బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 22 నవంబరు 2019 (11:59 IST)

ప్రేమలో ఋషి అయిన 'పిచ్చోడు' రివ్యూ రిపోర్ట్

విడుదల తేదీ: నవంబర్‌ 22, 2019
నటీనటులు: క్రాంతి, కె. సిమర్‌, పోసాని కృష్ణమురళి, సత్యకృష్ణ, సమీర్‌, అభయ్‌, మహేష్‌, అప్పారావు తదితరులు
సాంకేతిక వర్గం: సినిమాటోగ్రఫీ: గోపి అమితాబ్‌, 
సంగీతం: బంటి, 
బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌: శ్రీ వెంకట్‌, శివ, 
ఎడిటర్‌: సంతోష్‌ గడ్డం, 
ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్స్‌: గురు, మౌర్య తేజ,
నిర్మాత, దర్శకత్వం: హేమంత్‌ శ్రీనివాస్‌
 
రొటీన్‌గా వస్తున్న ప్రేమకథలకు భిన్నంగా ఆలోచించి కొత్తగా చూపించాలనే తాపత్రయం కొత్త దర్శక నిర్మాతలకు కన్పిస్తుంది. కథల్ని కూడా వాస్తవిక అంశాలను సమాజంలో జరిగే కొన్ని సంఘటనలను బేరీజువేసుకుని తీసే నూతన దర్శకులు ప్రస్తుతం వస్తున్నారు. వారిలో హేమంత్‌ శ్రీనివాస్‌ ఒకరు. తనకు అనుభంలోకి వచ్చిన కథను వెండితెరపై ఆవిష్కరించానని చెబుతున్న ఆయన తీసిన చిత్రం 'పిచ్చోడు'. టైటిల్‌ నెగెటివ్‌గా వున్నా అందులో అంశం చాలా కొత్తగా వుందని చెబుతున్న ఆయన తీసిన చిత్రం ఎలా వుందో చూద్దాం.
 
కథ :
రిషి చిన్నతనంలోనే తల్లి ఆత్మహత్య చేసుకుంటుంది. అమ్మానాన్నలు ఒకరికొకరు సోల్‌మేట్స్‌ కాకపోవడంతోనే అమ్మ ఆత్మహత్య చేసుకుందనే నానమ్మ మాటలు అతని మదిలో నాటుకుపోతాయి. దాంతో పెరిగి పెద్దయ్యాక తన జీవితం అలా అవ్వకూడదనే నిర్ణయానికి వస్తాడు. అందుకోసం తన సోల్‌మేట్‌ ఎక్కడుందనే వెతికే పని పెట్టుకుంటాడు. రిషి జీవితంలో గోల్‌ అదే. ఆ క్రమంలో జరిగే సంఘటనలు సమాహారాలే మిగిలిన కథ. ఇంతకీ సోల్‌మేట్‌ అంటే ఏమిటి? అదొక సైన్సా, మూఢనమ్మకమా! అనే కోణంలో ఆవిష్కరించిన చిత్రమే ఇది.
 
విశ్లేషణ:
'సోల్‌ మేట్‌.. మూఢనమ్మకం కాదు సైన్స్‌' అన్న ఈ చిత్రంలోని ట్రైలర్‌లో చెప్పిన డైలాగ్‌తో కథ ఏ తరహానే ముందుగానే దర్శక నిర్మాత చెప్పేశాడు. దాదాపు ఈ తరహా కథ రాలేదనే చెప్పాలి. పిచ్చోడు అనే టైటిల్‌ వుంటే.. ఇదేదో ఉపేంద్ర తరహా కథనే ఊహకూడా వస్తుంది. అయితే సమాజంలో జరిగిన ఓ సంఘటన ఆధారంగా కథను రాసుకుని తనదైన స్క్రీన్‌ప్లేలో వివరించాడు దర్శకుడు.
 
అందుకు కొంత కసరత్తు కూడా చేసినట్లు తెలుస్తోంది. నటీనటులు కొత్తవారినప్పటికీ పాత్రకనుగుణంగా చక్కగా నటించారు. ''అందరు ఋషులు, భక్తిలో ఋషులైతే ఈ ఋషి ప్రేమలో ఋషి అయ్యాడు' అన్న డైలాగ్‌ కూడా అతికినట్లుగా పెట్టాడు. రెండుపాటలైనా మనసుకి నచ్చుతాయి. ''నువ్వే నువ్వే..' పాట గుర్తుండి పోతుంది. 
 
ఫోటోగ్రఫీని గోపీ మరింత కేర్‌ తీసుకుంటే బాగుండేది. సీరియల్స్‌కు ఆకట్టుకునే సంగీతాన్ని ఇవ్వడంతో తనదైన ముద్రవేసుకున్న బంటి ఇందులో రీ రికార్డింగ్‌ను శ్రీ వెంకట్‌, శివ సహకారంతో వన్నెతెచ్చాడు. సినిమా స్థాయిని పెంచాడు. నిర్మాణ విలువలు బాగున్నాయి. క్లైమాక్స్‌ గుర్తుండిపోతుంది.
 
జీవితంలో ప్రతివారికి తోడు కావాలి. ఆ తోడు అనేది ప్రేమించే రూపంలో కొందరికి దక్కితే. పెద్దలు కుదిర్చిన సంబంధాలతో మరికొందరికి దక్కుతుంది. అసలు ప్రతి మనిషీ హాయిగా ఆనందంగా వుండాలంటే మనస్సు ప్రశాంతంగా వుండేలా జీవించే తోడు కావాలి. దాన్నే సోల్‌మేట్‌ అంటారు. మనిషి బయట లోపల వేరువేరుగా వుంటారు. రెండింటా ఒకేలా హాయిగా వుండాలంటే జీవితభాగస్వామి పాత్ర చాలా కీలకం. 
 
దీనిపై గతంలో కొన్ని చిత్రాలు వచ్చినా సోల్‌మేట్‌ అనే కాన్సెప్ట్‌తో రావడం విశేషం. ఇప్పటికే కొన్నిచోట్ల సోల్‌మేట్‌కు సంబంధించిన దానిపై రీసెర్చ్‌కూడా జరుగుతోంది. నూతనంగా ఆలోచించే దర్శకుడిగా హేమంత్‌ శ్రీనివాస్‌ కన్పించాడు. పలు సన్నివేశాలు బాగున్నా... అక్కడక్కడా సన్నివేశాలకు లింక్‌ మిస్‌ అయిందనిపిస్తుంది. ఎడిటింగ్‌ ఇంకాస్త జాగ్రత్త  తీసుకుంటే బాగుండేది. పరిమిత బడ్జెట్‌తో తీసిన ఈ చిత్రం యూత్‌ చూడాల్సి చిత్రం. 
 
రేటింగ్‌ : 3/5