ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 13 ఆగస్టు 2023 (13:04 IST)

18న రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌ 'యోగి' రీ రిలీజ్‌

yogi
యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ - నయనతార జంటగా స్టార్‌ డైరెక్టర్‌ వినాయక్‌ దర్శకత్వం వహించిన చిత్రం 'యోగి' 2007వ సంవత్సరంలో విడుదలైన ఈ చిత్రం ప్రభాస్‌కు మంచి పేరు తెచ్చిపెట్టింది. పి. రవీంద్రనాథ్‌ రెడ్డి సమర్పణలో ఈశ్వరి ఫిలింస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పతాకంపై సుదర్శన్‌ రెడ్డి, చంద్ర ప్రతాప్‌ రెడ్డిలు నిర్మించారు. రమణ గోగుల సంగీత సారథ్యంలో రూపొందిన పాటలు యువతను ఉర్రూతలూగించాయి. 
 
తాజాగా ఈ చిత్రాన్ని చందు ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై లింగం యాదవ్‌ రీ రిలీజ్‌ చేస్తున్నారు. ఇందుకోసం ఈ చిత్రాన్ని 4కె ఫార్మట్‌లోకి మార్చారు. దిల్‌రాజు, శిరీష్‌ల సహకారంతో ఈనెల 18న ప్రేక్షకుల ముందుకు మరోసారి రాబోతున్న సందర్భంగా ఈ చిత్రం రీ రిలీజ్‌ టైలర్‌, పోస్టర్‌లాంచ్‌ ఈవెంట్‌ను శనివారం హైదరాబాద్‌లోని ప్రసాద్‌ ల్యాబ్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సంగీత దర్శకుడు రమణ గోగుల విచ్చేశారు. ఆయన చేతుల మీదుగా ట్రైలర్‌, పోస్టర్‌ను లాంచ్‌ చేశారు.
 
ఈ సందర్భంగా సంగీత దర్శకుడు రమణ గోగుల మాట్లాడుతూ...  అందరూ అన్నట్టుగా నేను మళ్లీ బ్యాక్‌ అవుతాను. టెక్నాలజీని వాడుకుని ఈ సినిమాను మంచి క్వాలిటీతో తీసుకొస్తున్నారు. సౌండ్‌ చాలా బాగా వచ్చింది. ఇంత కష్టపడిన టీం అందరికీ అభినందనలు. తప్పకుండా ఈ రీ రిలీజ్‌ మంచి లాభాలు తీసుకొస్తుందని నమ్ముతున్నా అన్నారు. 
 
లింగం యాదవ్‌ మాట్లాడుతూ... మా ఈ రీ రిలీజ్‌ ఈవెంట్‌కు విచ్చేసిన రమణ గోగుల గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు. ప్రభాస్‌ అభిమానులకు ఓ అద్భుతమైన ట్రీట్‌గా ఈ చిత్రాన్ని మంచి క్వాలిటీతో విడుదల చేయాలని నేను సంకల్పించుకున్నాను. సహజంగా నేను ఎగ్జిబిటర్‌ కావడంతో సినిమా క్వాలిటీపై మంచి అవగాహన ఉంది. అందుకే చాలా కష్టపడి ఈ సినిమాను 4కె ఫార్మట్‌లోకి మార్చాము. ఈ సినిమా విడుదలైనప్పుడు ప్రభాస్‌ అభిమానుల్లో చాలామంది చిన్న పిల్లలుగా ఉండి ఉంటారు. వారు ఇప్పుడు దీన్ని థియేటర్స్‌లో చూసి ఆనందిస్తారని ఖచ్చితంగా చెపుతాను. 
 
రమణ గోగుల అందించిన సంగీతం, వినాయక్‌ దర్శకత్వ ప్రతిభ, సుదర్శన్‌ రెడ్డి, చంద్ర ప్రతాప్‌ రెడ్డి గార్ల రాజీలేని నిర్మాణ విలువలు ఈ సినిమాను గొప్పగా తీర్చిదిద్దాయి. రీరిలీజ్‌లో కూడా ఇది సూపర్‌హిట్‌ అవుతుందనే నమ్మకం ఉంది. ఈ సినిమా విషయంలో నా గురువులు దిల్‌రాజు, శిరీష్‌ అండగా నిలిచి, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూట్‌ చేస్తున్నారు. అలాగే నా మిత్రడు నవీన్‌చంద్రరాజు, మాధవి ఈ ప్రాజెక్ట్‌ అనుకున్న దగ్గర నుంచి నాకు తోడుగా ఉన్నారు. వినాయక్‌, దిల్‌రాజు కూడా ఈ ఈవెంట్‌కు రావాల్సింది. అయితే అనివార్య కారణాలవల్ల వారు రాలేకపోయారు. ఈనెల 18న సుదర్శన్‌ థియేటర్‌లో అందరం కలిసి సినిమా చూస్తాం. ఇప్పటికే ఆన్‌లైన్‌లో బకింగ్‌లు సూపర్‌గా అవుతున్నాయి అన్నారు. 
 
తుమ్మలపల్లి రామ సత్యనారాయణ మాట్లాడుతూ... ముందుగా లింగం యాదవ్‌‌కి అభినందనలు. ఎందుకంటే ఒక మంచి సినిమాను రీ రిలీజ్‌కు ఎంచుకున్నారు. మాస్‌ ఎంటర్‌టైనర్‌. ఇప్పుడు ప్రభాస్‌ రేంజ్‌ ఎవరెస్ట్‌ రేంజ్‌లో ఉంది కాబట్టి ఖచ్చితంగా కనక వర్షం కురుస్తుంది. ఇందులో ఉన్న పాటలకు ఈ తరం యువత తప్పకుండా సూపర్‌గా రెస్పాండ్‌ అవుతారు. మా భీమవరంలో అల్రెడీ పెద్ద పెద్ద కటౌట్‌లు రెడీ చేస్తున్నారని నాకు ఫోన్‌లు వస్తున్నాయి అన్నారు. 
 
నవీన్‌చంద్రరాజు మాట్లాడుతూ... లింగం యాదవ్‌‌కి సినిమాలంటే ప్రాణం. స్కూల్‌ డేస్‌లోనే సైకిల్‌మీద ఒక చిన్న ప్రొజెక్టర్‌, తెర పెట్టుకుని, ఊరూరా తిరుగుతూ అర్థరూపాయికి, రూపాయికి సినిమాలు ఆడించిన వ్యక్తి. అలా అలా సినిమానే కెరీర్‌ ఎంచుకుని ఈరోజు తెలంగాణలో పలు థియేటర్స్‌కు ఓనర్‌ అయ్యారు. ఈ సినిమాకు ఒక స్ట్రెయిట్‌ సినిమాకు ఎంత కష్టం ఉంటుందో అంత కష్టపడ్డారాయన. తప్పకుండా ఆయనకు మంచి లాభాలు రావాలని కోరుకుంటున్నా అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీమతి మాధవి, డిస్ట్రిబ్యూటర్స్‌ రమేష్‌, అచ్చిబాబు, రఘురామరెడ్డి, అక్సాఖాన్‌ తదితరులు పాల్గొన్నారు. యు మీడియా కల్యాణ్‌ సుంకర ఈవెంట్‌ ఆర్గనైజ్‌ చేశారు.