నటీనటులు : సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, కిరణ్ అద్వానీ, హెరీ తండ్రీ, భూమిక చావ్లా, అనుపమ్ ఖేర్ తదితరులు.
సంగీతం : అమాల్ మాలిక్, రోచక్ కోహ్లి, నిర్మాతలు: అరుణ్ పాండే, ఫాక్స్ స్టార్ స్టూడియోస్, దర్శకత్వం : నీరజ్ పాండే.
క్రికెట్ అభిమానులకు ఎం.ఎస్.ధోని పేరు తెలిసిందే. క్రికెటర్‌గా తను ఏవిధంగా రాణించాడో అన్న అంశాన్ని కథగా తీసుకుని నీరజ్‌పాండే సినిమా చేశాడనగానే ఎక్కడలేని క్రేజ్ వచ్చేసింది. హిందీలో నిర్మించిన ఈ చిత్రాన్ని శుక్రవారమే విడుదల చేశారు. హైదరాబాద్‌లో ఐమాక్స్‌లో ఈ చిత్రం మార్నింగ్‌కే హౌస్‌ఫుల్ కావడం విశేషం. అసలు ధోని చరిత్రను ఎందుకు తీయాలనుకున్నారు. అందులో ఏం చెప్పారో తెలుసుకుందాం.
కథ :
బీహార్‌లో ఓ కాలనీలో నీళ్లు వదిలే పంప్ ఆపరేటర్ అనుపమ్‌ఖేర్ కొడుకే ధోని. చిన్నప్పటి నుంచి ఆటలంటే ఆసక్తి. బాగా చదివి తనలాగా కాకుండా పెద్ద ఉద్యోగం సాధించుకోవాలనేది తండ్రి కోరిక. ధోనీ. చిన్నతనం నుంచి ఫుట్‌బాల్ అంటే ఇష్టం. కీపింగ్ బాగా చేస్తాడు. అదిచూసిన స్కూల్ కోచ్.. ధోనీని క్రికెట్‌లోకి వచ్చేలా చేస్తాడు. అక్కడనుంచి ఒక్కో మెట్లు ఎక్కుతూ.. చిన్న చిన్నమ్యాచ్‌లో ఫోర్లు, సిక్సర్లు కొట్టి పేరు సంపాదించుకుంటాడు. క్రికెటర్ కావాలని కాలేకపోయినా ఓ స్టోర్ట్స్ షాప్ ఓనర్. ధోనీతోపాటే ఆడే స్నేహితులు.. ముఖ్యంగా ధోని తల్లి ఎంతగానో ప్రోత్సహిస్తారు. ఓసారి కలకత్తాలో జరిగే నేషనల్ మ్యాచ్‌కు సెలక్ట్ అయినట్లు పేపర్లో వస్తుంది. కానీ లెటర్ పోస్టల్ డిలే వల్ల చేరదు. అయినా.. పట్టువదలకుండా అతని స్నేహితులు కొంత డబ్బువేసుకుని.. కారులో అక్కడికి చేరుకుంటారు. కానీ వారు చేరుకోవాల్సిన విమానం అప్పటికే వెళ్ళిపోతుంది. దాంతో నిరాశతో తిరిగి ఇంటికి వస్తాడు. ఆ తర్వాత ధోనీ క్రికెట్ నచ్చి రైల్వేలో ఓ ఆఫీసర్ టికెట్ కలెక్టర్‌గా ఉద్యోగం ఇస్తాడు. దాంతో ధోనీ తండ్రి ఆనందపడతాడు. అయితే ఉద్యోగం చేస్తున్నా... ఏదో వెలితి... తనకిష్టమైన క్రికెట్‌ను ఆడలేకపోతున్నాననే బాధతో.. ఉద్యోగం మానేసి ఇంటి వచ్చేస్తాడు. ఆ తర్వాత రాష్ట్ర స్థాయిలో క్రికెట్ మ్యాచ్‌లో పాల్గొనడం.. ఆ తర్వాత జాతీయస్థాయిలో ఎంపిక కావడం జరుగుతుంది. ఆ తర్వాత కెప్టెన్ అయ్యేస్థాయికి చేరుకుంటాడు. వరల్డ్‌కప్ సాధిస్తాడు. అదెలాగనేది కథ.
విశ్లేషణ:
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, ధోనీ పాత్రకు బాగా సూటయ్యాడు. పాత్రకు చాలా బలం. మూడునెలలు క్రికెట్ నేర్చుకుని సినిమా చేయడం విశేషం. ధోనీ హావభావాలను, నడక తీరును అన్నింటినీ సరిగ్గా పట్టుకొని నటించిన సుశాంత్‌ను తెరపై చూస్తున్నంతసేపూ ధోనీ కనిపిస్తున్నట్లే అనిపించింది. ముఖ్యంగా కొన్ని భావోద్వేగపూరిత సన్నివేశాల్లో సుశాంత్‌ను అలా చూస్తూండిపోవాలనేంతగా జీవించాడు. ధోనీ గర్ల్‌ఫ్రెండ్‌గా నటించిన కిరణ్ అద్వానీ బాగా చేసింది. అనుపమ్ ఖేర్, భూమిక అందరూ తమ పాత్రలతో, నటనతో సినిమాకు ఓ స్థాయి తీసుకొచ్చారు.
మొదటిభాగం చాలా ఇంట్రస్ట్‌గా కన్పిస్తుంది. ఇండియన్ క్రికెట్‌కు సెలెక్ట్ అవ్వడంలో ధోనీ పడిన కష్టాలను ప్రస్తావిస్తూ, ఎమోషనల్‌గా నడుస్తూ కట్టిపడేసింది. సినిమాలో వచ్చే రెండు ప్రేమకథలు కూడా ఎంతో బాగా ఆకట్టుకున్నాయి. అదేవిధంగా 2011 వరల్డ్ కప్‌ను క్లైమాక్స్ సన్నివేశంగా పెట్టడంతో సినిమా టైమింగ్‌తో ముగిసి మంచి ఫీల్ ఇచ్చింది.
మైనస్ పాయింట్స్ :
అయితే సినిమా కాబట్టి.. కథ కూడా కాస్త సినిమాటిక్‌గా వుంటుంది. ఎంత వాస్తవమో కానీ.. కొన్ని కల్పితాలుగా వున్నాయి. ధోనీ వ్యక్తిగత జీవితాన్ని చూపించినంత బాగా కెరీర్ గురించి చెప్పకపోవడమే లోపం. ధోనీ కెప్టెన్‌గా ఎలా ఎదిగాడు? ఆ తర్వాత అతడిపై వచ్చిన వివాదాలను ఎలా ఎదుర్కొన్నాడు? ఇందులో కన్పించవు. ఫస్టాఫ్‌లో కొత్త ఆటగాళ్ళకు స్ఫూర్తిగా అన్పిస్తుంది.. అదే సెకండాఫ్‌కి వచ్చేసరికి హడావుడిగా ముగించాడు. నిడివి 3 గంటలైనా అభిమానులకు ఇంట్రెస్ట్‌గా అనిపిస్తుంది.
దర్శకుడు నీరజ్ పాండే తీసిన మూడు సినిమాలతోనే తనకంటూ ఒక ప్రత్యేక స్థాయి తెచ్చుకున్నాడు. ఈ సినిమాతో మరోసారి తన స్థాయికి తగ్గ ప్రతిభ చూపారు. కోట్లాది క్రికెట్ అభిమానులను సంపాదించుకున్న ధోనీ నిజ జీవిత కథను ఎవ్వరికీ తెలియని కోణంలో చెప్పాలన్న ప్రయత్నంలో నీరజ్ పాండే తన స్క్రీన్‌ప్లేతో విజయం సాధించాడు. మేకింగ్ పరంగా నీరజ్ స్టైల్‌ను అడుగడుగునా చూడొచ్చు. ఏమైనా ఇండియన్ క్రికెటర్.. చిన్నస్థాయినుంచి ఎలా పైకి ఎదిగాడనే కథను తెరపై చెప్పడం ఈనాటి తరానికి స్ఫూర్తిదాయకంగా ఉంటుంది.
ప్రొడక్షన్ వ్యాల్యూస్‌కి ఎక్కడా వంక పెట్టడానికి లేదు. సినిమాటోగ్రఫీ టాప్ క్లాస్ ఉంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు ఒక ఫీల్ తీసుకొచ్చింది. ఎడిటింగ్ కూడా బాగుంది. టెక్నికల్‌గా చూస్తే ధోనీ చాలా రిచ్‌గా ఉందనే చెప్పాలి.
ముగింపు:
ఇండియాలో క్రికెట్ అనేది ఒక మత్తులాంటిదంటారు. టైటిల్‌లోనే చెప్పేసినట్లు ధోనీ గురించి అందరికీ తెలిసిన కథ కాకుండా, ఎవ్వరూ చెప్పని కథనే సినిమాగా చెప్పే ప్రయత్నం ఈ సినిమాతో జరిగింది. ఏ రంగంలోనైనా చిన్నతనంలోనే బీజం పడుతుంది. అది ధోని విషయంలో జరిగింది. చదువా? ఆటలా? అనేది తండ్రి అడిగితే.. రెండూ అంటూ ధోనీ తల్లి ఇచ్చిన ప్రోత్సాహమే.. ఆయనకు బలం చేకూరింది. ముందు మ్యాచ్‌లో సరిగ్గా ఆడలేకపోయినా ధోనీ.. ఫైనల్‌లో ఆడతాడోలేదో అన్న టెన్షనలో అందరూ ఉంటే.. తల్లి మాత్రం పూజగదిలో పూజచేస్తేంటుంది.. విజయాన్ని అందుకున్న తర్వాత.. ఏ పూజా ఫలమో నాకు దక్కిందంటాడు. ఎంత కష్టపడినా.. దేవుని ఆశీస్సులుండాలనేది చెప్పకనే చెబుతాడు. ఇలాంటి చిత్రం ప్రతి క్రికెటర్ చూడతగ్గదే.
రేటింగ్: 4/5