శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 27 నవంబరు 2021 (19:54 IST)

బెంగుళూరు ఎయిర్‌పోర్టులో "ఒమిక్రాన్" కలకలం... ఇద్దరికి పాజిటివ్

ఆఫ్రికా దేశాలతో పాటు ప్రపంచ దేశాలకు దడ పుట్టిస్తున్న ఒమిక్రాన్ వైరస్ ఇపుడు భారత్‌లోకి ప్రవేశించినట్టు తెలుస్తోంది. బెంగుళూరు విమానాశ్రయంలో ఈ వైరస్ కలకలం రేగింది. ఈ విమానాశ్రయానికి వచ్చిన ఇద్దరు సౌతాఫ్రికా దేశస్థులకు పరీక్ష చేయగా, వారికి పాజిటివ్ అని తేలింది. దీంతో వారిద్దరినీ తక్షణం ఐసోలేషన్ వార్డుకు తరలించారు. 
 
బి.1.1.529 వేరియంట్‌గా గుర్తించిన ఈ కరోనా వైరస్ పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలనీ, గతంలో వెలుగు చూసిన వేరియంట్ల కంటే అత్యంత ప్రమాదకరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ పదేపదే హెచ్చరిస్తుంది. దీంతో అన్ని ప్రపంచ దేశాలు అప్రమత్తమయ్యాయి. అలాగే, భారత్ కూడా అప్రమత్తంగా వ్యవహరిస్తుంది. ఇదే అంశంపై ప్రధాని నరేంద్ర మోడీ శనివారం అత్యవసరంగా అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించి, అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. అన్ని రాష్ట్రాలను అలెర్ట్ చేశారు. 
 
ఇంతలోనే బెంగుళూరు ఎయిర్‌పోర్టులో ఈ వైరస్ కలకలం చెలరేగింది. అయితే, ఐసోలేషన్‌కు తరలించిన ఇద్దుర సౌతాఫ్రికా దేశస్థులకు ఒమిక్రాన్ ఉందో లేదో నిర్ధారించాల్సివుంది. ఇందుకోసం శాంపిల్స్ సేకరించారు. ఈ శాంపిల్స్ ఫలితాలు మరో 48 గంటల్లో రానున్నాయి. కాగా, దేశంలో హైరిస్క్‌లో ఉన్న దేశాల నుంచి ఇప్పటివరకు బెంగుళూరు ఎయిర్‌పోర్టుకు 584మంది ప్రయాణికులు రాగా, వీరిలో 94 మంది సౌతాఫ్రికా నుంచి వచ్చారు. వీరిలో ఇద్దరికి పాజిటివ్ అని తేలింది.