1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 8 మార్చి 2021 (20:48 IST)

ప్రేక్ష‌కులు భ‌యం పోగొట్టారు, పంపిణీదారులు భ‌య‌పెడుతున్నారు!

Prekahakulu
తెలుగు సినిమాలో మ‌ళ్ళీ పంపిణీదారుల హ‌వానే కొన‌సాగుతుంది. కొరోనా అంటే ఏమిటో తెలీని రోజుల్లోనే వుండే ప‌రిస్థితి క‌రోనా త‌ర్వాత కూడా కొన‌సాగుతూనే వుంది. క‌రోనా స‌మ‌యంలో 8నెల‌ల‌పాటు థియేట‌ర్లు లేక పూర్త‌యిన సినిమాలు విడుద‌ల‌కు గేట్లు లేపేశారు. థియేట‌ర్‌కు జ‌నాలు వ‌స్తారా! రానా! అనే అనుమానం అంద‌రిలోనూ వుంది. కానీ సంక్రాంతి నుంచి విడుద‌లైన సినిమాల నుంచి ఒక్క‌సారిగా నిర్మాత‌ల‌కు ధైర్యం వ‌చ్చింది.

ఆ ధైర్యంతో చిన్నా, మ‌ధ్య చిత్రాలు చ‌క‌చ‌కా రిలీజ్ చేసేస్తున్నారు. వారంలో 5,6 సినిమాలు విడుల‌కావ‌డం ఏ సినిమాకు ఎంత క‌లెక్ష‌న్ వ‌స్తుందో తెలీని గంద‌ర‌గోళంగా వుంది. వీటివ‌ల్ల ఉప‌యోగం లేద‌ని ఇటీవ‌లే దిల్‌రాజు వ్యాఖ్యానించారు. సినిమాల విడుద‌ల‌లు చూస్తుంటే ఆశ్చ‌ర్యం వేస్తుంద‌నీ, క‌రోనా అనేది జ‌నాలు మ‌ర్చిపోయార‌ని తెలిపారు. అంటే ప్రేక్ష‌కులు నిర్మాత‌ల‌కు భ‌యాన్ని పోగొట్టారు.

కానీ పంపిణీదారులైన కొంద‌రు గుత్తాధిప‌త్యంతో నిర్మాత‌ల‌నే భ‌య‌పెడుతున్నారు. అదెలా అంటే ఆమ‌ధ్య క్రాక్ సినిమా విడుద‌ల కూడా మూడు షోలు ఆగిపోయింది. చిత్ర నిర్మాత మ‌ధు గ‌తంలో వున్న క‌మిట్‌మెంట్‌లు పూర్తిచేయ‌క‌పోవ‌డంతోపాటు అదును చూసి దిల్‌రాజు ఆ సినిమాకు స‌రైన థియేట‌ర్లు ఇవ్వ‌లేదు. దాంతో నైజాం పంపిణీదారుడు వ‌రంగ‌ల్‌శ్రీ‌ను దీనిపై దిల్‌రాజును తీవ్ర ప‌రుష‌జాలంతో మాట్లాడారు. ఇక ఆ త‌ర్వాత చిన్నా చిత‌కా చిత్రాలు వ‌స్తున్నా ఏవో థియేట‌ర్లు ఇస్తున్నారు. అవి ఆడిన‌న్ని రోజులు ఆడి వెనుకుతిరుగుతున్నాయి.
 
Theaters
ప్ర‌స్తుతం తాజా స‌మాచారం ప్ర‌కారం దిల్‌రాజుకు చెందిన సినిమాలకు పోటీలేకుండా ఆ వారంలో ఎటువంటి సినిమాలు విడుద‌ల‌కాకుండా ప్లాన్ చేసిన‌ట్లు తెలుస్తోంది. అందుకు ఉదాహ‌ర‌ణే ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ‌కీల్‌సాబ్ సినిమా. ఏప్రియల్ 9న వకీల్ సాబ్ వుంది. పవన్ కళ్యాణ్ సినిమా కాబట్టి మాగ్జిమమ్ థియేటర్లు వేస్తారు. అందుకే మిగిలిన చిన్న‌, మ‌ధ్య సినిమాల విడుల‌కు నోచుకోకుండా సింగిల్ సినిమానే ప‌డేలా ప్లాన్ చేసుకున్నాడు. దీని గురించి చిన్న నిర్మాత‌లు అడిగే దైర్యంలేకుండా పోయింది. గ‌తంలో ఇలాంటి సంఘ‌ట‌న‌లు జ‌రిగితే న‌ట్టికుమార్ వంటి కొంద‌రు అరిచి గోల చేశారు. కానీ ఇప్పుడు అలా చేయ‌డానికి ఎవ‌రూ సాహ‌సించ‌డంలేదు.

మ‌రోవైపు ర్ఆర్ఆర్, ఆచార్య సినిమాల‌కు కూడా సోలోగా విడుద‌ల కాబోతున్నాయి. ఇక నాలుగింట మూడు వంతులు సినిమాలు దిల్ రాజు ద్వారానే డిస్ట్రిబ్యూట్ అవుతాయి. వకీల్ సాబ్ ఆయన స్వంత సినిమా. మరి అందుకే ఎవ్వరూ ఏ సినిమా విడుదల చేయడం లేదా? లేదా పవన్ కళ్యాణ్ సినిమా అని జంకి విడుదల చేయడం లేదా?

అలాగే మరో ఏస్ డిస్ట్రిబ్యూటర్ ఏసియన్ సునీల్ లవ్ స్టోరీకి కూడా సోలో డేట్ దొరికింది. అలాగే దిల్ రాజు స్నేహితుడు లక్ష్మణ్ చేతిలో వున్న టక్ జగదీష్‌కు కూడా సోలో డేట్ దొరికింది. ఇలా ముగ్గురు న‌లుగురు డిస్ట్రిబ్యూషన్లు వారి చేతిలో వుండ‌డంతో ఇలాంటి ప‌రిస్థితి వుంది. మిగిలిన సినిమాలు పెద్ద సినిమా త‌ర్వాత రిలీజ్‌చేసి వున్న థియేట‌ర్ల‌లో వ‌చ్చిన క‌లెక్ష‌న్ల‌ను పంచుకోవాల్సిందే. అందులో లాభంకంటే ఏదో విడుద‌ల చేశాం అనే తృప్తి మాత్ర‌మే వారికి మిగులుతుంది.