నటీనటులు : వినోద్ వర్మ, సాయికుమార్, శుభలేఖ సుధాకర్, అనసూయ, సురభి ప్రభావతి, హర్ష చెముడు, శ్రీకాంత్ అయ్యంగార్, సుమన్, ఆమని
సాంకేతికత: కెమెరా: క్రిష్ణ ప్రసాద్,శివశంకర్ ప్రసాద్, సంగీతం: అనూప్ రూబెన్స్, జయశంకర్ దర్శకత్వం, ఆర్వీ సినిమాస్, రామిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి ( ఆర్ వీ రెడ్డి) , శ్రీనివాస్ రామిరెడ్డి, డి, శేషురెడ్డి మారంరెడ్డి, డా. తిమ్మప్ప నాయుడు పురిమెట్ల, బీరం సుధాకర్ రెడ్డి నిర్మాతలు. లింగ గుణపనేని కో ప్రొడ్యూసర్. ఏషియన్ సురేష్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా నేడే విడుదలైంది. ఇక ఈ సినిమాను ముందుగానే మాజీ ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు సహా పలువురు రాజకీయ, ఆధ్యాత్మిక ప్రముఖులు చూసి ప్రశంసించిన సినిమా ప్రేక్షకులకు ఎలా వుందో తెలుసుకుందాం.
కథ:
ఓ ఆశ్రమంలో త్రేతాయుగం, ద్వాపర యుగం గురించి భక్తులకు గురువు చెబుతుంటాడు. అలా చెబుతూ కథలోకి తీసుకెళతాడు. ఇక్కడ మీ కోరికలు తీర్చబడును.. అని ఇన్‌స్టాగ్రామ్, పేపర్స్, ఫోర్బ్స్ వంటి మ్యాగజైన్‌లలో వచ్చిన యాడ్ ఓ ఆరుగుర్నీ ఆకర్షిస్తుంది. వారంతా తమ కోరికలను తీర్చడానికి అతని (వినోద్ వర్మ) వద్దకు వెళతారు. అందులో ఫేమస్ టీ మాస్టర్ అమూల్ కుమార్ (హర్ష చెముడు)కు సన్నీ లియోన్ అంటే మోజు తో ఆమెను ఒకరోజు పొందాలనుకుంటాడు. ఇక ఎయిర్ హోస్టెస్ ఆత్రేయి (అనసూయ)కు తన సహ ఉద్యోగి మీద అసూయ. తను ఆమెకంటే అందంగా వుండాలనుకుంటుంది. అలాగే 60 ఏళ్ళపైబడిన గుంజన్ (శుభలేఖ సుధాకర్) తన కుటుంబీకుల ఆస్తి తన సొంతం కావాలనే దురాశ.
ఇంకోవైపు ఓ నిధి ని దక్కించుకోవాలనే సీఐ చైతన్య శ్రీకాంత్ అయ్యంగార్. మరోవైపు మరణించిన భర్తను మళ్ళీ బ్రతికించాలనే మోహంతో లక్ష్మి (సురభి ప్రభావతి). నెంబర్ 1గా వుండాలనే అత్యాసతో తన వారసులు ఎప్పటికీ ఐశ్వర్యంతో ఉండాలనే అహంకారంతో విప్రనారాయణ పాశ్వాన్ (సాయి కుమార్). వీరితోపాటు దొంగతనాలు చేసి జాలీగా ఎంజాయ్ చేయాలనుకునే ఓ కుర్రాడు. వీరందరికి లింక్ ఏమిటి? వారి కోరికలు నెరవేరాయా? లేదా? అనేది మిగిలిన సినిమా.
సమీక్ష:
కామ క్రోధ మధ మోహన లోభ మాత్సర్యాలు అనేవి అరిషడ్ వర్గాలు. ఇవి మనిషిలో వుంటే ఏవిధమైన పతనానికి దారి తీస్తాయనేది రామాయణ, మహాభారతాల్లో చెప్పేశారు. వాటిని ఇప్పటి కలియుగంలో మనుషులకు వుంటే వారి మానసిక స్థితి ఎలా వుంటుంది. వాటిని ఏవిధంగా సాధించుకోవాలనుకున్నారు అనేది అసలు కథ.
ఇది ఇప్పటి జనరేషన్ కు చెప్పాలని సినిమాటిక్ గా దర్శకుడు చెప్పాడు. అది సినిమా ఆరంబంలో ఆశ్రమంలో గురువు తన శిష్యులు శ్రీనివాస రెడ్డి, చమ్మక్ చంద్ర పాత్రలతో చెప్పడం వల్ల కథనం బాగున్నా, మరలా వారితో అర్థమయ్యేలా చెప్పండి అనడంతో చక్కగా సాగుతున్న కథనం ఫ్లో దెబ్బతినేట్లుగా అనిపిస్తుంది. ఆరుగురు మనుషులు, ఆరు కథలు సినిమాను ప్రారంభించిన విధానం, ఒక్కొక్కరి పరిచయం, సన్నివేశాలు ఆసక్తిగా అనిపించాయి. వాటిని విడమర్చి చెప్పే విధానంలో దర్శకుడు కొంత తడబాటు చూపినా చివరకు తనేం చెప్పదలిచాడనేది క్లారిటీ చెప్పడం విశేషం.
నిర్మాణ పరంగా వున్న వనరులను దర్శకుడు వినియోగించుకున్నా టెక్నికల్ పరంగానూ హైలైట్ కాలేకపోయింది. అసలు వినోద్ వర్మ పాత్ర లైబ్రరీలో పెట్టడం, అక్కడికి ఆరుగురు తమ సమస్యలు వినిపించడం అనేది కొత్తగా వున్నా.. లైబ్రరీలో సైలెన్స్ ను మొదట పాటించినట్లు కనిపించినా ఆ తర్వాత పాత్రలతో వాటిని గాలికి వదిలేశారు. సెకండాఫ్ లో వినోద్ వర్మ కనిపించే లైబ్రరీలో సెపరేట్ రూమ్ వున్నట్లు చూపించారు. అంతకుముందు అలా లేదు. ఇలాంటి చిన్న చిన్న పాయింట్లను కేర్ తీసుకుంటే బాగుండేది.
నటనతో పాటు డైలాగ్ కింగ్ సాయి కుమార్ విప్రనారాయణ పాశ్వాన్ పాత్రకు జీవం పోశారు. ఆహార్యం మరింత బాగుండేలా చర్యలు తీసుకోవాల్సింది. అసూయతో రగిలిపోయే అనసూయ పాత్ర ఓకే అనిపించేలా వుంది. పోలీసుఅయినా దొంగలతో సావాసం చేస్తూ సంపాదించే శ్రీకాంత్ అయ్యంగార్ పాత్ర బాగా చేశారు. ఆయన కుమారుడిగా చేసిన వ్యక్తి కూడా ఓకే. హర్ష చెముడు కామెడీ టైమింగ్ గురించి అందరికీ తెలుసు. నటన పరంగా శుభలేఖ సుధాకర్ లో ఊహించని కొత్త ట్విస్ట్ ఇచ్చాడు దర్శకుడు. సురభి ప్రభావతి పాత్రకు తగ్గట్టుగా చేశారు.
సాంకేతికంగా సంగీతం, కెమెరా నైపుణ్యం, కలర్ గ్రేడింగ్ తోపాటు లొకేషన్లు కథకు సరిపడిన విధంగా వున్నాయి. అయితే వెండితెరపై ఇలాంటి కాన్సెప్ట్ చెప్పాలంటే ఇంకా పరిణతి చెందాల్సివుంటుంది. ఒకరకంగా అగ్రదర్శకుడు తీయాల్సిన కథగా అనిపిస్తుంది. అయినా జయశంకర్ తనలోని ప్రతిభను కనబరిచి మంచి కంటెంట్ ను ఇప్పటి జనరేషన్ కు అందించే ప్రయత్నం చేసినందుకు అభినందనీయుడు. అయినా వెబ్ సిరీస్ కు ఇలాంటి కంటెంట్ ఎవర్ గ్రీన్. ఓటీటీకి మంచి మార్కెట్ తెచ్చే చిత్రమిదని చెప్పవచ్చు.
క్రిష్ణుడి వేషంలో వచ్చే పాట, మంగ్లీ సాంగ్ బాగున్నాయి. ఎంతటి వాడికైనా ఓ చిన్న సంఘటన జీవితాన్ని మార్చేస్తుందనే పాయింట్ ను దర్శకుడు బాగా చెప్పాడు.
రేటింగ్ : 3/5