గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : బుధవారం, 3 ఫిబ్రవరి 2021 (14:17 IST)

రాజేష్ టచ్‌రివర్ 'సైనైడ్'లో హాలీవుడ్ నాయిక తనిష్టా చటర్జీ

Chatterjee, Rajesh Touchjariver 'Cyanide'
జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు పలు అందుకున్న రాజేష్ టచ్‌రివర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక పాన్ ఇండియా మూవీ 'సైనైడ్'. ఇప్పుడీ సినిమా ప్రధాన తారాగణంతో తనిష్టా ఛటర్జీ కూడా చేరారు. ఈ సినిమాలో  పోలీస్ అధికారిగా ప్రియమణి ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ సినిమాలో మలయాళ నటుడు సిద్దిఖ్, కన్నడ నటుడు రంగాయన రఘు, తెలుగు నటుడు తనికెళ్ల భరణి తదితరులు నటిస్తున్న సంగతి తెలిసిందే.
 
బుస్సాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, లండన్ ఏషియన్ ఫిల్మ్ ఫెస్టివల్ నుంచి తనిష్టా ఛటర్జీ అవార్డులు అందుకున్నారు. ఆరు సార్లు ఆస్కార్ నామినేషన్లు పొందడంతో పాటు బాప్టా అవార్డులను గెలుచుకున్న ఇరాన్ దర్శకుడు మజీద్ మజీద్ రూపొందించిన 'లయన్', 'బియాండ్ ది క్లౌడ్స్', 'యాంగ్రీ ఇండియన్ గాడ్స్', 'పార్ట్చ్' చిత్రాలతో ఆమె మంచి పేరు తెచ్చుకున్నారు. జర్మన్ చిత్రం 'షాడోస్ ఆఫ్ ది టైమ్స్'లో నటనకు గాను టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో తనిష్టా ఛటర్జీని మూడు ప్రధాన అవార్డులు వరించాయి. ఆస్ట్రేలియన్ క్రికెటర్ బ్రెట్లీ నటించిన 'ఆన్ ఇండియన్' చిత్రంలో కూడా ఆమె నటించారు. 'రోమ్ రోమ్ మెమ్' (2019), 'అన్పోస్టెడ్' (2020) చిత్రాలకు దర్శకత్వం వహించారు. పేరు ప్రఖ్యాతలు గల తనిష్టా 'సైనైడ్'లో నటిస్తుండటం విశేషం.  
 
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత ప్రదీప్ నారాయణన్ మాట్లాడుతూ "తనిష్టా ఛటర్జీ రాకతో మా 'సైనైడ్' టీమ్ మరింత బలపడింది. ఆమె మా సినిమాలో భాగం కావడం చాలా ఆనందంగా ఉంది" అన్నారు.
 
మరో నిర్మాత కె. నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ "ఈ నెల 15న సినిమా ప్రారంభం అవుతుంది. మైసూర్, మంగుళూరు, కేరళలోని పలు ప్రాంతాలలో చిత్రీకరణ చేస్తున్నాం అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో, సరికొత్త స్క్రీన్ ప్లేతో నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగు సినిమా చరిత్రలో ఒక మైలురాయిలాగా నిలిచిపోతుంది" అని అన్నారు.
 
ఈ సందర్భంగా దర్శకుడు రాజేష్ టచ్ రివర్ మాట్లాడుతూ "సైనైడ్ మోహన్ సంచలనాత్మక కేసును ప్రేరణగా తీసుకొని 'సైనైడ్' చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నాం. కథాంశానికి వస్తే... 20మంది అమ్మాయిలలో ప్రేమను ప్రేరేపించి, శారీరకంగా అనుభవించాక వారికి 'సైనైడ్' ఇచ్చి వాళ్ల బంగారు ఆభరణాలతో ఉడాయించే సైనైడ్ మోహన్ కేసు ప్రేరణతో ఈ కథ రూపొందించాం" అని అన్నారు.
 
పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ చిత్రంలో . తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ప్రియమణి ప్రధాన పాత్రలో నటిస్తుండగా... హిందీలో ఇదే పోలీసాఫీసర్ పాత్రలో యశ్ పాల్ శర్మ నటిస్తున్నారు.  
 
ఇంకా ఈ చిత్రం లో చిత్రంజన్ గిరి, తణికెళ్లభరణి, రాంగోపాల్ బజాజ్, సిజ్జు, శ్రీమాన్, సమీర్, రోహిణి, సంజు శివరామ్, షాజు, ముకుందన్, రిజు బజాజ్, తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు అంతర్జాతీయ అవార్డు గెలుచుకున్న బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ జార్జ్ జోసెఫ్ నేపథ్య సంగీతం, డాక్టర్ గోపాల శంకర్ స్వరాలు అందించనున్నారు. ఎంజీఆర్ శివాజీ అకాడమీ అవార్డు గ్రహీత శశి కుమార్ ఎడిటింగ్. జాతీయ అవార్డు గ్రహీత అజిత్ అబ్రహం సౌండ్ డిజైనింగ్ చేస్తున్నారు .