రెండు ముక్కలుగా `మా` వార్తకు అనూహ్యస్పందన,`మా` ఆంధ్ర వుందన్న దిలీప్ రాజా
`మా` ఎన్నికల్లో లోకల్, నాన్ లోకల్ అనే విషయం ప్రకాష్‌రాజ్ నిలబడినప్పుడు తెరపైకి వచ్చింది. ఆ తర్వాత తెలంగాణా నుంచి తాను పోటీచేస్తున్నట్లు సి.ఎల్. నరసింహరావు ప్రకటించారు. దీనితో లోకల్, నాన్ లోకల్ చిచ్చు. `మా` రెండుగా చీలే ప్రమాదం అనే వార్తను ఇటీవలే వెబ్ దునియాలో ప్రచురించింది. దీనికి సినిమారంగంలో అనూహ్యస్పందన వచ్చింది. దాని పర్యావసానమే మంగళవారంనాడు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ వ్యవస్థాపకుడు, అధ్యక్షుడు దిలీప్‌రాజా అధికార ప్రకటన విడుదల చేశారు.
`మా ఎ.పి.`ని నూతనంగా నెలకొల్పాలని తాజాగా కొందరు చేస్తున్న వ్యాఖ్యల పట్ల దిలీప్‌రాజా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా తెనాలిలోని `మా ఎ.పి.` కార్యాలయంలో నేడు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రం రెండుగా విడిపోయిన అనంతరమే ఆంధ్రప్రదేశ్‌లో `మా-ఎ.పి.` 24 విభాగాల యూనియన్ నెలకొల్పినట్లు పేర్కొన్నారు. దీనికి ఎ.పి. కార్మికశాఖ రిజిస్టర్ చేసి ఆమోదం పొందాం. సినీ నటి కవిత అధ్యక్షురాలిగా, నరసింహరాజు ప్రధాన కార్యదర్శిగా అన్నపూర్ణమ్మ కార్యదర్శిగా వున్నారు. ఈ యూనియన్‌లో టీవీ, సినిమా రంగాలకు చెందిన 24 విభాగాల సాంకేతిక నిపుణులు, నటీనటులు 500 మంది సభ్యులుగా వున్నారు.
కాగా, మా మధ్య విభేదాలు, వివాదాలు పెట్టి `మా` ఎన్నికల్లో చిచ్చు పెట్టడానికి కొందరు చూస్తున్నారని ఆయన విమర్శించారు. అందుకే సినిమా పెద్దలైన చిరంజీవి, మోహన్‌బాబు, బాలకృష్ణ వంటి పెద్దలు కలుగ జేసుకుని `మా` ఎన్నికలను ఏకపక్షంగా చేయమని కోరుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.