గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 1 ఆగస్టు 2022 (12:12 IST)

తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన హాస్య నటుడు సారథి మృతి

kjsarathi
తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన సీనియర్ హాస్య నటుడు సారథి కన్నుమూశారు. గత కొన్నిరోజులుగా కిడ్నీ, కాలేయ సమస్యలతో బాధపడుతూ వచ్చిన ఆయన హైదరాబాద్ నగరంలోని సిటీ న్యూరో సెంటర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చారు. అయితే, ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆదివారం అర్థరాత్రి 2.30 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 83 సంవత్సరాలు. 
 
దాదాపు 350కి పైగా చిత్రాల్లో నటించిన సారథి... గత 1942 జూన్ 26వ తేదీన వెస్ట్ గోదావరి జిల్లాలోని పెనుగొండలో జన్మించారు. ఆయన పేరు కడలి జయ సారథి (కేజే సారథి). ఈయన హాస్య నటుడుగానే కాకుండా, నిర్మాతగా కూడా పలు చిత్రాలను నిర్మించారు. 
 
ఇలాంటి వాటిలో కృష్ణంరాజుతో నిర్మించిన "ధర్మాత్ముడు", 'విధాత', 'శ్రీరామచంద్రుడు', 'అగ్రిరాజు' వంటి చిత్రాలు ఉన్నాయి. ఈయన మృతి వార్త తెలుసుకున్న సినీ ప్రముఖులు పలువురు తమ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.