సామాజిక అంశంతో కూడిన రాధా మాధవం ప్రేమ కథ - రివ్యూ
వినాయక్ దేశాయ్, అపర్ణా దేవీ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం రాధా మాధవం. గోనాల్ వెంకటేష్ నిర్మాత. దాసరి ఇస్సాకు దర్శకత్వం వహించారు. వసంత్ వెంకట్ బాలా ఈ చిత్రానికి కథ, మాటలు, పాటలను అందించారు. ఈ చిత్రం మార్చి 1న విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఓ సారి చూద్దాం.
కథ
రాధా (అపర్ణా దేవీ) గ్రామీణ యువతి. పరిస్థితులవల్ల పట్టణంలో మాధవ కేర్ సెంటర్‌ను పెట్టి అనాథ పిల్లల్ని, వృద్దుల్ని, తాగుడుకు బానిసలైనవారిని కేర్ తీసుకుంటుంది. వారి ఆలోచనలను మార్చి పనిచేయడానికి కష్టపడేవారిగా మారుస్తుంది. కొంతకాలానికి జైలు నుంచి తప్పించుకున్న వీరభద్రం (మేక రామకృష్ణ) అనుకోని దుస్థితిలో కేర్ సెంటర్ కు వస్తాడు. నిర్వాహకురాలు తన కుమార్తె అని తెలుసుకుని సిగ్గుపడతాడు. అసలు వీరభద్రం జైలుకు ఎందుకు వెళ్తాడు? ఈ తండ్రీ కూతుళ్ల మధ్య దూరం ఎందుకు వచ్చింది? రాధ అసలు మాధవ పేరుతో కేర్ సెంటర్‌ను ఎందుకు ప్రారంభించింది? అసలు రాధా మాధావం ప్రేమ కథ ఏంటి? అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
సమీక్ష:
గ్రామీణ ప్రేమకథలు అంటే చాలా ఆహ్లాదకరంగా వుంటాయి. అలాంటి చోట చెల్లాచెదురు కలిగించే గాలివాన కూడా వుంటుంది. అదే ఈ సినిమా కథ. సాఫీగా సాగుతున్న ఇద్దరు ప్రేమికుల జీవితాల్లో పరువు, ప్రతిష్ట పేరుతో ఓ పెద్ద మనిషి ఆడిన ఆటే ఈ కథ. ఇలాంటివి వాస్తవంగా పలు చోట్ల జరిగిన సంఘటనలే. వీటిని ఒక్కొక్కరు ఒక్కోరంగా తెరకెక్కించారు. ఆ కోవలోనే ఈ దర్శకుడు తీసిన సినిమా. అయితే ప్రేమ కథలకు పీరియడ్ బ్యాక్ డ్రాప్ యాడ్ చేస్తే కాస్త ఫ్రెష్ ఫీలింగ్ వచ్చేలా దర్శకుడు చేశాడు.
చదువుకున్న గ్రామీణ యువకుడిగా అమాయకత్వాన్ని తన నటనలో వినాయక్ దేశాయ్ మాధవ పాత్రలో చూపించాడు. తన ప్రేమను, లక్ష్యాన్ని సాధించుకునే కుర్రాడిగా కనిపిస్తాడు. యాక్షన్, డ్యాన్సులు ఇలా అన్నింట్లోనూ మెప్పిస్తాడు. ఇక అపర్ణా దేవీ తన పాత్రకు న్యాయం చేసింది. మేక రామకృష్ణ పాత్రే హైలెట్‌గా నిలుస్తుంది. ఊరి పెద్ద, సర్పంచ్, వీర భద్రంగా మేక రామకృష్ణ నటించాడు. మిగిలిన పాత్రలన్నీ కూడా పరిధి మేరకు ఆకట్టుకుంటాయి.
దర్శకుడు. ఊరి వాతావరణం, కుల వివక్ష మీద సీన్లను రాసుకుంటూ పోయాడు. ఇంటర్వెల్ వరకు ప్రేమ కథ మలుపు తిరుగుతుంది. అలా ఫస్ట్ హాఫ్ అంతా ఎంటర్టైనింగ్‌గా సాగుతుంది. ఎంటర్ టైన్ మెంట్ కోసం చిన్నపిల్లల ఎపిసోడ్, మాధవ కేర్ సెంటర్, అక్కడి ఫన్నీ సీన్లతో సరదా సరదాగా సాగుతుంది. ఆ తరువాత ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళి సరికొత్తగా చూపించే ప్రయత్నం చేశాడు.
సెకండాఫ్ సీరియస్ గా సాగుతుంది. కుల వివక్షతతో రగిలిపోయే పెద్ద మనుషులు తీరు కళ్ళకు కట్టినట్లు చూపించాడు. ఈ క్రమంలో హీరో లక్ష్యాన్ని తెలియజేసే అంశం బాగుంది. ఇక కులాల మీద రాసుకునే పవర్ ఫుల్ డైలాగ్స్ మామూలుగా లేవు. అర్థవంతమైన సన్నివేశాలున్నాయి. కానీ, మరింతగా చెప్పదలచిన పాయింట్ ను లైటర్ వేల్ లో చెప్పాడు. మాటలు అందరినీ ఆలోచింపజేస్తాయి. కెమెరా పనితనం, పాటల్లో సాహిత్యం సినిమా స్థాయికి తగినట్లుగా రాసుకున్నాడు. నిర్మాత స్తాయికి తగిన సినిమా తీశాడు. ఇప్పటి హైటెక్ యుగంలోనూ పరువు హత్యలు అనేవి అన్నిచోట్ల చాలానే జరుగుతున్నాయి. ఇటువంటి సినిమాల ద్వారా కొంతైనా మార్పువచ్చేలా వుంటే దర్శక నిర్మాతల క్రుషి ఫలించినట్లే.
రేటింగ్:2.75/5