శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : మంగళవారం, 11 మే 2021 (16:10 IST)

ఇండ‌స్ట్రీని శాసించే ఆ న‌లుగురు చేతులెత్తేసిన‌ట్లేనా?

Small producers
తెలుగు సినిమా రంగాన్ని ఆ న‌లుగురు శాసిస్తున్నారేది జ‌గ‌మెరిగిన విష‌య‌మే. వారంతా థియేట‌ర్ల‌ను లీజ్‌కు తీసుకుని స‌రైన టైంలో వారి వారి సినిమాల‌ను ప్ర‌ద‌ర్శించుకుంటూ చిన్న సినిమాల‌కు థియేట‌ర్లు లేకుండా చేస్తున్నార‌నేది తెలిసిందే. ఈ విష‌యంలో చిన్న నిర్మాత‌లంతా క‌లిసి క‌ట్టుగా రెండు ప‌ర్యాయాలు ఛాంబ‌ర్ ద‌గ్గ‌ర ధ‌ర్నాలు చేసిన సంఘ‌ట‌న‌లూ వున్నాయి. మ‌రి దేనికైనా కాల‌మే స‌మాధానం చెబుతుంద‌ని పెద్ద‌లు అంటుంటారు. ఇప్పుడు ఆ కాల‌మే వ‌చ్చింద‌ని సినీవ‌ర్గాలు తెలియ‌జేస్తున్నాయి.
 
గ‌త కొన్నేళ్ళుగా ఎగ్జిబిట‌ర్ల ద‌గ్గ‌ర థియేట‌ర్ల‌ను లీజుకు తీసుకుని వాటిని టెక్నాల‌జీకి అనుగుణంగా ఆ న‌లుగురు అగ్ర నిర్మాత‌లు తీర్చిదిద్దారు. అందుకు థియేట‌ర్ అస‌లు ఓన‌ర్‌కు ఎటువంటి సంబంధం వుండ‌దు. ఉత్ప‌త్తిదారుడి ద‌గ్గ‌ర ఓ రేటుకు కొని దాన్ని మార్కెట్‌లో ఎక్కువ‌కు అమ్ముకునే ద‌ళారీలుగా మారి పోయారు ఆ నిర్మాత‌లు. అగ్ర హీరోల సినిమాల స‌మ‌యంలో థియేట‌ర్ల‌ను బ్లాక్ చేయ‌డం, ఇష్టానుసారంగా టిక్కెట్ రేట్లు పెంచ‌డం, చిన్న సినిమాలు ఏదైనా బాగా ఆడినా స‌రైన క‌మిష‌న్ రాక‌పోతే వెంట‌నే థియేట‌ర్ నుంచి ఆ సినిమా లేపేయ‌డం వంటి సంఘ‌ట‌న‌లు చాలానే జ‌రిగాయి. క‌రోనా మొద‌టి వేవ్ స‌మ‌యంలో ర‌వితేజ క్రాక్ విడుద‌ల విష‌యంలో పంపిణీదారుడు వ‌రంగ‌ల్ శ్రీ‌నుకు ఎదుర‌యి అనుభ‌వం తెలిసిందే. ఇలా చెప్ప‌కుపోతే చాలానే వున్నాయి.
 
అస‌లు విష‌యం ఏమంటే, ఇప్పుడు థియేట‌ర్లు ఎక్కువ శాతం ఆ న‌లుగురు నిర్మాత‌ల లీజుకింద వుండ‌డంతో ప్ర‌స్తుతం సినిమాలు ఆడించ‌లేక రాబ‌డి లేక స‌త‌మ‌త‌మ‌వుతున్నారు. థియేట‌ర్ల‌లో సిబ్బందికి జీతాలు ఇవ్వాలి, క‌రెంట్ బిల్ల‌లు, ఇత‌ర ప్ర‌భుత్వం ప‌న్నులు క‌ట్టాలి. క‌రోనా మొద‌టి వేవ్‌లో దీనిపై కొద్దిపాటి చ‌ర్చ జ‌రిగినా కోవిడ్ నుంచి బ‌య‌ట‌ప‌డ‌తామ‌ని ధీమాతో వుండేవారు.
 
Theater
అయితే ఇప్పుడు సెకండ్‌వేవ్ విజృంభించ‌డంతోపాటు మ‌ర‌లా లాక్ డౌన్ బాట‌లో రెండు తెలుగు రాష్ట్రాల‌లో థియేట‌ర్ల‌ను న‌డిపే స్థితిలో లీజుదారులు లేర‌ని తెలిసింది. క‌రోనా వేవ్ అనేది మూడో విడ‌త కూడా వుంద‌ని ప్ర‌చారంతోపాటు అస‌లు థియేట‌ర్లు సెప్టెంబ‌ర్ వ‌ర‌కు తెరుచుకునేట్లుగా లేవ‌ని సీని పెద్ద‌లు చెబుతున్నారు. అందుకే ఏదో ఒక నిర్ణ‌యం తీసుకోవాల‌ని ఆ న‌లుగురు జూమ్ మీటింగ్‌లో మాట్లాడుకున్నార‌ని విశ్వ‌స‌నీయ స‌మాచారం. 
 
ఇందుకు సంబంధించి థియేట‌ర్ అస‌లు యాజ‌మాన్యంతో జూమ్ మీటింగ్ ఏర్పాటు చేయాల‌ని కూడా ఆ న‌లుగురు నిర్మాత‌లు ఆలోచిస్తున్న‌ట్లు ఫిలింన‌గ‌ర్ క‌థ‌నాలు చెబుతున్నాయి. త్వ‌ర‌లోనే థియేట‌ర్ల‌ను అస‌లు య‌జ‌మానుల‌కు ఇచ్చేయాల‌ని వారు ఆలోచిస్తున్న‌ట్లు స‌మాచారం. భ‌విష్య‌త్‌లో ఆ న‌లుగురు నిర్మాత‌ల దోపిడీని ఆ దేవుడే అరిక‌ట్టాల‌ని ఓ సంద‌ర్భంలోఆవేశంగా అన్న చిన్న నిర్మాత‌ల సంఘం అధ్య‌క్షుడు న‌ట్టికుమార్ మాట‌లు నిజ‌మ‌య్యేట్లు వున్నాయి. అదే నిజ‌మైతే చిన్న‌, మ‌ధ్య త‌ర‌హా నిర్మాత‌ల‌కు మంచి రోజులు రాబోతున్నాయి.