శుక్రవారం, 1 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 11 ఫిబ్రవరి 2024 (10:51 IST)

ఘనంగా మురళీమోహన్‌ గోల్డెన్‌ జూబ్లీ సెలబ్రేషన్స్‌

babu - mohan - venkaiah
డా.మురళీమోహన్‌ 50 ఇయర్స్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ ఎక్సలెన్స్‌ కమిటీ ఆధ్వర్యంలో ప్రఖ్యాత నటుడు, నిర్మాత మురళీ మోహన్‌ నటుడిగా 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శనివారం శిల్పకళా వేదికలో గోల్డెన్‌ జూబ్లీ సెలబ్రేషన్స్‌ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కృష్ణంరాజు సతీమణి, గురవారెడ్డి, నర్సాపురం పార్లమెంట్‌ సభ్యులు రఘురామకృష్ణంరాజు, సుజనా చౌదరి, కోటా శ్రీనివాసరావు, కీరవాణి, రాజమౌళి, అశ్వనీదత్‌, మహాన్యూస్‌ వంశీకృష్ణ, తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా 50 మురళిలతో కూడిన దండతో మురళీమోహన్‌ను సత్కరించారు. 50 ఏళ్ల క్రితం తనకు తొలి అవకాశం ఇచ్చిన అట్లూరి పూర్ణచంద్రరావు గారికి మురళీమోహన్‌గారు ఒక కారును బహుమతిగా అందజేశారు. 
 
చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ... 
మురళీమోహన్‌ ఇప్పటికీ 40 ఏళ్ల కుర్రాడిలా ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే పాత రోజులు గుర్తుకు వస్తున్నాయి. మురళీమోహన్‌ 50 ఏళ్ల వేడుకలో నేను పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నా. అరుదైన వ్యక్తి ఆయన. తెలుగు ప్రజలందరి తరపున ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నా. మురళీమోహన్‌ 350 సినిమాలు చేశారు. రాజకీయాల్లో కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. ఏ పనైనా మనసుపెట్టి చేసే వ్యక్తి ఆయన. సినిమాల నిర్మాణంలోగానీ, రియల్‌ఎస్టేట్‌లోగానీ అయన అద్భుతంగా రాణించారు. 36 సంవత్సరాల 1100 మందిని డాక్టర్‌లు, ఇంజనీర్‌లుగా స్వంత ఖర్చులతో చదివించి తీర్చిదిద్దారు. వెంకయ్యనాయుడు రాజకీయాల్లో సిన్సియారిటీకి మారుపేరుగా నిలిచారు. పీవీ నరసింహారావుకు భారత రత్న, వెంకయ్య నాయుడుకి పద్మ విభూషణ్‌ రావడం మనందరికీ గౌరవం. జాతీయస్థాయి రాజకీయాల్లో ఆయన గొప్పగా పనిచేశారు. నేను నిర్మించిన శిల్పకళావేదికలో ఈ కార్యక్రమంలో చాలా రోజుల తర్వాత నేను పాల్గొనడం గర్వకారణంగా ఉంది అన్నారు. 
 
వెంకయ్యనాయుడు మాట్లాడుతూ... 
నాకు జలుబుతో ఆరోగ్యం కొంత సహకరించకపోయినా మురళీమోహన్‌‌పై ఉన్న ప్రేమ నన్ను ఇక్కడకు వచ్చేలా చేసింది. 80 ఏళ్ల వయస్సులో కూడా ఆయన ఇంకా ఉత్సాహంగా నటిస్తున్నారు. ఆయనలో నాకు నచ్చింది క్రమశిక్షణ. క్రమశిక్షణ, నిజాయితీ, జయాపజయాలను ఒక్కటిగా తీసుకోవడం ఆయనకున్న గొప్పవరాలు. ఆయన్ను ఉన్నత శిఖరాలకు చేర్చింది కూడా ఈ నిజాయితీనే. యువత ఆయన్నుంచి ఇవన్నీ నేర్చుకోవాలి. సహజమైన నటుడు ఆయన. మన పక్కింటి వ్యక్తిలా అందరి గుండెల్లో నిలిచి పోతారు. సకుటంబ, సపరివార సమేతంగా చూసేలా సినిమాలు రాయండి, తీయండి. కుటుంబాలను, సంస్కృతి, సంప్రదాయాలను దృష్టిలో పెట్టుకుని సినిమాలు తీయండి. ఆయన నటనలో సౌశీల్యం కనిపిస్తుంది. ఆయన ఎన్ని రంగాల్లో ఎంత ఎత్తుకు ఎదిగినా వినయ, విధేయతలను మర్చిపోలేదు. కళకు ఎప్పుడూ కాలదోషం పట్టదు. 50 ఏళ్ల ప్రస్థానం కొనసాగిస్తున్న మురళీమోహన్‌ గారికి నా అభినందనలు. వారు మంచి సందేశం ఉన్న సినిమాలు భవిష్యత్తులో మరిన్ని చేయాలని కోరుకుంటున్నాను. పీవీ నరసింహారావు గారి ముందు చూపు వల్లనే నేడు దేశం ఇంత ముందుకు సాగింది. ఆయనకు భారతరత్న రావడం చాలా ఆనందకరమైన విషయం. చంద్రబాబు గారి సంస్కరణల వల్లనే నేడు హైదరాబాద్‌ టెక్నీలజీ, ఫైనాన్షియల్‌, ఇండ్రస్ట్రీ హబ్‌గా మారింది. ప్రతిభను ప్రోత్సహించడం సమాజం కర్తవ్యం అన్నారు. 
 
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.... 
ఎన్టీఆర్‌లోని అనేక మంచి లక్షణాలను ఆదర్శంగా తీసుకుని మురళీమోహన్‌ ఎంతో ఎత్తుకు ఎదిగారు. మురళీమోహన్‌ మరింత ఎత్తుకు ఎదిగేలా ఆ దేవుడు మరింత ఆయుష్షును ఇవ్వాలని కోరుకుంటున్నా. పెద్దలు వెంకయ్య నాయుడుకి, నాకు రాజకీయ జీవితంలో ఎంతో ఉన్నతికి చేరటానికి అవకాశాలు కల్పించిన నా గురువు చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు అన్నారు. 
 
మురళీమోహన్‌ మాట్లాడుతూ... 
ఈ కార్యక్రమం ఇంత ఘనంగా జరిపించడం సంతోషంగా ఉంది. ఇంతమంది నన్ను ఆశీర్వదించటానికి రావడం చాలా చాలా సంతోషంగా ఉంది. నేను ఇవాళ ఈ స్థాయిలో మీ ముందు ఉన్నానంటే అట్లూరి పూర్ణచంద్రరావు పెట్టిన భిక్ష. 1973లో ఆయన నాకు హీరోగా అవకాశం ఇచ్చారు. ఇండస్ట్రీలో నన్ను నిలబెట్టింది దాసరి నారాయణరావు. వీరిద్దరినీ నా జీవితంలో మర్చిపోలేను. ప్రదీప్‌ కుటుంబం మొత్తం ఈ కార్యక్రమం కోసం చాలా కష్టపడ్డారు. నాతో పనిచేసిన హీరోయిన్‌లు అందరూ ఎంతో కలివిడిగా ఉండేవారు. వారితో ఫ్యామిలీ మెంబర్స్‌గా ఉంటాను. నా తొలి సినిమా నుంచి ఇప్పటి వరకూ నాకు కొల్లి రాము మేకప్‌ మ్యాన్‌గానే ఉండిపోయారు. ఈ కార్యక్రమం ఇంత బాగా నిర్వహించిన అందరికీ నా కృతజ్ఞతలు అన్నారు.  ఇంకా ఈ కార్యక్రమంలో  ప్రభ, జయచిత్ర, కవిత, ముప్పా వెంకటేశ్వర చౌదరి, అట్లూరి పూర్ణ చంద్రరావు, కృష్ణప్రసాద్‌, మాజీ మంత్రి, కామినేని శ్రీనివాసరావు, సీనియర్‌ నటుడు ప్రదీప్‌, శివకుమార్‌, నిహారిక, ఆదిత్య, రవి, జర్నలిస్ట్‌ ప్రభు, పొట్లూరి శ్రీనివాస్‌, కొల్లి రాము మరియు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు.