్య ప్రధాన పాత్రధారులుగా ముత్యాల మూవీ మేకర్స్ పతాకంపై సీనియర్ దర్శకుడు ముత్యాల సుబ్బయ్య సమర్పణలో ఆయన తనయుడు ముత్యాల అనంత కిషోర్ తొలిసారి నిర్మాతగా మారి, నిర్మించిన చిత్రమిది.
కాగా తెలుగు సినీ డైరెక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ చిత్రం యూనిట్ కు అభినందన సత్కారం జరిగింది. ఈ సందర్భంగా దర్శకుల అసోసియేషన్ కు ఈ చిత్రం ప్రదర్శనను హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో ఏర్పాటు చేశారు. చిత్రాన్ని తిలకించిన అనంతరం ఆర్. నారాయణమూర్తి మాట్లాడుతూ, "ధూమపానం, మధ్యపానం హానికరమని తెలియజేసేందుకు ప్రకటనల కోసం ప్రభుత్వాలు కోట్లాది రూపాయలు వెచ్చిస్తుంటాయి. అవయవదానం విశిష్టతను సైతం ప్రభుత్వాలు ప్రచారం చేస్తుంటాయి. అయితే అవయవదానం ప్రాముఖ్యతను తెలియజేయడంతో పాటు తల్లి త్యాగనిరతిని, గొప్పతనాన్ని ఆవిష్కరించిన ఇలాంటి మంచి చిత్రాలను ప్రేక్షకులతో పాటు ప్రభుత్వాలు ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకోసం ఈ చిత్రానికి వినోదపు పన్ను మినహాయింపు ఇవ్వాలి" అని అన్నారు.
సీనియర్ నిర్మాత పోకూరి బాబూరావు మాట్లాడుతూ, "మనసుకు హత్తుకునే సినిమా ఇది. సెకండ్ ఆఫ్ హైలైట్" అని పేర్కొనగా, సినిమాను చూస్తున్నంత సేపు ప్రేక్షకులు కథలో, పాత్రలలో లీనమవుతారు అన్న అభిప్రాయాన్ని దర్శకులు భీమనేని శ్రీనివాసరావు, ముప్పలనేని శివ వ్యక్తంచేశారు.
చిత్ర సమర్పకులు ముత్యాల సుబ్బయ్య మాట్లాడుతూ, చాలాకాలం తర్వాత ఓ మంచి చిత్రాన్ని చూశామంటూ ప్రేక్షకులు చెబుతుండటం ఎనలేని సంతోషాన్ని కలిగించిందని చెప్పారు. తల్లి తపన, భావోద్వేగాన్ని ఆవిష్కరించిన ఈ చిత్రంలో మంచి ఎంటర్ టైన్మెంట్ ఉందని అన్నారు. మంచి చిత్రాలు రావడం లేదని కొందరు అంటుంటారని, అయితే ఇలాంటి మంచి చిత్రాలు చూసి, ఆదరించినప్పుడు ఇలాంటి చిత్రాలు తీసేందుకు స్ఫూర్తిదాయకం అవుతుందని అన్నారు. తమ తమ కుటుంబ సభ్యులతో కలసి మహిళలు మరింతగా ఆదరించాల్సిన చిత్రమిదని అన్నారు. చిత్రానికి వచ్చిన మంచి టాక్ తో కలెక్షన్లు మరింతగా పెరుగుతాయని తాము భావిస్తున్నామని చెప్పారు. అలాగే నిర్మాతగా ఓ మంచి చిత్రం తీయాలన్న మా పెద్ద అబ్బాయి అనంత కిశోర్ సంకల్పం, అభిరుచే ఈ చిత్ర నిర్మాణానికి దోహదం చేసిందని అన్నారు.
చిత్ర నిర్మాత ముత్యాల అనంత కిషోర్ మాట్లాడుతూ , తొలి రోజు, మార్నింగ్ షోతోనే చూసి తీరాల్సిన చిత్రమన్న టాక్ రావడంతో ప్రేక్షకుల ఆదరణ పెరుగుతూ వస్తోందని, ఇది మేము తీసిన చిత్రమని చెప్పడం కాకుండా మంచి పాయింట్ తో తీసిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు మిస్ కావద్దని విజ్ఞప్తి చేస్తున్నామని అన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో చిత్ర దర్శకుడు శ్రీనివాస్ (సిప్పీ), మాటల రచయిత నివాస్, ఇతర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.