గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 21 ఫిబ్రవరి 2023 (09:53 IST)

విద్య, వైద్యం ఉచితంగా ఇవ్వాలనే రాజ్యాంగ హక్కును కాలరాస్తున్నారు : ఆర్. నారాయణమూర్తి ధ్యజం

Venky Atluri, R. Narayanamurthy, Suryadevara Nagavanshi
Venky Atluri, R. Narayanamurthy, Suryadevara Nagavanshi
ప్రైవేట్ సెక్టార్ వద్దు, పబ్లిక్ సెక్టార్ ముద్దు అనే సందేశాన్ని చాటి చెప్పిన సార్ చిత్రానికి హ్యాట్సాఫ్ - అని పీపుల్ స్టార్ ఆర్. నారాయణమూర్తి అన్నారు. ధనుష్, సంయుక్త మీనన్ జంటగా నటించిన ఈ చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలు. ఈ  సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతుండటంతో తాజాగా చిత్ర బృందం విజయోత్సవ సభను నిర్వహించి తమ సంతోషాన్ని పంచుకున్నారు. ఈ వేడుకను ప్రారంభించే ముందు ఇటీవల స్వర్గస్తులైన సినీ నటుడు నందమూరి తారకరత్నకు నివాళులు అర్పిస్తూ చిత్ర బృందం కాసేపు మౌనం పాటించారు.
 
Sar success meet
Sar success meet
అనంతరం ముఖ్య అతిథి ఆర్. నారాయణ మూర్తి మాట్లాడుతూ.. "ముందుగా ఇలాంటి ఒక మంచి చిత్రాన్ని, ఒక గొప్ప చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. గుండెలకు హత్తుకునేలా సినిమా ఉంటే సూపర్ హిట్ చేస్తామని మరోసారి ప్రేక్షకులు నిరూపించారు. ఇంత మంచి సినిమా తీసిన దర్శకుడికి నా అభినందనలు. ఇలాంటి సినిమాలు తీయడం ఆశామాషి కాదు. దానికి గుండె ధైర్యం కావాలి. ఇది ఆర్ట్ ఫిల్మ్ కాదు.. కానీ ఆర్ట్ ఫిల్మే. ఇది కమర్షియల్ సినిమా కాదు.. కానీ కమర్షియల్ సినిమానే. అలా మాయ చేశాడు దర్శకుడు. ఇది ప్రజల సినిమా, స్టూడెంట్స్ సినిమా, పేరెంట్స్ సినిమా. జీవితంలో గుర్తుండిపోయే ఇలాంటి సినిమా తీసి హిట్ కొట్టిన నిర్మాతకు నా అభినందనలు. హాలీవుడ్ యాక్టర్ సిడ్నీ పోయిటియర్ నటించిన 'టు సర్, విత్ లవ్', ఎన్టీ రామారావు గారి 'బడిపంతులు', హృతిక్ రోషన్ నటించిన 'సూపర్ 30' లాగా ఇది కూడా సూపర్ డూపర్ హిట్. ఈ సినిమా గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. విద్య, వైద్యం అనేవి ప్రజలకు ఉచితంగా ఇవ్వాలని రాజ్యాంగ మనకు కల్పించిన హక్కు. కానీ అవి వ్యాపారం అయిపోయాయి. విద్య, వైద్యం వ్యాపారం కాకూడదు. పేదలందరికీ విద్య అందుబాటులో ఉండాలి..దర్శకుడు సినిమాని అద్భుతంగా తెరకెక్కించాడు. కొన్ని సన్నివేశాలు కంటతడి పెట్టించాయి. ప్రతి పాత్రను ఎంతో చక్కగా తీర్చిదిద్దారు. సంయుక్తమీనన్, సాయి కుమార్, సముద్రఖని, తనికెళ్ళ భరణి, హైపర్ ఆది అందరూ అద్భుతంగా నటించారు. కెమెరామెన్ 90ల బ్యాక్ డ్రాప్ ని చక్కగా చూపించారు. ధనుష్ గారు గొప్ప నటుడు. సహజంగా నటిస్తారు. భాషతో సంబంధం లేకుండా అందరికీ దగ్గరైన నటుడు. ఆయన నటనకు సెల్యూట్." అన్నారు.
 
నటుడు సుమంత్ మాట్లాడుతూ,  పాత్ర చిన్నదైనా పెద్దదైనా స్క్రిప్ట్ మొత్తం చదవడం అలవాటు. చదవగానే ఈ స్క్రిప్ట్ నాకు బాగా నచ్చింది. ఈ సబ్జెక్ట్ తీస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తుంది అనిపించింది. ఊహించిన దానికంటే పెద్ద విజయం సాధించింది. ఈ స్థాయిలో వసూళ్ళు రావడం సంతోషంగా ఉంది" అన్నారు.
 
చిత్ర దర్శకుడు వెంకీ అట్లూరి మాట్లాడుతూ.. "నిద్రాహారాలు మాని ఈ సినిమా కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అందరూ కలిస్తేనే ఈరోజు ఈ సక్సెస్. తనికెళ్ళ భరణి గారు సెట్ లో ఉంటే దైవత్వం ఉన్నట్లు ఉంటుంది. చాలా పాజిటివ్ ఎనర్జీ ఇచ్చారు. ఆయన ఈ సినిమాలో నటించడం మా అదృష్టం. సినిమాలో భాగమై ఇంతటి విజయానికి కారణమైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈ సినిమా విజయం సాధిస్తుందని సుమంత్ గారు ముందే అన్నారు. ఆయనను ప్రీరిలీజ్ కి రమ్మని అడిగితే సర్ప్రైజ్ రివీల్ అవ్వకుండా ఉండాలని, డైరెక్ట్ గా సక్సెస్ మీట్ కి వస్తానన్నారు. ఈ సినిమా విజయాన్ని ఆయన ముందుగానే ఊహించారు. ఆయన పరిచయమే ఒక అదృష్టంగా భావిస్తున్నాను" అన్నారు.
 
సాయి కుమార్ మాట్లాడుతూ.. "నారాయణమూర్తి గారు ఈ వేడుకకు రావడం సంతోషంగా ఉంది. ఇలాంటి మంచి సినిమాలో భాగమైనందుకు గర్వంగా ఉంది. ఈ చిత్రాన్ని ఆశీర్వదించిన ప్రేక్షకదేవుళ్ళు అందరికీ ధన్యవాదాలు. సినిమా చాలా బాగుందని అన్ని ప్రాంతాల నుంచి ఫోన్లు వస్తున్నాయి. నర్సన్నపేట నుంచి ఓ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ నా ఫోన్ నెంబర్ ఎలాగో సంపాదించి ఫోన్ చేసి.. ఈ సినిమా చూసి చాలా ఎమోషనల్ అయ్యాను. ఇది ప్రతి టీచర్, ప్రతి స్టూడెంట్, ప్రతి పేరెంట్ చూడాల్సిన సినిమా అన్నారు. విద్య నేపథ్యంలో వచ్చిన గొప్ప చిత్రాలలో ఒకటని కొనియాడారు. సినిమా చూసిన ప్రతి ఒక్కరికి నచ్చింది. ఇంత మంచి కథను తెరకెక్కించిన దర్శకుడు వెంకీకి, ఇలాంటి అద్భుతమైన కథకు మద్దతుగా నిలిచిన నిర్మాతలు వంశీ గారికి, సాయి సౌజన్య గారికి అభినందనలు." అన్నారు.
 
తనికెళ్ళ భరణి మాట్లాడుతూ.. "తల్లిదండ్రులు తర్వాత గురువే. తల్లిదండ్రులు జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు. ఒక దర్శకుడు ఒక అర్థవంతమైన కల కన్నాడు, ఒక సంస్కారవంతమైన కల కన్నాడు.. దానిని ప్రేక్షకులు సాకారం చేశారు. గతంలో గురువులను వేళాకోళం చేసేవాళ్ళు. చాలా బాధ కలిగేది నాకు. ఎందుకంటే మనం ఈ స్థాయికి రావడానికి గురువులే కారణం. వెంకీ ఈ సినిమా కోసం ఎంత కష్టపడ్డాడో మేం దగ్గరుండి చూశాం. ఇప్పుడు ఆ కష్టానికి తగ్గ ఫలితం పొందాడు.  ఈ సినిమాతో విశ్వనాథ్ గారిలాగా తనదైన ఒక ముద్రను ఆరంభించాడు. వెంకీ ఇలాంటి సంస్కారవంతమైన సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. గురువులకు లేచి నమస్కారం పెట్టాలనిపించే సంస్కారవంతమైన సినిమా ఇది. ధనుష్ చాలా గొప్ప దర్శకుడు. కొత్త దర్శకులను ప్రోత్సహించడంలో ముందుంటాడు. ఒక గొప్ప సినిమాలో నటించానని సంతృప్తిని మిగిల్చిన దర్శకనిర్మాతలకు ధన్యవాదాలు" అన్నారు.

ఈ సినిమాలో విద్యార్థులుగా నటించి అలరించిన పిల్లలతో ఈ వేడుకకు ప్రారంభించడం విశేషం. అలాగే ముఖ్య అతిథిగా హాజరైన నారాయణమూర్తితో కలిసి మూవీ టీమ్ కేక్ కట్ చేసి సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ ని సెలెబ్రేట్ చేసుకున్నారు.