ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 23 జనవరి 2023 (14:51 IST)

నా ప్రయాణం కృష్ణ గారికి అంకిత : సుధీర్ బాబు

Sudhir Babu,  V. Ananda Prasad, Mahesh,   Bharat, Srikanth, Goparaju Ramana, Anne Ravi
Sudhir Babu, V. Ananda Prasad, Mahesh, Bharat, Srikanth, Goparaju Ramana, Anne Ravi
నైట్రో స్టార్ సుధీర్ బాబు కథానాయకుడిగా భవ్య క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత వి. ఆనంద ప్రసాద్ నిర్మించిన సినిమా 'హంట్'. సీనియర్ హీరో శ్రీకాంత్, 'ప్రేమిస్తే' ఫేమ్ భరత్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి మహేష్‌ దర్శకత్వం వహించారు. రిపబ్లిక్ డే కానుకగా జనవరి 26న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. 
 
హీరో సుధీర్ బాబు మాట్లాడుతూ ''కృష్ణ గారు మనల్ని వదిలి వెళ్ళిన తర్వాత విడుదల అవుతున్న నా తొలి సినిమా 'హంట్'. ఇది నా తొలి ప్రెస్ మీట్. ఆయన లేకపోవడం నాకు వెలితి. సినిమా విడుదలయ్యాక మార్నింగ్ షో తర్వాత కృష్ణ గారి నుంచి నాకు ఒక ఫోన్ కాల్ వచ్చేది. ఇప్పుడు నేను అది మిస్ అవుతా. కృష్ణ గారు వేల తారల్లో ఒక్కరిగా వెలిగిన సూర్యుడు. ఆయన ఒక కాగడాన్ని వెలిగించి వెళ్లిపోయారు. ఇప్పుడు దాన్ని పట్టుకుని నడవాల్సిన బాధ్యత మా కుటుంబానిది, మన అందరిదీ. నేను సినిమాల్లోకి వస్తానని చెప్పినప్పుడు 'వెళ్లనివ్వాలా? వద్దా?' అని ఇంట్లో అందరికి కన్‌ఫ్యూజన్. కొందరు ముఖం మీద చెప్పేశారు. కృష్ణ గారు ఒక్క మాట అన్నారు... 'కష్టపడితే సక్సెస్ అవుతాడు. చెయ్యనివ్వండి' అని! అప్పటి నుంచి నా లైఫ్ టర్న్ తీసుకుంది. మంచి వేల్యూ వచ్చింది, రెస్పాక్ట్ వచ్చింది. ఇప్పుడు నా జీవితానికి అర్థం వచ్చింది. మంచి సినిమాలు చేశా. తెలుగు సినిమాల్లో నిలబడిపోయే కొన్ని సినిమాలు చేశా. ఇప్పుడు నా కెరీర్ స్టేబుల్ గా ఉందని ఈ మాట చెప్పడం లేదు. కృష్ణ గారు చనిపోవడానికి 20 రోజుల ముందు సినిమా ఏదైనా చూస్తారా? అని ఆయన్ను అడిగితే... 'నేను ఎవరి సినిమాలు చూడను. మహేష్ సినిమాలు, సుధీర్ సినిమాలు మాత్రమే చూద్దామని అనుకుంటున్నా' అని చెప్పారు. ముందు నేను నమ్మలేదు. ఇంటికి వెళ్లిన తర్వాత 'నిజంగా అన్నారా?' అని అడిగా. అవునని చెప్పారు. వందల సినిమాలు చేసిన సూపర్ స్టార్ నా సినిమాలు చూడాలని ఎంచుకోవడం కంటే ఏం కావాలి. ఎంత దూరం వెళతానో తెలియదు. ఈ ప్రయాణం మావయ్య గారికి అంకితం. జన్మజన్మల ఆయనకు రుణపడి ఉంటాను. కృష్ణగారు నాకు జ్ఞాపకాలు మాత్రమే ఇచ్చి వెళ్ళలేదు, ఆయనలో ధైర్యాన్ని కూడా ఇచ్చి వెళ్ళారు. ఆయన ఎవరూ చేయని ప్రయోగాలు చేశారు. 
 
ఆ ధైర్యంతోనే 'హంట్' సినిమా చేశా. గత ఏడాదిగా మా కుటుంబంలో మూడు మరణాలు చోటు చేసుకున్నాయి. కృష్ణ గారి మరణం మాకు పెద్ద లాస్.  ఈ సినిమా షూటింగ్ అప్పటికి కంప్లీట్ అయ్యింది. వేరే సినిమా చేస్తున్నాను. అయితే, షూటింగ్ చేయడం కష్టమైంది. కృష్ణ గారి విషయంలో కష్టమని తెలిసినప్పుడు షూటింగ్ చేయడం ఆపేశాను. 'హంట్'కు వస్తే... ఇందులో కొత్త పాయింట్ ఉంది. నిజాయతీగా చెప్పాలంటే ఏ హీరో అటెంప్ట్ కూడా చేయడు. వందల మంది సినిమా చూశారు. అందరికీ నచ్చింది. అర్జున్ ఎ, అర్జున్ బి... సినిమాలో నా క్యారెక్టర్ రెండు షేడ్స్ లో ఉంటుంది. గతం మర్చిపోకముందు పోలీస్ రోల్ చేయడానికి కొంత మంది ఇన్స్పిరేషన్ ఉన్నారు. గతం మర్చిపోయిన తర్వాత క్యారెక్టర్ కోసం ఎటువంటి స్ఫూర్తి లేదు. దానికి కొంచెం కష్టపడ్డాను. కామన్ మ్యాన్ పోలీస్ అయితే ఎలా ఉంటుందని ఊహించి చేశా. స్టంట్స్ విషయంలో నేను రిస్క్ చేశానని అందరూ అంటున్నారు. నా కంటే ముందు ఆనంద ప్రసాద్ గారు రిస్క్ చేశారు. ఫారినర్లతో చేద్దామంటే ఆయన ఓకే అన్నారు. కోట్ల రూపాయలు వాళ్ళకు పంపించారు. సినిమాలో ఒక్క స్లో మోషన్ షాట్ ఉండకూడదని, యాక్షన్ అంతా రియల్ గా ఉండాలని ఫారిన్ స్టంట్ మాస్టర్లతో చేశాం. ఆనంద ప్రసాద్ గారి సంస్థలో నేను 'శమంతకమణి' చేశా. అప్పటి కంటే ఇప్పుడు గౌరవం మరింత పెరిగింది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఆయనకు థాంక్స్. శ్రీకాంత్ అన్నయ్య మంచి వ్యక్తి. ఈ ప్రపంచంలో ఆయనకు శత్రువులు ఎవరూ ఉండరు. ఆయన్నుంచి చాలా నేర్చుకోవాలి. మంచి యాక్టర్ కాబట్టి ఇంత లాంగ్ కెరీర్ ఉంది. నా పిల్లలు, మహేష్ పిల్లలతో కూడా ఆయన సినిమాలు చేస్తారు. భరత్ ఫెంటాస్టిక్ యాక్టర్. నా కంటే చిన్నోడు. నా చిన్నప్పుడు తన 'ప్రేమిస్తే' చూశా. నా పెర్ఫార్మన్స్ బావుండటానికి కారణం వాళ్ళు క్రియేట్ చేసిన బేస్ కారణం. మహేష్ సెట్‌లో మంచి వాతావరణం క్రియేట్ చేశాడు. తాను తప్పితే ఇటువంటి డిఫరెంట్ సినిమా ఎవరు చేయలేరు. నేను ఎన్నో ప్రశ్నలు అడిగా. ఒప్పిగ్గా సమాధానం చెప్పారు. ఈ సినిమా తర్వాత నా కంటే పెద్ద హీరోలతో సినిమాలు చేస్తారు. అరుల్ విన్సెంట్ గోడలు, ఇళ్ళు ఎక్కి లైటింగ్ సెట్ చేసేవారు. 'పాపతో పైలం...' పాటతో కంటే మ్యూజిక్ డైరెక్టర్ జిబ్రాన్ బ్యాగ్రౌండ్ స్కోర్ సక్సెస్ అవుతుంది. ఇంతకు ముందు తెలుగులో ఎవరూ చేయని సినిమా 'హంట్'.ఇది ఒక డిఫరెంట్ ఫిల్మ్. యాక్షన్ కంటే ఎమోషనల్ సీన్స్ సినిమాను ఎక్కువ నిలబెడతాయి. సినిమా చూశాక స్పాయిలర్స్ ఇవ్వొద్దు. ప్రేక్షకులను సర్‌ప్రైజ్ చేస్తే విన్నింగ్ ఛాన్సులు ఎక్కువని నా ఫీలింగ్. ఈ కథ విన్నప్పుడు షాకింగ్ ఎలిమెంట్ ఉంది. కరోనా తర్వాత పరిస్థితులు మారిపోయాయి'' అని అన్నారు.  
   
భవ్య క్రియేషన్స్ అధినేత, చిత్ర నిర్మాత వి. ఆనంద ప్రసాద్ మాట్లాడుతూ ''ఈ నెల 26న మా సంస్థలో నిర్మించిన 'హంట్'ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నాం. ఇంగ్లీష్ టైటిల్ తో వస్తున్న తెలుగు చిత్రమిది. మా ఆప్తులు శ్రీకాంత్ గారితో తొలిసారి అసోసియేట్ కావడం ఆనందంగా ఉంది. అలాగే, భరత్ గారితో కూడా! ఇక, సుధీర్ బాబు గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. జనవరి 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతున్న మా చిత్రాన్ని ఆదరిస్తారని ఆశిస్తున్నా'' అని అన్నారు. 
 
సీనియర్ హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ ''దర్శకుడు మహేష్ వచ్చి రెండు గంటలు కథ చెప్పినప్పుడు వెంటనే సినిమా చేస్తానని చెప్పాను. నేను 'హంట్' చేయడానికి భవ్య క్రియేషన్స్, సుధీర్ బాబు. నాకు సుధీర్ బాబు బ్రదర్ లాంటి వ్యక్తి. మంచి సినిమాలో నేను ఉండాలని చేశా. దర్శకులు కథ బాగా చెప్పినా తీసేటప్పటికి  ఒక్కోసారి వేరేలా వెళ్లొచ్చు. అనుకున్న దాని కంటే ఈ సినిమా బాగా వచ్చింది. దర్శకుడు మహేష్ క్లారిటీతో తీశాడు.  సినిమాలో నాది పాజిటివ్ క్యారెక్టరా? నెగిటివ్ క్యారెక్టరా? అనేది సస్పెన్స్. నేను 'హంట్' చూశా. పెద్ద హిట్ అవుతుంది. సుధీర్ బాబు అద్భుతంగా నటించారు. రెండు క్యారెక్టర్లలో బాగా చేశాడు. అర్జున్ ఎ, అర్జున్ బి మధ్య వేరియేషన్ తీసుకు రావడం ఈజీ కాదు. అతనికి అడ్వాన్స్ కంగ్రాచ్యులేషన్స్. ఆనంద ప్రసాద్ గారు కాంప్రమైజ్ కాకుండా, ఖర్చుకు వెనుకాడకుండా సినిమా నిర్మించారు. భరత్ వండర్ ఫుల్ ఆర్టిస్ట్. అతను చేసిన తమిళ సినిమాలు కూడా చూశా. తెలుగుకు వెల్కమ్ బ్యాక్. రవి గారికి, మిగతా వాళ్ళు అందరికి పేరు పేరునా థాంక్స్'' అని అన్నారు.
 
'ప్రేమిస్తే' ఫేమ్ భరత్ మాట్లాడుతూ ''సినిమా చూసిన తర్వాత నేను చాలా ఎగ్జైట్ అయ్యాను. ఈ సినిమాలో నేనూ ఓ భాగం కావడం నాకు సంతోషంగా ఉంది. ఈ 'హంట్'తో తెలుగులోకి మళ్ళీ రావాలని తీసుకున్న నిర్ణయం సరైనదని అనిపించింది. సినిమా చాలా బాగా వచ్చింది. మంచి థ్రిల్లర్ ఇది. భవ్య క్రియేషన్స్ ఆనంద ప్రసాద్, అన్నే రవి గారికి... దర్శకుడు మహేష్ కు థాంక్స్. సుధీర్ బాబు సినిమాల్లో ఇది బెస్ట్ అవుతుంది. అతనికి అడ్వాన్స్ కంగ్రాచ్యులేషన్స్. తెలుగులో గ్యాప్ తీసుకోవాలని నేను అనుకోలేదు. హీరోగా తమిళంలో బిజీగా ఉన్నాను. నాకు మహేష్ కథ చెప్పిన తర్వాత తెలుగులో నా రీ లాంచ్ కు ఇదే సరైన సినిమా అనుకున్నాను. టెక్నికల్ గా చెప్పాలంటే... నా స్ట్రెయిట్ తెలుగు సినిమా ఇది. 'ప్రేమిస్తే' డబ్బింగ్ సినిమా. 'యువసేన' సగం డబ్బింగ్ చేశారు, సగం రీ షూట్ చేశారు. ఇది ప్రోపర్ స్ట్రెయిట్ తెలుగు సినిమా'' అని అన్నారు. 
 
'హంట్' దర్శకుడు మహేష్ మాట్లాడుతూ ''వ్యక్తిగతంగా, వృత్తిపరంగా నేను ఆనంద ప్రసాద్ గారు, అన్నే రవి గారికి రుణపడి ఉన్నాను. వాళ్ళు నన్ను నమ్మకపోతే ఈ రోజు పని లేకుండా ఎక్కడో ఉండేవాడిని. నాకు వస్తున్న అభినందనలకు కారణం వాళ్ళిద్దరూ. ఇప్పుడు టీజర్, ట్రైలర్ చూసి ప్రేక్షకులు అప్రిషియేట్ చేస్తున్నారు. అందులో ఎక్కువ షేర్ మా హీరో సుధీర్ బాబుకు వెళుతుంది. సినిమా స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. మంచి సినిమా ఇవ్వాలని 110 శాతం కష్టపడ్డారు. షూటింగ్ కోసం, తన క్యారెక్టర్ కోసం ప్రిపేర్ అవ్వడానికి ఆయన ఎక్కువ ప్రశ్నలు అడిగేవారు. ఇప్పటి వరకు చూసిన సుధీర్ బాబు కంటే బెస్ట్ సుధీర్ బాబును ఈ సినిమాలో చూస్తారు. పెర్ఫార్మన్స్, యాక్షన్ పరంగా ఆయన చాలా బాగా చేశారు. హీరో క్యారెక్టర్ విషయానికి వస్తే... గతం మర్చిపోయిన తర్వాత అతనో తెల్ల కాగితం లాంటివాడు. ఏం చేశాడు? అనేది ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్. శ్రీకాంత్ గారితో పని చేయడం ఒక గౌరవం. ఆయన ఒప్పుకొని సినిమా చేసినందుకు థాంక్స్. 'హంట్'లో నటించడానికి అంగీకరించిన భరత్ గారికి థాంక్స్. ఆయనతో వర్కింగ్ ఎంజాయ్ చేశా. ఆర్ట్ డైరెక్టర్ వివేక్ వల్ల మేం అనుకున్నది స్క్రీన్ మీదకు తీసుకొచ్చాం. ప్రవీణ్ పూడి గారు మా సినిమాకు కేటాయించిన టైమ్, ఈ మధ్య కాలంలో మరో సినిమాకు కేటాయించలేదు. ఆయనకు సినిమా అంత నచ్చింది. సినిమాటోగ్రాఫర్ అరుల్ విన్సెంట్ చాలా బాగా వర్క్ చేశారు. జిబ్రాన్ నేపథ్య సంగీతం సూపర్. సినిమా మేం అనుకున్నంత సక్సెస్ అయితే 50 శాతం కారణం ఆయనే. ప్రేక్షకుల మీద మా 'హంట్' స్ట్రాంగ్ ఇంపాక్ట్ చూపిస్తుంది. యాక్షన్ సీక్వెన్సులు మాత్రమే కాదు... స్ట్రాంగ్ ఎమోషనల్ కంటెంట్ ఉంది. మంచి కథ, దాన్ని చెప్పిన విధానం, ఆర్టిస్టుల పెర్ఫార్మన్స్ ప్రేక్షకుల మీద ప్రభావం చూపిస్తుంది. సుధీర్ బాబు ఫ్యాన్స్ అందరికీ ఇదొక ట్రీట్. 'విక్రమ్' సినిమాకు, మా 'హంట్'కు సంబంధం లేదు. ట్రైలర్ చూసి కథ ఊహించినా థియేటర్లకు వచ్చిన మీకు కిక్ ఇస్తుంది. సినిమా బ్లాక్ బస్టర్. పోలీస్ నేపథ్యంలో చాలా సినిమాలు వచ్చాయి. అవన్నీ సింగిల్ ఎజెండాలో వెళతాయి. వాటిలో ఎమోషనల్ మూమెంట్స్ తక్కువ ఉంటాయని నా ఫీలింగ్. మా సినిమాలో ఆ ఎమోషన్ ఎక్కువ ఉంటుంది. '' అని అన్నారు. 
 
నటుడు గోపరాజు రమణ మాట్లాడుతూ ''భవ్య క్రియేషన్స్ నిర్మించిన 'మిడిల్ క్లాస్ మెలోడీస్' ద్వారా నేను మీ అందరికీ సుపరిచితుడిని అయ్యాను. ఈ రోజు నేను మీ ముందు ఇలా నిలబడటానికి కారణం ఈ సంస్థే. లేకపోతే ఇక్కడ నిలబడే అవకాశం నాకు వచ్చేది కాదు. ఇది నిజం. ఆనంద ప్రసాద్ గారు అదే ఆదరణతో వారు నిర్మిస్తున్న 'హంట్'లో నటించే అవకాశం నాకు ఇచ్చారు. మా హీరో సుధీర్ బాబు, దర్శకుడు మహేష్, శ్రీకాంత్ గారు... అందరితో పని చేసే గొప్ప అవకాశం రావడం సంతోషంగా ఉంది. విడుదలైన తర్వాత సినిమాను ఆదరిస్తారని ఆశిస్తున్నాను'' అని అన్నారు. 
 
ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ నిర్మాత అన్నే రవి, నటి మౌనికా రెడ్డి పాల్గొన్నారు.