నిర్మాణ సంస్థ : లైకా ప్రొడక్షన్.
సమర్పణ: మద్రాస్ టాకీస్.
నటీనటులు: అరవింద స్వామి, జ్యోతిక, శింబు, విజయ్ సేతుపతి, ప్రకాశ్ రాజ్, అరుణ్ విజయ్, ఐశ్వర్య రాజేశ్, త్యాగరాజన్ తదితరులు.
సంగీతం: ఎ.ఆర్.రెహమాన్.
నిర్మాతలు: మణిరత్నం, వల్లభనేని అశోక్.
దర్శకత్వ: మణిరత్నం.
భాతీయ దిగ్గజ దర్శకుల్లో మణిరత్నం ఒకరు. ఈయన చిత్రాలకు ఉన్నంత క్రేజ్ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 'నాయకుడు', 'రోజా', 'బొంబాయి', 'గీతాంజలి' వంటి చిత్రాలతో కోట్లాదిమంది అభిమానుల్ని సంపాదించుకున్నారు. కథ, కథాలతోపాటు వినూత్నమైన మేకింగ్ స్టైల్ ఆయనకు మాత్రమే సొంతం. అయితే, ఇటీవలి కాలంలో మణిరత్నం స్థాయికి తగ్గ హిట్ కనుచూపుమేరలో కనిపించలేదు. 'ఓకే బంగారం' చిత్రంతో ఓ మోస్తరు విజయాన్ని అందుకున్న ఈ స్టార్ దర్శకుడు అరవింద స్వామి, జ్యోతిక, శింబు, విజయ్ సేతుపతి, ప్రకాశ్ రాజ్, అరుణ్ విజయ్, ఐశ్వర్య రాజేశ్, త్యాగరాజన్ తదితర భారీ తారాగణంలో నిర్మించిన చిత్రం "నవాబ్". ఈ చిత్రం గురువారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది.
లైకా ప్రొడక్షన్స్ సమర్పణలో మద్రాస్ టాకీస్ బ్యానర్‌పై మణిరత్నం దర్శకత్వంలో భారీ మల్టీస్టారర్ చిత్రమిది. తమిళంలో 'చెక్క చెవంద వానం' అనే పేరుతో రిలీజైంది. తెలుగులో 'నవాబ్'గా రిలీజైంది. ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందించడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. మరి గురువారం విడుదలైన ఈ చిత్రం టాక్ ఎలా ఉందో ఓసారి పరిశీలిద్దాం.
కథ:
భూపతిరెడ్డి(ప్రకాశ్ రాజ్) రాష్ట్ర రాజకీయాలనే శాసించే మాఫియా నేత. ముగ్గురు కుమారులు. ఈయనకు చిన్నప్ప గౌడ్(త్యాగరాజన్) అనే శత్రువు కూడా ఉంటాడు. ఓసారి భూపతిపై ఇద్దరు వ్యక్తులు పోలీసుల వేషంలో వచ్చి దాడిచేస్తారు. ఆ దాడిలో భూపతి, అతని భార్య(జయసుధ) ప్రాణాపాయ స్థితికి చేరుకుంటారు. కానీ డాక్టర్స్ చికిత్సతో ప్రాణాలతో బయటపడతారు. ఒకవేళ భూపతికి ఏమైనా జరిగితే ఆయన స్థానంలో ఎవరు కూర్చువాలనే దానిపై చర్చ సాగుతోంది.
ఈ క్రమంలో భూపతి పెద్దకుమారుడైన వరద (అరవిందస్వామి) సిటీలోని వ్యవహారాలను చూసుకుంటూ ఉంటాడు. అలాగే, దుబాయ్‌లో వ్యాపారం చేసే త్యాగు(అరుణ్ విజయ్), సెర్బియాలో ఆయుధాల వ్యాపారం చేసే రుద్ర(శింబు) చేస్తుంటారు. ఈ ముగ్గురు మధ్యనే పోటీ ఉంటుంది. వరద స్నేహితుడు రసూల్(విజయ్ సేతుపతి) ఓ కేసు కారణంగా సస్పెండ్ అవుతాడు. రసూల్‌ని కూడా వరద తనకు సహాయంగా ఉంచుకుంటాడు. అంతా సవ్యంగా నడుస్తున్న సమయంలో భూపతిరెడ్డి హార్ట్ ఎటాక్‌తో చనిపోతాడు. త్యాగు తండ్రి కర్మ క్రియలకు కూడా రాలేదని వరద ఆగ్రహించుకుంటారు.
పైగా, అతనికి వ్యాపారం కోసం ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇవ్వడు. అదేసమయంలో త్యాగు ఇంట్లో పోలీస్ సోదాలు జరుగుతాయి. బ్రౌన్ షుగర్ దొరకడంతో పోలీసులు త్యాగు భార్య రేణు(ఐశ్వర్య రాజేష్)ను అరెస్టు చేస్తారు. రుద్ర గర్ల్ ప్రియురాలు (డయానా ఎర్రప్ప)ను ఎవరో చంపేస్తారు. ఇదంతా వరదనే చేయించాడని త్యాగు, రుద్రలు గట్టిగా విశ్వసిస్తారు. ఈ క్రమంలో వారిద్దరూ స్వదేశానికి బయలుదేరి మరిన్ని కష్టాల్లో ఇరుక్కుంటారు. ఆ కష్టాలేంటి? వాటివల్ల అన్నదమ్ముల మధ్య వచ్చిన విభేదాలేంటి? అనేవి తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ :
మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో సినిమా అంటే గన్‌ఫైర్స్, పోలీసులు, గ్యాంగ్‌స్టర్స్ మధ్య ఎన్‌కౌంటర్స్ అనే కాన్సెప్టే ఉంటుంది. కానీ, 'నవాబ్' చిత్రం అందుకు పూర్తిభిన్నం. ముగ్గురు అన్నదమ్ముల మధ్య జరిగే గొడవనను తెరకెక్కించే ప్రయత్నం చేశారు. అందులో పోలీసుల ప్రమేయం ఎంత ఉంటుందనేదే కథ. కానీ పోలీసుల ప్రయత్నం అనే చిన్న పాయింట్‌ను చివరివరకు చూపించకుండా మేనేజ్ చేయడంలో మణిరత్నం విజయవంతమయ్యారు.
ఇక ఏఆర్ రెహ్మాన్ సంగీత బాణీలు గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. ట్యూన్స్ సరిగ్గా లేవు. నేపథ్య సంగీతం బావుంది. సంతోష్ శివన్ సినిమాటోగ్రఫీ సూపర్బ్. ఇక నటీనటుల విషయానికి వస్తే.. ప్రకాశ్‌రాజ్, జయసుధ, అరవిందస్వామి, జ్యోతిక, అరుణ్ విజయ్, ఐశ్వర్య రాజేశ్, శింబు, విజయ్‌సేతుపతి ఇలా అందరూ నటన పరంగా వంద శాతం న్యాయం చేశారు. అయితే అన్నదమ్ముల మధ్య పోటీ అనేది ఎలా ఉంటుంది.. దాన్ని ఇతరులు ఎలా అడ్వాంటేజ్‌గా తీసుకుంటారన్నదే ఈ చిత్ర కథ.
ఈ చిత్రం ప్లస్ పాయింట్లను పరిశీలిస్తే, ఈ చిత్రానికి బలం నటీనటులు. కెమెరా పనితనం. నేపథ్య సంగీతం బాగుంది. అలాగే మైనస్ పాయింట్లను పరిశీలిస్తే, కథలో కొత్తదనం లేకపోవడం. మణిరత్నం వంటి దర్శకుడు కాన్సెప్ట్‌తో సినిమా చేయడమేంటనేది ఆలోచనవస్తుంది. ఎందుకంటే ఆయన ఇలాంటి మాఫియా బ్యాక్‌డ్రాప్‌తో ఇది వరకే 'నాయకుడు' వంటి ఎమోషనల్ మూవీ చేశారు. ఇపుడు ఇదే తరహాలో నవాబ్ చిత్రాన్ని తీశారని చెప్పొచ్చు.