శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By
Last Modified: శుక్రవారం, 16 నవంబరు 2018 (20:16 IST)

'బిచ్చగాడు' 'రోషగాడు'గా వస్తే... రివ్యూ రిపోర్ట్

రోషగాడు నటీనటులు : విజయ్‌ ఆంటొని, నివేత పేతురాజ్‌, డానియల్‌ బాలాజీ తదితరులు; సాంకేతికత: ఛాయాగ్రహణం : రిచర్డ్‌ నాథన్‌, సంగీతం: విజయ్‌ ఆంటొని, దర్శకత్వం: గణేషా, నిర్మాత: ఫాతిమా విజయ్‌ ఆంటొని.
 
'బిచ్చగాడు' చిత్రంతో తెలుగులో మంచి గుర్తింపును తెచ్చుకున్న తమిళ హీరో విజయ్‌ ఆంటోనీ నటించిన తాజా చిత్రం 'రోషగాడు'. అంతకుముందు కొన్ని తప్పిదాలు జరిగినా వాటిని సరిదిద్దుకుని మరీ ముందుకు వచ్చానని వెల్లడించిన ఆంథోని ఈసారి ఎలా వున్నాడో చూద్దాం. 
 
కథ:
పోలీస్‌ కానిస్టేబుల్‌ అయిన కుమార స్వామి (విజయ్‌ ఆంథోని) తన తమ్ముడు రవికి అమ్మా, నాన్న తనే. తమ్ముడిలో అమ్మను చూసుకుని పొంగిపోతాడు. కానీ తమ్ముడు చదువు అబ్బక వ్యసనపరుడై ఇంటి నుంచి పారిపోతాడు. అలా హైదరాబాద్‌ పారిపోయి అక్కడి తుప్పుబాబ్జి అనే రౌడీ దగ్గర చేరి హత్యలు చేస్తుంటాడు. రెండు సంవత్సరాల తరువాత ఇన్స్పెక్టర్‌గా హైదరాబాద్‌కు బదిలీ మీద వచ్చిన కుమార స్వామి ఓ హత్య కేసులో సాక్షి. అది తన తమ్ముడే చేశాడని తెలుసుకుని అతన్ని చంపేస్తాడు. అయితే, తన తమ్ముడులాగే మరి కొంతమంది పిల్లలు కూడా బాబ్జి కోసం పనిచేస్తున్నారని తెలుసుకొని కుమార్‌ స్వామి వారందరిని మార్చాలనుకుంటాడు. ఈ క్రమంలో కుమార స్వామి అనుకున్నది చేయగలిగాడా? లేదా? అనేదే మిగితా కథ.
 
విశ్లేషణ :
పోలీసు కథలన్నీ ఒకేలా వుంటాయి. సమాజంలో జరిగే చెడును నిర్మూలించేసి మంచిని చేసేవాడే పోలీసు. ఆ చెడే తన ఇంటిలో వుంటే దాన్ని ఎలా నిర్మూలించి సమాజాన్ని ఎలా ఉద్దరించాడన్నది ఇందులోని పాయింట్‌. సరికొత్త కథలతో ముందుకు వచ్చే ఆంథోని ఈ చిత్రంలో కొన్ని అంశాలను కళ్ళకు కట్టినట్లు చూపించాడు. సాల్వ్‌ చేసే క్రమంలో సినిమాటిక్‌గా వున్న మంచి ప్రయత్నం చేశాడనిపిస్తుంది. తన నటనపై తనే సెటైర్లు వేసుకొనేలా కొన్ని సన్నివేశాలు రాసుకోవడం విశేషం. 
 
ఇక విజయ్‌కి సపోర్ట్‌ చేసే పాత్రలో నటించిన హీరోయిన్‌ నివేత పేతురాజ్‌ లుక్స్‌ పరంగా ఆకట్టుకొని తన ఎనర్జిటిక్‌ నటనతో మెప్పించింది. ఇక విలన్‌ పాత్రలో నటించిన డానియల్‌ బాలాజీ తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. ఫస్ట్‌ హాఫ్‌లో వచ్చే ఎమోషనల్‌ సన్నివేశాలుతో పాటు ఇంటర్వెల్‌ ట్విస్ట్‌ కూడా బాగుంది. ఇందులో హిజ్రాలకు న్యాయం చేసేట్లుగా పోలీసు పాత్రను కూడా పెట్టారు.
 
దర్శకుడు గణేశా మంచి మెసేజ్‌ వున్న స్టోరీని ఎంచుకున్న దాన్ని తెర మీద తీసుకురావడంలో కొన్నిచోట్ల స్లో నరేషన్‌తో సాగించాడు. దాంతో ఫస్ట్‌ హాఫ్‌ బోర్‌ కొడుతుంది కానీ ఇంటర్వెల్‌లో ఒక చిన్న ట్విస్ట్‌‌తో సినిమాఫై ఆసక్తిని క్రియేట్‌ చేయడంలో సఫలమైన తరువాత అదే మ్యాజిక్‌ని కొనసాగించలేకపోయాడు. ఇక సినిమా మొత్తం తమిళ్‌ ఫ్లేవర్‌‌లో ఉండడం కొన్ని చోట్ల హద్దులు దాటడం వంటి అంశాలు కూడా తెలుగు ప్రేక్షకులకు రుచించవు. సంగీతం కూడా సినిమాకు మైనస్‌ అయ్యింది.
 
ఇక ఈ చిత్రానికి సంగీతం, ఎడిటింగ్‌ అందించిన హీరో విజయ్‌ ఆంథోని రెండింటిలోనూ సత్తా చాటలేకపోయాడు. ఉన్నవి మూడు పాటలే అయినా దాంట్లో ఏ ఒక్కటి గుర్తిండిపోవు. రిచర్డ్‌ నాథన్‌ ఛాయాగ్రహణం బాగుంది. లోబడ్జెట్‌ సినిమా అయినా ఫాతిమా విజయ్‌ ఆంటొని నిర్మాణ విలువలు పర్వాలేదనిపించాయి. వైవిద్యంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్‌ ఆంథోనికి ఈ చిత్రం ఇంతకుముందు చిత్రాలకంటే బెటర్‌ అని చెప్పొచ్చు. మాస్‌ ఎలిమెంట్స్‌‌తో వచ్చిన ఈ చిత్రం ఏ సెంటర్ల ప్రేక్షకులను మెప్పించలేకపోయిన బి,సి సెంటర్ల ప్రేక్షకులు కనెక్ట్‌ అయ్యే అవకాశాలుఉన్నాయి.
-మురళీకృష్ణ