శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 10 నవంబరు 2023 (10:01 IST)

దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావుకు తెలంగాణ హైకోర్టు నోటీసు

K. Raghavendra Rao
చిత్రపరిశ్రమకు కేటాయించిన భూమిని తన సొంతానికి వాడుకున్నట్టు గత 2012లో నమోదైన కేసులో దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావుకు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీచేసింది. ఈ కేసు వివరాలను పరిశీలిస్తే, చిత్రపరిశ్రమకు కేటాయించిన భూమిని రాఘవేంద్ర రావు, ఆయన కుటుంబ సభ్యులు తమ సొంతాని వాడుకున్నారంటూ గత 2012లో హైకోర్టులో ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఈ కేసులోనే ఆయనకు మరోమారు నోటీసు జారీ అయింది. 
 
హైదరాబాద్ బంజారా హిల్స్‌ ప్రాంతంలోని షేక్‌పేటలో 2 ఎకరాల భూమిని అప్పటి ప్రభుత్వం చిత్రపరిశ్రమకు కేటాయించింది. దీన్ని రాఘవేంద్ర రావు తన సొంతానికి వాడుకున్నట్టు ఆయనకు వ్యతిరేకంగా దాఖలైన పిల్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై కోర్టు గతంలో ఓసారి నోటీసులు కూడా జారీచేసింది. కానీ అవి రాఘవేంద్ర రావుకు అందినట్టు రికార్డులు లేకపోవడంతో మరోమారు నోటీసులు జారీచేస్తూ తదుపరి విచారణను జనవరి 18వ తేదీకి వాయిదా వేసింది. 
 
మెదక్‌కు చెందిన బాలకిషన్ అనే వ్యక్తి గత 2012లో ఈ పిల్‌ను దాఖలు చేశారు. సర్వే నంబర్ 403/1లోని 2 ఎకరాల భూమిని వాణిజ్య అవసరాల కోసం వినియోగించడం నిబంధనలకు విరుద్ధమని గుర్తుచేశారు. ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి అలోక్ అరథే, జస్టిస్ ఎన్వీ శ్రవణ్ కుమార్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టి, ప్రతివాదులైన రాఘవేంద్ర రావు, ఆయన బంధువులు కృష్ణమోహన్ రావు, చక్రవర్తి, విజయలక్ష్మి, అఖిలాండేశ్వరి, లాలస దేవికి నోటీసులు జారీచేసింది.