శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 3 జూన్ 2022 (13:27 IST)

మేజర్ సినిమా రివ్యూ అదిరింది.. అడవి శేష్ అదరగొట్టాడు.. రేటింగ్ ఎంతంటే?

Major
Major
అడవి శేష్ నటించిన మేజర్ సినిమా శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ రివ్యూ రిపోర్ట్ ఎలా వుందో చూద్దాం...  
 
సినిమా: మేజర్‌ 
నటీనటులు: అడివి శేష్‌, సయీ మంజ్రేకర్‌, శోభిత ధూళిపాళ, ప్రకాశ్‌ రాజ్‌, రేవతి, మురళీ శర్మ తదితరులు
నిర్మాత: మహేశ్‌ బాబు, అనురాగ్‌ రెడ్డి, శరత్‌ చంద్ర
దర్శకుడు: శశి కిరణ్‌ తిక్క
సంగీతం: శ్రీచరణ్‌ పాకాల
సినిమాటోగ్ర‌ఫి:  వంశీ పచ్చిపులుసు
విడుదల తేది: జూన్‌ 3 2022
రేటింగ్ : 3/5
 
26/11 రియల్‌ హీరో మేజర్‌ సందీప్ ఉన్నికృష్ణన్‌ జీవిత చరిత్ర ఆధారంగా 'మేజర్‌' సినిమా వచ్చింది. ఈ సినిమాలో టాలీవుడ్ యువ హీరో అడివి శేష్‌ కీలక పాత్రలో నటించాడు. 
 
సందీప్ ఉన్నికృష్ణన్ బాల్యం, నేషనల్ డిఫెన్స్ అకాడమీలో ఎలా చేరారు?, దేశాన్ని ఎలా కాపాడారు? అన్న అంశాలతో మేజర్‌ తెరకెక్కింది. శుక్రవారం (జూన్‌3) ప్రేక్షకుల ముందుకు వచ్చిన మేజర్‌ని ప్రేక్షకులు ఏ మేరకు ఆదరించారో రివ్యూలో​ చూద్దాం. 
 
కథలోకి వెళ్తే...
కేరళకు చెందిన ఇస్రో అధికారి కె ఉన్నికృష్ణన్ (ప్రకాష్ రాజ్) తనయుడు సందీప్‌ ఉన్ని కృష్ణన్‌(అడివి శేష్‌). సందీప్‌కు చిన్నప్పటి నుంచి నేవీలో చేరాలని వుంటుంది. అయితే తండ్రికి అతడిని డాక్టర్‌ చేయాలని, తల్లికి (రేవతి) ఇంజినీరింగ్‌ చదివించాలని ఉంటుంది. 
 
సందీప్‌ పట్టుదల ముందు వారు తమ నిర్ణయాలను మార్చుకుంటారు. చివరికి నేవీలో అవకాశం రాకపోవడంతో.. దేశానికి ఎలాగైనా సేవ చేయాలనే కోరికతో ఎంతో కష్టపడి ఆర్మీలో జాయిన్ అవుతాడు సందీప్. మరోవైపు కాలేజీలో చదువుతుండగానే క్లాస్ మేట్ ఇషా (సయీ మంజ్రేకర్)తో ప్రేమలో పడతాడు. పెద్దల అంగీకారంతో పెళ్ళి చేసుకుంటాడు. 
Major
Major
 
ఇషాను ప్రేమించి పెళ్లి చేసుకున్నా.. ఉద్యోగం కారణంగా ఆమెతో ఎక్కువ సమయం గడపలేకపోతాడు. దీంతో వీరిమధ్య విభేదాలు విడాకుల వరకు వెళతారు. కుటుంబం కంటే దేశమే ఎక్కువ అని భావించే సందీప్‌.. ఆర్మీలో కష్టపడి ఎన్‌ఎస్‌జీ కమాండోలకు శిక్షణ ఇచ్చే స్థాయికి చేరుకుంటాడు. 
 
ఇంటికి వెళ్లేందుకు పైఅధికారి (మురళీ శర్మ) దగ్గర అనుమతి తీసుకొని బెంగళూరు బయలుదేరుతాడు. అదే సమయంలో ముంబై తాజ్‌ హోటల్‌పై ఉగ్రవాదులు దాడికి పాల్పడతారు. దాంతో తన ప్రయాణాన్ని రద్దు చేసుకొని '51 ఎస్‌ఎస్‌ జీ' బృందంతో కలిసి ముంబైకి వెళతాడు. 
Adivi Shesh, Major
Adivi Shesh, Major
 
తాజ్‌ హోటల్‌లో దాగి ఉన్న ఉగ్రవాదులను సందీప్‌ ఎలా మట్టుపెట్టాడు, హోటల్‌లో బందీగా ఉన్న భారత ప్రజలను ఎలా కాపాడాడు, ప్రజల కోసం తన ప్రాణాలను ఎలా పణంగా పెట్టాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.  
 
క్లైమాక్స్ సీన్స్ అదుర్స్:
ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించడంలో దర్శకుడు శశి కిరణ్‌ తిక్క సక్సెస్ అయ్యాడు. 26/11 ఉగ్రదాడిలో వీరమరణం పొందిన మేజ‌ర్ సందీప్ ఉన్ని కృష్ణ‌న్ గురించి తెలియని విషయాలను భారత ప్రజలకు చెప్పాడు. సందీప్‌కు తల్లిదండ్రులపై ఆయనకు ఉన్న ప్రేమ, ​లవ్‌ స్టోరీ, దేశం పట్ల ఎంత ప్రేముంది, ఉగ్రవాదులను ఎలా అంతం చేశాడు అనే విషయాలు ప్రేక్షకులకు కళ్ళకు కట్టినట్లు చూపించారు. ఫస్టాఫ్‌ అంతా ఆయన బాల్యం, లవ్‌స్టోరీతో సాగగా.. సెకండాఫ్‌లో 26\11 ఉగ్రదాడితో సినిమా నడించింది. క్లైమాక్స్ సీన్ అందరిని కంటతడి పెట్టిస్తుంది. 
 
ఎవరెలా చేశారంటే?:
మేజర్‌ సందీప్‌ ఉన్ని కృష్ణన్‌ పాత్రలో అడివి శేష్‌ జీవించాడు. వంద శాతం కష్టపడి నిజమైన సైనికుడి మాదిరి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. సందీప్‌ పాత్ర కోసం అతడు పడిన కష్టమంతా తెరపై బాగానే కనిపిస్తుంది.  ఇషా పాత్రలో సయీ మంజ్రేకర్‌ బాగా నటించారు. ఇద్దరి కెమిస్ట్రీ బాగుంది.
 
ప్రకాశ్‌ రాజ్‌ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాలో ఆయన చెప్పే డైలాగ్స్‌ కంటతడి పెట్టిస్తాయి. హైదరాబాద్‌ యువతి ప్రమోదారెడ్డిగా శోభిత ధూళిపాళ ఔరా అనిపించారు. మురళీ శర్మ, రోహిణి తమ పాత్రల మేర ఆకట్టుకున్నారు. చివరగా 'మేజర్‌'కి పెద్ద హ్యాట్సాఫ్‌. 
Major still
Major still
 
సెకండాఫ్‌లో ఉగ్ర‌వాదుల‌కు..ఎన్ఎస్‌జీ క‌మొండోల‌కు జ‌రిగే యుద్ధాన్ని.. హీరోయిజాన్ని ఎలివేట్ చేసేలా చూపిస్తూనే మరో వైపు ఓ ఎమోష‌న‌ల్ కోణాన్నిచక్క‌గా చిత్రీక‌రించారు. వంశీ ప‌చ్చి పులుసు సినిమాటోగ్ర‌ఫీ బావుంది. అబ్బూరి ర‌వి రాసిన ఎమోష‌న‌ల్ డైలాగ్స్ చివ‌ర‌లో ప్రేక్ష‌కుడికి ఎమోష‌న‌ల్‌గా క‌నెక్ట్ అవుతాయి. 
 
ఓ సైనికుడు దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన‌ప్పుడు అత‌ని కుటుంబం ప‌డే త‌ప‌న‌, తాప‌త్ర‌యాన్ని సెకండాఫ్‌లో చూపించిన తీరుకి ప్రేక్ష‌కుడి ఫిదా అవుతాడ‌న‌టంలో సందేహం లేదు. కచ్చితంగా అందరూ చూడాల్సిన చిత్రం.