శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 29 నవంబరు 2021 (16:33 IST)

డ్రాగా కాన్పూర్ టెస్ట్ ఫలితం : ఒక్క వికెట్ దూరంలో ఆగిన భారత్ విజయం

కాన్పూర్ వేదికగా పర్యాటక న్యూజిలాండ్ జట్టుతో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. చివరి ఇన్నింగ్స్‌లో 284 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ ఆటగాళ్లు ఐదో రోజు పూర్తయ్యేసరికి 9 వికెట్ల నష్టానికి 165 పరుగులు మాత్రమే చేసింది. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. 
 
ఒక దశలో భారత స్పిన్నర్లు కివీస్ జట్టును కోలుకోలేని విధంగా దెబ్బతీశారు. వీరి ధాటికి న్యూజిలాండ్ జట్టు 125 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అయితే, క్రీజులో కెప్టెన్ కేన్ విలియమ్సన్ (24) ఉండటంతో కివీస్ ఆశలు కోల్పోలేదు. 
 
ఈ క్రమంలో రవీంద్ర జడేజా గట్టి దెబ్బకొట్టాడు. విలియమ్సన్‌ను ఎల్బీగా ఇంటికి పంపాడు. దీంతో భారత్ గెలిచే అవకాశాలు మరింతగా పెరిగాయి. ఆ తర్వాత అశ్విన్ మరో వికెట్ తీశాడు. ముఖ్యంగా, భారత బౌలర్లకు తలనొప్పిగా మారిన బ్లండెల్ (38 బంతుల్లో 2 రన్స్)ను ఔట్ చేశాడు. 
 
అశ్విన్ వేసిన బంతిని అంచనా వేయడంలో విఫలమయ్యాడు. దీంతో ఆ బంతి పిచ్‌పై పడి వికెట్ల పై నుంచి వెళ్లి కీపర్ చేతిలో చిక్కింది. దీంతో బ్లండెల్ పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత జెమీసన్‌ను జడేజా ఎల్బీగా వెనక్కి పంపాడు. అయితే, చివరి వికెట్‌ను పడగొట్టడంలో భారత బౌలర్లు విఫలమయ్యారు. దీంతో ఈ టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. 
 
అంతకుముందు భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో 345 పరుగులు చేసి ఆలౌట్ కాగా, కివీస్ జట్టు తన తొలి ఇన్నింగ్స్‌లో 296 పరుగులకు ఆలౌట్ అయిన విషయం తెల్సిందే. ఆ తర్వాత భారత్‌ తన రెండో ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది. అయితే, తొలి ఇన్నింగ్స్‌లో లభించిన 49 పరుగుల ఆధిక్యంతో కలుపుకుని కీవీస్ జట్టు ముంగిట 284 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచింది. కానీ కివీస్ జట్టు 165/9 మాత్రమే చేసి మ్యాచ్‌ను డ్రా చేసుకుంది.