కంగనా రనౌత్, బాలీవుడ్ హీరోల్లో చాలామందికి కొరుకుడు పడని పేరు ఇది. నిజాన్ని నిర్భయంగా చెబుతానంటూ కంగనా రనౌత్ సోషల్ మీడియా ద్వారా కామెంట్లు చేస్తూ, టార్గెట్ పెట్టినవారిని ఉడికించేస్తుంది. ఇప్పుడు మహారాష్ట్ర సర్కారు కూడా ఇలాగే కంగనా రనౌత్ వ్యాఖ్యలతో ఆగ్రహంతో కట్టలు తెంచుకుంటోంది. ఆమె చేస్తున్న ప్రతి వ్యాఖ్య జాతీయ స్థాయిలో పతాక శీర్షికల్లో నిలుస్తున్నాయి.
ప్రభుత్వానికి పౌరుడికి ఘర్షణ మొదలైతే పౌరుడి పాపులారిటీ ఓ స్థాయిలో వెళ్తుంది. ఇప్పుడు కంగనా విషయంలోనూ అదే జరుగుతోంది. మహారాష్ట్ర ప్రభుత్వం కంగనా విషయంలో తీసుకుంటున్న ఒక్కో నిర్ణయం ఆమెకి మరింత పాపులారిటీని తెస్తోంది. మరోవైపు ఆమెకి మద్దతుగా సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి.
గత కొన్నిరోజులుగా జరుగుతున్న ఈ వ్యవహారంలో కంగనా రనౌత్ పాపులారిటీ మామూలుగా పెరగలేదు. ఇప్పుడు చాలామంది కంగనా రనౌత్ కాబోయే సీఎం అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. ముంబై మహానగరాన్ని పాక్ ఆక్రమిత కాశ్మీర్‌తో పోల్చిన బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌పై పగ తీర్చుకునేందుకు మహారాష్ట్రలోని శివసేన ప్రభుత్వం చర్యలు చేపట్టిందంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఇందులో ముంబై బాంద్రాలోని కంగనా సినీ కార్యాలయాన్ని బీఎంసీ అధికారులతో పాక్షికంగా కూల్చివేయించింది. ఇపుడు ఆమెపై డ్రగ్స్ కేసును నమోదు చేసింది. ఈ కేసులో విచారణకు హాజరు కావాలంటూ ముంబై పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ కేసు విచారించే బాధ్యతను ముంబై పోలీసులకు మహారాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి.
ఇదే అంశంపై మహారాష్ట్ర హోంమంత్రి కంగనా డ్రగ్స్ అంశాన్ని తెరపైకి తెచ్చారు. కంగనా మాజీ ప్రియుడు అధ్యయన్ సుమన్ గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూని ఆయన ఇపుడు ప్రస్తావించారు. కంగనా డ్రగ్స్ తీసుకుంటుందని ఆ ఇంటర్వ్యూలో అధ్యయన్ చెప్పాడని హోం మంత్రి గుర్తుచేశారు.
పైగా, తనకు కూడా డ్రగ్స్ ఇచ్చేందుకు కంగనా యత్నించిందని అధ్యయన్ ఆరోపించారని తెలిపారు. మహారాష్ట్ర హోం మంత్రి వ్యాఖ్యలు చూస్తుంటే అధ్యయన్ ఇంటర్వ్యూని ఆధారంగా చేసుకుని కంగనాను ఇరికించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్టు తెలుస్తోంది.
అధ్యయన్ వ్యాఖ్యలపై ఏం సమాధానం చెపుతారంటూ కంగనకు ముంబై పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ అంశానికి సంబంధించి తమ ముందు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఐతే అధ్యయన్ మాత్రం... ఎపుడో ఐదారేళ్ల క్రితం నేను చేసిన వ్యాఖ్యలను ఇప్పుడు పట్టుకున్నారనీ, తనను ఈ కేసులోకి లాగవద్దని అభ్యర్థిస్తున్నాడు.
మరోవైపు శివసేన వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రే భయపడినట్టే ఇపుడు ముంబైలో జరిగిందని బాలీవుడ్ నటి కంగనా రనౌత్ వ్యాఖ్యానించారు. ముంబైలోని తన కార్యాలయాన్ని ధ్వంసం చేయడంతో ఆమె మహారాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు.
తాజాగా బాల్ ఠాక్రేకు సంబంధించిన ఓ వీడియోను పోస్ట్ చేసి మరోసారి ఆ పార్టీపై విమర్శలు గుప్పించింది. తన ఫేవరెట్ ఐకాన్లలో ఒకరైన బాలా సాహెబ్ ఠాక్రే గతంలో చేసిన పలు వ్యాఖ్యలను గుర్తు చేస్తున్నానని ఆమె తెలిపింది.
కాంగ్రెస్ కూటమిలో ఏదో ఒకరోజు శివసేన కలవాల్సి వస్తుందేమోనన్నదే తనకున్న భయమని బాల్ థాకరే అన్నారని ఆమె పేర్కొంది. ప్రస్తుతం తన శివసేన పార్టీ పరిస్థితిని చూస్తే ఆయన ఆత్మ ఏ విధంగా ఫీల్ అవుతుందోనని ఆమె ట్వీట్ చేసింది.
కాగా, ఇటీవలే ఆమె శివసేనను సోనియా సేనగా అభివర్ణించి విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరేతో పాటు, శివసేన నేత సంజయ్ రౌత్‌పై ఆమె మండిపడుతోంది. అలాగే, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని కూడా ఆమె వదిలిపెట్టలేదు. "ప్రియమైన కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీగారు.. ఓ మహిళగా ఉండి మీ ప్రభుత్వం సాటి మహిళను పెడుతున్న ఇబ్బందులు చూసి వేదన కలగడం లేదా! అంబేద్కర్‌గారు మనకు ఇచ్చిన రాజ్యాంగంలోని సూత్రాలను పాటించాలని మీ ప్రభుత్వానికి మీరు సూచించలేరా? విదేశాల్లో పెరిగిన మీరు ప్రస్తుతం ఇండియాలో నివశిస్తున్నారు.
మీ నిశ్శబ్దాన్ని, అసమాన్యతను చరిత్ర నిర్ణయిస్తుంది. మొత్తం లా అండ్ ఆర్డర్‌ను ఉపయోగించి మీ ప్రభుత్వం ఓ మహిళను ఇబ్బందులకు గురి చేస్తుంది. మీరు జోక్యం చేసుకుంటారని భావిస్తున్నాను. శివసేన వ్యవస్థాపకులు బాల్ ఠాక్రే నాకెంతో ఇష్టమైన, ఆరాధ్యమైన వ్యక్తి. ఏదో ఒకరోజు శివసేన పార్టీ కాంగ్రెస్ పార్టీతో గ్రూపు కడుతుందేమోనని ఫీల్ అయ్యారు.
ఆయన అప్పుడు ఫీల్ అయిన విషయమే ఇప్పుడు శివసేన పార్టీలో కనిపిస్తోంది" అంటూ కంగనా అటు సోనియా గాంధీని, శివసేన ప్రభుత్వాన్ని దయ్యబట్టారు. మొత్తమ్మీద ఈ వ్యవహారంలో కంగనా రనౌత్ తాత్కాలికంగా ఇబ్బందులు పడ్డప్పటికీ ఆమె పాపులారిటీ మాత్రం అమాంతం పెరిగిపోయింది. ఏకంగా మహారాష్ట్ర కాబోయే సీఎం అనేంత వరకూ.. మరి కాలం ఏం చేస్తుందో చూడాలి.