సోమవారం, 14 అక్టోబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 15 మార్చి 2022 (19:20 IST)

స్టాండప్ కామెడీతోపాటు లవ్, ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్నాయి - రాజ్ తరుణ్

Raj Tarun, Varsha Bollamma, Bharat Maguluri, Santo Mohan Veeram
హీరో రాజ్ తరుణ్, వ‌ర్ష బొల్ల‌మ్మ జంట‌గా న‌టించిన సినిమా `స్టాండప్ రాహుల్`.  కూర్చుంది చాలు అనేది ట్యాగ్‌లైన్‌. శాంటో మోహన్ వీరంకి దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. ఈ సినిమాను డ్రీమ్ టౌన్ ప్రొడక్షన్స్ అండ్ హైఫైవ్ పిక్చర్స్ బ్యానర్ల‌పై నంద కుమార్ అబ్బినేని, భరత్ మాగులూరి నిర్మించారు. అన్ని కార్య‌క్ర‌మాలు ముగించుకుని ఈనెల 18న విడుద‌ల‌కాబోతుంది. ఈ సంద‌ర్భంగా మంగ‌ళ‌వారంనాడు ఫిలింన‌గ‌ర్ క‌ల్చ‌ర‌ర్ సెంట‌ర్‌లో జ‌రిగిన మీడియా స‌మావేశంలో చిత్ర యూనిట్ పాల్గొంది.
 
ఈ సంద‌ర్భంగా హీరో రాజ్ తరుణ్ మాట్లాడుతూ, ఈ క‌థ‌ను ద‌ర్శ‌కుడు శాంటో నాకు నాలుగు గంట‌ల‌పాటు చెప్పాడు. ప్ర‌తిదీ డిటైల్‌గా వివ‌రించాడు. వెంట‌నే మ‌రునిముషంలో చేస్తానని చెప్పాను. కానీ నాపై ఆయ‌న‌కు న‌మ్మ‌కం క‌ల‌గ‌లేదు. నేను చేస్తాన‌న్నానుగ‌దా! అని అంటే, కాదు. ఆడిష‌న్ కావాలి అన్నాడు. అలా ఆడిష‌న్ చేశాక ఆయ‌న‌కు నాపై పూర్తిన‌మ్మ‌కం ఏర్ప‌డింది. ఈ సినిమా మా రెండేళ్ళ జ‌ర్నీ. స్టాండప్ రాహుల్ అంటే అల‌రించే కామెడీతోపాటు ఫ్యామిలీ డ్రామా కూడా వుంది. ఇటువంటి కాన్సెప్ట్‌ను కొద్దిగా ఇటీవ‌లే పూజాహెగ్డే ఓ సినిమాలో చేసింది. అది మా సినిమాకు హెల్ప్ అవుతుంద‌ని చెప్ప‌గ‌ల‌ను. దానికి మించి కామెడీతోపాటు మంచి ఎమోష‌న్స్ కూడా మా సినిమాలో వుంటుంది. ఈ సినిమా నా కెరీర్‌కు బాగా ఉపయోగపడుతుంది. వ‌ర్ష పాత్ర చాలా క్యూట్‌గా వుంటుంది. ఆమెకు కొన్ని అభిప్రాయాలుంటాయి. వాటిని బేల‌న్స్ చేస్తూ, నా కుటుంబాన్ని కూడా చూసుకుంటూ స్టాండప్ కామెడీ ఎలా చేశాన‌నేది ఇందులో ద‌ర్శ‌కుడు బాగా డీల్ చేశారు. ఇటువంటి సినిమా ఇంత‌కుముందు రాలేదు. చిత్ర నిర్మాత‌లు క‌రోనా వ‌చ్చి మ‌ధ్య‌లో ఆగిపోయినా చాలా న‌మ్మ‌కంతో ఈ సినిమాకు ఎంత‌మేర‌కు కావాలో అన్ని సౌక‌ర్యాలు క‌ల్పించారు. ద‌ర్శ‌కుడికి ఈ సినిమా మంచి పేరు తెచ్చిపెడుతుంద‌ని న‌మ్మ‌క‌ముంది. థియేట‌ర్లోనే సినిమాను చూడండి. పైర‌సీని ఎంక‌రేజ్ చేయ‌కండ‌ని తెలిపారు.
 
హీరోయిన్ వర్ష బొల్లమ్మ మాట్లాడుతూ, ఈ చిత్రం నాకేకాదు అంద‌రికీ మంచి గుర్తింపు తెస్తుంది. క‌రోనాటైంలో అంద‌రూ ఒత్తిడికి గుర‌య్యాం. ఆ టైంలో చ‌క్క‌టి ఎంటర్‌టైన్ మెంట్ కోసం చూశాం. ఇలాంటి సినిమా చూస్తే మ‌న‌కు రిలీప్ వుంటుంది. థియేటర్లో సినిమాను చూసి ప్రేక్షకులు చిరునవ్వుతో బయటకు వస్తార‌నే న‌మ్మ‌కం నాకుంద‌ని అన్నారు.
 
దర్శకుడు శాంటో మాట్లాడుతూ, ఈ క‌థ రాసుకున్న‌ప్పుడే నా జీవితంలో జ‌రిగిన‌ సంఘ‌ట‌ల‌ను రాసుకున్నాను. నేను ఎక్క‌డా ద‌ర్శ‌క‌త్వ‌శాఖ‌లో ప‌నిచేయ‌లేదు. సినిమాలు కూడా పెద్ద‌గా చూడ‌ను. కానీ నా జీవ‌న‌పోరాట‌మే న‌న్ను ద‌ర్శ‌కుడిని చేసింది. సినిమావాళ్ళ‌కుకానీ, బేచిల‌ర్స్‌కానీ హైద‌రాబాద్‌లో ఇల్లు దొర‌క‌డం క‌ష్టం. ఇవి కూడా హీరో పాత్రలో చెప్పించాను. నేను జీవితంలో నేర్చుకున్న‌ది ఇప్ప‌టి యూత్‌కు స్పూర్తిగా వుండేలా ఈ సినిమా క‌థ‌ను రాసుకున్నాను. మ‌న కెరీర్‌లో ఎన్నో ఒడిదుడుగులు వుంటాయి. వాటిని స్టాండ‌ప్ కామెడీతో ఎలా వినోదాత్మ‌కంగా చెప్పించ‌వ‌చ్చో ఇందులో చెప్పాను.  నేను క‌థ చెప్పిన‌ప్పుడు ప్రతీ విషయంలోనూ డీటెయిల్‌గా వివరాలు నిర్మాతలకు ఇచ్చాను. కాస్ట్యూమ్స్, సంగీతం,  కలర్ వంటి అన్ని అంశాలు ఒక స్కెచ్ రూపంలో చూపించాను. అవ‌న్నీ చూశాక‌ నిర్మాతలకు నా పై పూర్తి నమ్మకం కలిగింది. ఈ చిత్రాన్ని సంగీతం, సాహిత్యం చ‌క్క‌గా కుదిరాయి. నిర్మాత‌లు నేను అనుకున్న‌దానికంటే ఎక్కువ స‌హ‌క‌రించారు. ఈనెల 18న థియేట‌ర్‌లో సినిమా చూసి ఆనందించండి అని తెలిపారు.