శనివారం, 30 సెప్టెంబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 11 సెప్టెంబరు 2020 (15:21 IST)

బాలీవుడ్ నటి కంగనాపై డ్రగ్స్ కేసు?... విచారణకు రమ్మంటూ నోటీసులు!!

ముంబై మహానగరాన్ని పాక్ ఆక్రమిత కాశ్మీర్‌తో పోల్చిన బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌పై పగ తీర్చుకునేందుకు మహారాష్ట్రలోని శివసేన ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో ముంబై బాంద్రాలోని కంగనా సినీ కార్యాలయాన్ని బీఎంసీ అధికారులతో పాక్షికంగా కూల్చివేయించింది. ఇపుడు ఆమెపై డ్రగ్స్ కేసును నమోదు చేసింది. ఈ కేసులో విచారణకు హాజరుకావాలంటూ ముంబై పోలీసులు నోటీసులు జారీచేశారు. ఈ కేసు విచారించే బాధ్యతను ముంబై పోలీసులకు మహారాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. 
 
ఇదే అంశంపై మహారాష్ట్ర హోంమంత్రి కంగనా డ్రగ్స్ అంశాన్ని తెరపైకి తెచ్చారు. కంగనా మాజీ ప్రియుడు అధ్యయన్ సుమన్ గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూని ఆయన ఇపుడు ప్రస్తావించారు. కంగనా డ్రగ్స్ తీసుకుంటుందని ఆ ఇంటర్వ్యూలో అధ్యయన్ చెప్పాడని హోం మంత్రి గుర్తుచేశారు. 
 
పైగా, తనకు కూడా డ్రగ్స్ ఇచ్చేందుకు కంగనా యత్నించిందని అధ్యయన్ ఆరోపించారని తెలిపారు. మహారాష్ట్ర హోం మంత్రి వ్యాఖ్యలు చూస్తుంటే అధ్యయన్ ఇంటర్వ్యూని ఆధారంగా చేసుకుని... కంగనాను ఇరికించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్టు తెలుస్తోంది. 
 
అధ్యయన్ వ్యాఖ్యలపై ఏం సమాధానం చెపుతారంటూ కంగనకు ముంబై పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ అంశానికి సంబంధించి తమ ముందు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ నోటీసులపై కంగన స్పందించాల్సి ఉంది.