శుక్రవారం, 4 జులై 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 4 జులై 2025 (10:31 IST)

తాలిబన్ ప్రభుత్వాన్ని గుర్తించిన రష్యా.. మాస్కోలో కొత్త ఆఫ్ఘన్ రాయబారి...

ప్రపంచ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆప్ఘనిస్థాన్‌లోని తాలిబన్ ప్రభుత్వాన్ని రష్యా అధికారికంగా గుర్తించింది. 2021లో తాలిబన్లు అధికారాన్ని హస్తగతం చేసుకున్నప్పటి నుంచి ఏ దేశం కూడా వారి పాలనను గుర్తించలేదు. ఈ నేపథ్యంలో రష్యా తీసుకున్న ఈ నిర్ణయం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.
 
తాలిబన్లు నియమించిన కొత్త ఆప్ఘన్ రాయబారి గుల్ హాసన్‌ను గుర్తించినట్టు రష్యా ప్రకటించింది. గుల్ హాసన్ నుంచి రష్యా ఉప విదేశాంగ మంత్రి ఆండ్రీ రుడెంకో అధికారిక పత్రాలు స్వీకరించారు. ఈ మేరకు రష్యా విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. దీంతో పాటు మాస్కోలోని ఆప్ఘన్ రాయబార కార్యాలయంపై గత ప్రభుత్వ జెండాను తొలగించి తాలిబాన్ల తెల్ల జెండాను ఎగురవేశారు. 
 
ఈ గుర్తింపుతో ఇరు దేశాల మధ్య పలు రంగాల్లో నిర్మాణాత్మక ద్వైపాక్షిక సహకారం పెరుగుతుందని ఆశిస్తున్నట్టు పేర్కొంది. ముఖ్యంగా, వాణిజ్యం, ఇంధనం, రవాణా, వ్యవసాయ రంగాల్లో కలిసి పనిచేయడానికి ఆసక్తిగా ఉన్నట్టు తెలిపింది. రష్యా నిర్ణయాన్ని తాలిబాన్ ప్రభుత్వం స్వాగతించింది. ఇది తమ ద్వైపాక్షిక సంబంధాల చరిత్రలో ఒక పెద్ద విజయమని తాలిబాన్ తాత్కాలిక విదేశాంగ మంత్రి ఆమిర్ ఖాన్ ముత్తాకి అన్నారు.