సినిమారంగంపైనే ప్రభుత్వాల కన్ను ఎందుకు? - ప్రైవేట్ ఆన్‌లైన్ పరిస్థితి ఏమిటి?- సర్వే రిపోర్ట్
ప్రస్తుతం తెలుగు సినిమారంగంలో హాట్ టాపిక్ ఆన్‌లైన్ టికెట్ల వ్యవహారం. అది ప్రభుత్వమే ఆన్‌లైన్ బుకింగ్ ద్వారా టికెట్లు అమ్ముతోంది. దీన్ని చట్టం చేయబోతున్నారు. దాదాపు అయినట్లేనని కొందరు అంటే, ఇంకా సినీ పెద్దలతో మరోసారి జగన్ ప్రభుత్వం చర్చించనుందని తెలుస్తోంది. దీనిపై సినీ పెద్దలు పలు రకాలుగా స్పందించారు.టికెట్లలో పారదర్శకత వుంటుందనీ, నేరుగా నిర్మాతకే లాభాలు వస్తాయనీ, మధ్యవర్తి గోల్‌మాల్ వ్యవహారం వుండదని ప్రభుత్వం చెబుతుంది. మరి దీనిపై పలువురు సినీ ప్రముఖులు ఏమంటున్నారో చూద్దాం.
మెగాస్టార్ చిరంజీవి మాత్రం.. ఈ టికెట్ల వ్యవహారంపై ప్రభుత్వం మరోసారి ఆలోచించాలని పేర్కొన్నారు. డి.సురేష్‌బాబు విశ్లేషిస్తూ,, బి,సి. సెంట్లలో 10,20,30 రూపాయల టికెట్ల రేటు పట్టి అమ్మడం వల్ల ఎవరికి లాభం? ఇది కరెక్ట్ కాదని బల్లగుద్ది మరీ చెప్పారు.
ఇక అందరికీ తలకాయలాంటి సంస్థ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాత్రం గతంలో తామే ఆన్‌లైన్ టికెట్ల అమ్మాలని ప్రముఖులతో భేటీ అయి మరీ చెప్పామని అన్నారు. అయితే ఇప్పుడు బి,సి సెంటర్లలో టికెట్ రేట్లపై ప్రభుత్వం తీరు, ఇకపై బెనిఫిట్ షోలు, స్పెషల్ షోలు అనేవి వుండవనీ, కేవలం రోజుకు నాలుగు షోలు మాత్రమే వుంటాయని ఎ.పి. ప్రభుత్వం తేల్చిచెప్పింది. ఈ విషయంపై ఛాంబర్ పెద్దలకు మింగుడు పడడంలేదు. తాము ఒకటి అనుకుంటే మరోటి జరిగిందే? అని డైలమాలో వున్నారు. ప్రభుత్వం నిర్ణయంపై మరోసారి ఛాంబర్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది.
మరో వైపు పవన్ కళ్యాణ్ టికెట్ల వ్యవహారం ప్రభుత్వం తీసుకోవడంపై గుర్రుగానే వున్నారు. కోట్లు పెట్టి సినిమాలు నిర్మాతలు తీస్తే, దాని ఫలితాలు ప్రభుత్వం తీసుకుంటుందా? అని రిపబ్లిక్ ప్రీ రిలీజ్‌నాడే గట్టిగా చెప్పారు. చిరంజీవిగారికికూడా ఆయన సున్నితంగా చెబుతూ, మీరు దేహి అని అడుక్కోకండి.. మా హక్కు.. అన్నట్లు అడగాలంటూ సినీ పెద్దలకూ సూచించారు.
అయితే ఈ వ్యవహారాన్ని గమనిస్తున్న కొందరు సీనియర్ నిర్మాతలు వ్యాఖ్యానిస్తూ, రాష్ట్రం అభివృద్ధి ఏమీ జరగలేదని ప్రతిపక్షాలు నోరు విప్పితే తమ తప్పులను డైవర్ట్ చేయడం కోసం పాలకులు ఇలా సినీమారంగంపై పడుతుంటారనీ, గతంలో డ్రెగ్ కేసులు ఇందుకు ఉదాహరణలని పేర్కొన్నారు. రాజకీయ నాయకుల పిల్లలు, పోలీసు అధికారుల పిల్లలు కూడా డ్రెగ్ వ్యవహారంలో వుంటే వారి గురించి అస్పలు మీడియాకు చెప్పకుండా కేవలం ఫోకస్ అంతా సినిమావారిపైనే పడిందని గుర్తుచేశారు. ప్రస్తుతం ఆన్‌లైన్ వ్యవహారం కూడా అంతేననీ, కరోనా వచ్చి నిర్మాతలు కోట్లు పెట్టి బాక్స్‌లు బయటకు రాకుండా ఓవైపు, వడ్డీలు కట్టుకోవాల్సిన పరిస్థతి వస్తే. ప్రభుత్వంకు చీమ కుట్టినట్లు లేదనీ వారు వాపోతున్నారు. మరో సీనియర్ నిర్మాత మాట్లాడుతూ, సినిమారంగానికి దిష్టి బాగా తగిలిందనీ దిష్టితీసే ఓ వ్యక్తి రావాలని సరదాగా వ్యాఖ్యానించాడు.
పైగా ఆన్‌లైన్ టికెట్ల ప్రభుత్వమే అమ్మితే, ప్రయివేట్ బుకింగ్‌ల పరిస్థితి ఏమిటి? వారి నుంచి ఎటువంటి స్పందన రాబోతుందని పరిశ్రమ వర్గాలు తెలియజేస్తున్నాయి. ప్రయివేట్ ఆన్‌లైన్ బిజినెస్‌లో కార్పొరేట్ కంపెనీలు, రాజకీయానాయకుల అండతోనే సాగుతున్నాయి. మరి వారు ఎలా స్పందిస్తారో చూడాల్సిందే.