గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By శక్తి
Last Updated : శనివారం, 7 డిశెంబరు 2019 (13:03 IST)

మిస్‌మ్యాచ్‌కాదది కరెక్ట్‌మ్యాచ్‌.. రివ్యూ రిపోర్ట్

నటీనటులు : ఉదయ్‌ శంకర్‌, ఐశ్వర్యా రాజేష్‌ తదితరులు
సాంకేతికత: సంగీతం :  గిఫ్టన్‌ ఇలియాస్‌, 
నిర్మాతలు: జి.శ్రీరామ్‌ రాజు, భరత్‌ రామ్‌, 
దర్శకత్వం: ఎన్‌.వి.నిర్మల్‌ కుమార్‌.
 
తొమ్మిదేవ ఏటనే లెక్కల్లో గినీస్‌బుక్‌ ఎక్కిన ఉదయ్‌శంకర్‌ తన నిజజీవితానికి దగ్గరగా వున్న కథతో 'మిస్‌మ్యాచ్‌' చిత్రం చేశాడని చెప్పగానే మంచి చిత్రమని అర్థమయింది. 'కౌసల్య కృష్ణమూర్తి'తో గుర్తింపు పొందిన ఐశ్వర్యరాజేష్‌ నాయికగా నటించిన 'మిస్‌మ్యాచ్‌' శుక్రవారమే విడుదలైంది. మహిళల్లో స్పూర్తి రగిలించే చిత్రమని దర్శక నిర్మాతలు చెబుతున్న ఈ చిత్రం ఎలా వుందో చూద్దాం.
 
కథ :
సిద్ధూ (ఉదయ్‌ శంకర్‌) స్పురద్రూపి. చిన్నతనంలోనే తన మెమోరీ పవర్‌తో గిన్నీస్‌ బుక్‌ రికార్డ్‌ను కూడా సొంతం చేసుకుంటాడు. సంప్రదాయాలు కట్టుబాట్లు గల కుటుంబం. మరోవైపు కనకమహాలక్ష్మి (ఐశ్వర్యా రాజేష్‌) చిన్న తనంలోనే చదువు మానేసి తండ్రి కోరికమేరకు కుస్తీనే జీవితంగా మార్చుకుంటుంది. ఒలింపిక్‌లో గోల్డ్‌మెడల్‌ కొట్టాలనే లక్ష్యం దిశగా ప్రయాణం చేస్తోంది. వీరిద్దరూ ఓ సందర్భంలో కలవడం, ఒకరికొకరు ఇష్టపడడం జరిగిపోతాయి. దంగల్‌, పొంగల్‌ కుటుంబాలకు చెందిన వీరి పెద్దలు వారి ప్రేమను వ్యతిరేకిస్తారు. కొన్ని సంఘటనల తర్వాత కనకమహాలక్ష్మి ఒలింపిక్‌లో కుస్తీపోటీల్లో పాల్గొనడానికి సిద్దు తోడుగా వెళ్ళాల్సి వస్తుంది. ఆ తర్వాత ఏమయింది? అనేది మిగిలిన సినిమా.
 
విశ్లేషణ:
ఇది ఫక్తు యువతకు స్పూర్తిదాయకంగా వుందనే చెప్పాలి. గతంలో దంగల్‌ చిత్రం వచ్చినా తెలుగులో కుస్తీ నేపథ్యంలో రావడం ఇదే ప్రథమం. ఆ పాత్రకు ఐశ్వర్య చక్కగా అమరింది. ఆమె పాత్ర ద్వారా స్పోర్ట్స్‌కి సంబంధించి స్ట్రాంగ్‌ మెసేజ్‌ బాగుంది. తను బలహీనమైన ఎమోషనల్‌ సీన్స్‌లో కూడా తన నటనతో పండించింది. మేథావి పాత్రకు ఉదయ్‌ సరిపోయాడు. 
 
ముఖ్యంగా హీరోయిన్‌తో ప్రేమలో పడే సీన్‌లోనూ కొన్ని ఎమోషనల్‌ సన్నివేశాల్లో చక్కని పెర్ఫార్మెన్స్‌ కనబర్చాడు. కండలు తిరిగిన దేహంతో హీరోలు వుండాల్సిన అవసరంలేదని ఆయన పాత్రతో దర్శకుడు నిరూపించాడు. మిగిలిన పాత్రలన్నీ సహజంగానే వున్నాయి. ఇందులో ప్రతీ సన్నివేశం ఆకట్టుకునేలా దర్శకుడు తీశాడు. 
 
ఒకరికొకరు భిన్నదృవాలయినప్పుడు, అభిరుచులు వ్యతిరేకంగా వున్నప్పుడు వాడే పదం మిస్‌మ్యాచ్‌. ఈ పదానికి పలు సన్నివేశాల్లో దర్శకుడు హీరోహీరోయిన్లపై ఆసక్తికరమైన చర్చ జరిపాడు. 'నువ్వు నాకు కావాలి' అనే డైలాగ్‌ ఆకర్షణగా వుంది. వారిద్దరిలో స్వచ్చమైన ప్రేమ కన్పిస్తుంది. మంచి మెసేజ్‌ అలాగే ఎమోషనల్‌గా సాగే లవ్‌ స్టోరీ ఉంది.   
 
ఒకవైపు ఇద్దరిమధ్య లవ్‌, మరోవైపు జీవితాశయం వంటి అంశాలతోపాటు పర్యావరణ అనే అంశాన్ని కూడా చూపించి కథను లింక్‌ చేసిన విధానం బాగుంది. పేరుకు మిస్‌మ్యాచ్‌ పెట్టినా.. అది కరెక్ట్‌మ్యాచ్‌ అనే కోణంలో హీరోయిన్‌ను చూపించారు. ఇంటర్‌వెల్‌ సన్నివేశం బాగుంది. ద్వితీయార్థంలో సిమెంట్‌ ఫ్యాక్టరీ వల్ల ఊరు మొత్తం తీవ్రంగా ఇబ్బంది పడుతుందనే అంశాన్ని తీసుకొచ్చి కథలో సీరియస్‌ నెస్‌తో పాటు అదే ట్రాక్‌ను లవ్‌ స్టోరీకి బాగానే కనెక్ట్‌ చేసినప్పటికీ కుస్తీ గేమ్‌కి సంబంధించిన సన్నివేశాలు బలంగా అనిపించవు. 
 
ఈ సినిమాకు సంబంధించి గిఫ్టన్‌ ఇలియాస్‌ అందించిన సంగీతం వినసొంపుగా వుంది. గణేష్‌ చంద్ర సినిమాటోగ్రఫీతో కనువిందు చేశాడు. సినిమాలోని చాలా సన్నివేశాలను కెమెరామెన్‌ ఎంతో రియలిస్టిక్‌గా, మంచి విజువల్స్‌తో చూపించారు. ముగింపులో సాగతీత సన్నివేశాలను తగ్గించి ఉంటే సినిమాకి బాగా ప్లస్‌ అయ్యేది. నిర్మాతలు జి.శ్రీరామ్‌ రాజు, భరత్‌ రామ్‌, ఎక్కడా కాంప్రమైజ్‌ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. నిర్మాణ విలువులు చాలా బాగున్నాయి. దర్శకుడు ఎన్‌.వి.నిర్మల్‌ కుమార్‌ తనదైన శైలిలో సందేశాత్మక చిత్రాన్ని అందించారు. 
 
అమ్మాయిలు కూడా అబ్బాయిలతో సమానంగా చూడాలనే పాయింట్‌ను ఇందులో చూపించాడు. కూతురు కోసం తండ్రి పడే తపన ఇందులో చక్కగా కన్పిస్తుంది. పొంగల్‌, దంగల్‌ కుటుంబాల మధ్య జరిగే ప్రేమకథ. హీరో స్నేహితుల మధ్య హీరోయిన్‌ హీరో సన్నివేశాల మధ్య ఎంటర్‌టైన్‌మెంట్‌ బాగుంది. 
 
మెయిన్‌ కాన్సెప్ట్‌తో పాటు ఎమోషనల్‌ సాగే లవ్‌ ట్రాక్‌ అలాగే క్లైమాక్స్‌ సీక్వెన్స్‌ సినిమాలో ఆకట్టుకుంటాయి. లాజిక్‌లను వెతక్కుండా వుంటే.. మధ్యతరగతి కుటుంబం బాధ్యతలు, పోటీతత్త్వం వంటివి ఇప్పటి ట్రెండ్‌కు కావాల్సిన అంశాలు ఇందులో వున్నాయి. అందరూ చూడతగ్గ చిత్రమిది.
 
రేటింగ్‌: 3/5

శక్తి