గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 14 సెప్టెంబరు 2020 (16:19 IST)

ముంబైలో నేను బతికుండటమే లక్కీ అనిపిస్తోంది : కంగనా రనౌత్

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మరోమారు కీలక వ్యాఖ్యలు చేసింది. ముంబైలో తాను బతికుండటమే లక్కీ అని చెప్పుకొచ్చింది. అందుకే ఇపుడు బరువెక్కిన హృదయంతో ముంబైను వీడుతున్నట్టు కంగనా తాజాగా ఓ ట్వీట్ చేసింది. 
 
ఇటీవల ముంబైను పాక్ ఆక్రమిత కాశ్మీర్‌తో కంగనా రనౌత్ పోల్చారు. దీనిపై శివసేన నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. అంతేకాకుండా, తమ అధికారాన్ని ఉపయోగించి కంగనా సినీ కార్యాలయాన్ని కూడా పాక్షికంగా కూల్చివేయించారు. అలాగే, ఆమె ఉండే నివాసం కూడా అక్రమమేనంటూ బీఎంసీ నోటీసులు జారీచేసింది. 
 
ఈ క్రమంలో కంగనా రనౌత్ ముంబైని వీడి వెళ్లిపోయింది. ఈ సందర్భంగా ట్విట్టర్ ద్వారా ఆమె స్పందిస్తూ, బరువెక్కిన హృదయంతో ముంబైని వీడి వెళ్లిపోతున్నానని తెలిపింది. వరుస దాడులతో, దారుణ వ్యాఖ్యలతో తనను భయభ్రాంతులకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. 
 
తన కార్యాలయాన్ని కూల్చేసిన తర్వాత తన ఇంటిని కూడా కూల్చడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. ఈ పరిణామాలన్నింటిని చూస్తే ముంబైని పీఓకే అంటూ తాను చేసిన కామెంట్ కరెక్టే అనిపిస్తోందన్నారు. ముంబై ఎయిర్ పోర్టుకు వెళ్లే ముందు ఆమె ఈ ట్వీట్ చేసింది. ముంబై నుంచి హిమాచల్ ప్రదేశ్‌కు బయల్దేరింది.
 
హిమాచల్ ప్రదేశ్‌కు వెళ్లే క్రమంలో తన హోమ్ టౌన్ చండీగఢ్‌లో కంగనా ల్యాండ్ అయింది. ఈ సందర్భంగా ఆమె మరో ట్వీట్ చేసింది. ఈసారికి తాను ముంబై నుంచి సురక్షితంగా బయటపడ్డానని చెప్పింది. ఒకానొక సమయంలో ముంబైలో తాను ఒక తల్లి స్పర్శను అనుభవించానని... కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ముంబైలో తాను బతికుండటమే లక్కీ అనిపిస్తోందని తెలిపింది. 
 
ఎప్పుడైతే శివసేన పార్టీ సోనియాసేనగా మారిపోయిందో... ముంబై అధికార యంత్రాంగమంతా టెర్రర్ గ్రూపులా తయారైందని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. కాగా, తన కార్యాలయాన్ని బీఎంసీ అధికారులు కూల్చివేసిన వ్యవహారంపై ఆమె రాష్ట్ర గవర్నర్ కోశ్యారికి ఫిర్యాదు చేసిన విషయం తెల్సిందే. ఆ తర్వాత ఆమె ముంబైను వీడి మణాలికి వెళ్లిపోయింది.