శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 1 మే 2023 (17:11 IST)

మోసగాళ్లకు మోసగాడు చిత్రాన్ని రీ రిలీజ్ చేయడానికి కారణం వారే : నిర్మాత ఆదిశేషగిరి రావు

ADISESHAGIRI RAO, ASHWINI DUTT, TAMMAREDDY BHARDWAJA, DIRECTED BY B. GOPAL
''పద్మాలయ సంస్థకు పునాది మోసగాళ్లకు మోసగాడు చిత్రం. ఎన్నోవిజయవంతమైన చిత్రాలు తీసినప్పటికీ మాకు ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రం మోసగాళ్లకు మోసగాడు. అభిమానులు కోరిక మేరకు కృష్ణ గారి పుట్టిన రోజు సందర్భంగా మే 31న మోసగాళ్లకు మోసగాడు చిత్రాన్ని అన్ని  హంగులతో 4కే లో మళ్ళీ విడుదల చేస్తున్నాం'' అని తెలియజేశారు ప్రముఖ నిర్మాత, సూపర్ స్టార్ కృష్ణగారి సోదరులు ఆదిశేషగిరి రావు. ఈ మేరకు విలేకరులు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నిర్మాత అశ్విని దత్, తమ్మారెడ్డి భరద్వాజ, దర్శకులు బి. గోపాల్, రామలింగేశ్వరరావు పాల్గొన్నారు.
 
నిర్మాత ఆదిశేషగిరి రావు మాట్లాడుతూ.. మోసగాళ్లకు మోసగాడు చిత్ర నిర్మాణంతోనే పద్మాలయ సంస్థ పునాదులు బలంగా నిర్మించబడ్డాయి. ఆ రోజుల్లో ఈ సినిమా తీయడానికి మాకు స్ఫూర్తి రామారావు గారు. ఆయన ఎన్ఏటీ ద్వారా ఎన్నో విజయవంతమైన మంచి చిత్రాలు తీశారు. మనం కూడా సంస్థ స్థాపించి చిత్రాలు తీయాలనే  కోరికతో స్థాపించబడిన సంస్థ పద్మాలయ. మోసగాళ్లకు మోసగాడు తర్వాత పండంటి కాపురం, దేవుడు చేసిన మనుషులు, అల్లూరి సీతారామరాజు, పాడిపంటలు.. చిత్రాలు జూబ్లీలు ఆడాయి. కృష్ణ గారి పుట్టిన రోజు సందర్భంగా మే 31న  మోసగాళ్లకు మోసగాడు చిత్రాన్ని మళ్ళీ విడుదల చేస్తున్నాం. కృష్ణ గారి ఎన్నో విజయవంతమైన చిత్రాలు ఉన్నప్పటికీ మోసగాళ్లకు మోసగాడు చిత్రాన్ని ఎంచుకోవానికి కారణం కృష్ణ గారి అభిమానులు. కృష్ణ గారి అభిమానులందరూ ఈ చిత్రాన్ని మళ్ళీ థియేటర్ లో విడుదల చేయమని కోరారు. అభిమానులు కోరిక మేకరకు కృష్ణ గారికి ఘనమైన నివాళిగా ఈ చిత్రాన్ని మళ్ళీ విడుదల చేస్తున్నాం. ఇప్పటి ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు అన్ని హంగులతో 4కేలో విడుదల చేస్తున్నాం. మోసగాళ్లకు మోసగాడు కౌ బాయ్ సినిమాల్లో ట్రెండ్ సెట్టర్. దర్శకుడు కేఎస్ఆర్ దాస్ గారు, డీవోపీ వీఎస్ఆర్ స్వామీ గారు, రచయిత ఆరుద్ర గారు, సంగీత దర్శకులు ఆదినారాయణ గారు .. ఇలా అందరూ అద్భుతమైన పనితీరు కనబరిచారు. అలాగే ఆ చిత్రంలో భాగమైన అందరినీ ఈ రోజు గుర్తు చేసుకోవాలి. మేము ఎన్ని సినిమాలు తీసినా అన్నిటికి మూలం మోసగాళ్లకు మోసగాడు. ఈ రోజే ఈ కార్యక్రమం పెట్టడానికి ఒక కారణం వుంది. మా బ్యానర్ లో వచ్చిన, కృష్ణ గారి కెరీర్ లో ప్రతిష్టాత్మక చిత్రం అల్లూరి సీతారామరాజు విడుదలై నేటి 49 ఏళ్ళు అవుతుంది. వచ్చే యేడాది 50 ఏళ్ళు పూర్తి అవుతుంది.'' అన్నారు.
 
అశ్వినీదత్ మాట్లాడుతూ.. రామారావు గారు, కృష్ణ గారు నిజమైన సోదరులు. ఒక పక్క అన్నగారి శత జయంతి ఉత్సవాలు జరుగుతుంటే మరో పక్క కృష్ణ గారి గురించి కలుసుకోవడం మహా అదృష్టంగా భావిస్తున్నాను. మోసగాళ్లకు మోసగాడు చిత్రాన్ని డిగ్రీ చదువుకున్న రోజుల్లో చూశాను. పద్మాలయ సినిమా అంటే నాకు చాలా ఇష్టం. బాలీవుడ్ లో కూడా ఒక ఒరవడి సృష్టించిన సంస్థ పద్మాలయ. కృష్ణగారి ప్రతి సినిమా అద్భుతమే. కృష్ణ గారి నటులు మళ్ళీ రారు. మోసగాళ్లకు మోసగాడుతో ఎప్పుడో పాన్ వరల్డ్ సినిమా తీశారు. అలాంటి సంస్థ నుంచి మరెన్నో గొప్ప సినిమాలు రావాలి, మోసగాళ్లకు మోసగాడు చిత్రాన్ని మళ్ళీ మళ్ళీ చూస్తూనే వుండాలి’’ అని కోరారు.
 
తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ... పద్మాలయ సంస్థ స్థాపించి మొట్టమొదటి కౌ బాయ్ చిత్రం కృష్ణ గారు నిర్మించారు. అదే మోసగాళ్లకు మోసగాడు. దాదాపు 52 ఏళ్ళు పూర్తయింది.  అభిమానులు అందరూ మళ్ళీ సినిమాని విడుదల చేయాలని కోరితే దిన్ని నేటి టెక్నాలజీ 4కే కి మార్చి విడుదల చేస్తున్నాం. మోసగాళ్లకు మోసగాడు పాన్ వరల్డ్ సినిమా. అన్ని భాషల్లో విడుదలైయింది. అలాంటి కౌ బాయ్ సినిమాని మళ్ళీ థియేటర్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వాలని తెస్తున్నాం’’ అన్నారు
 
బి గోపాల్ మాట్లాడుతూ.. కృష్ణ గారు బంగారు కొండ. డైనమిక్ డాషింగ్ హీరో. ప్రయోగాలకు మారు పేరు. మోసగాళ్లకు మోసగాడు అద్భుతమైన సినిమా. కాలేజీ రోజుల్లో ఎన్ని సార్లు చూశాను. మోసగాళ్లకు మోసగాడు ట్రెండ్ సెట్టర్. ప్రేక్షకులు, అభిమానులు ఈ సినిమాని మళ్ళీ మళ్ళీ చూస్తారు. పెద్ద విజయం చేస్తారు’’ అని చెప్పారు.
 
రామలింగేశ్వరరావు మాట్లాడుతూ.. మోసగాళ్లకు మోసగాడు చిత్రాన్ని ఇంటర్ లో చూశాను. ఇలాంటి సినిమా ఒకటి వస్తుందని ఎప్పుడూ ఊహించలేదు. ఎన్ని సార్లు చూస్తామో లెక్కే లేదు. అలాంటి సినిమాని మళ్ళీ చూసి విజయం చేయాలి’’ అని కోరారు.