శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 27 మే 2022 (16:31 IST)

టైంపాస్ సినిమా ఎఫ్-3- రివ్యూ రిపోర్ట్‌

F3 poster
F3 poster
నటీనటులు: వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్, సోనాలి చౌహాన్, సునీల్, రాజేంద్ర ప్రసాద్, మురళీ శర్మ, ఆలీ, రఘుబాబు,  వెన్నెల కిషోర్, సంపత్, సత్య, ప్రగతి, అన్నపూర్ణ, వై.విజయ, ప్రదీప్ తదితరులు.
 
సాంకేతిక‌తః  ఛాయాగ్రహణం: సాయి శ్రీరామ్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, నిర్మాతలు: దిల్ రాజు-శిరీష్, రచన-దర్శకత్వం: అనిల్ రావిపూడి

 
మూడేళ్లనాడు విడుద‌లైన ఎఫ్‌2 సినిమాకు సీక్వెల్‌గా రూపొందిన సినిమా ఎఫ్‌3. స‌మ్మ‌ర్ సోగ్గాళ్ళు అనే కాప్ష‌న్‌తో ఈరోజే ధియేట‌ర్ల‌లో విడుద‌లైంది. ఈ సినిమాపై న‌మ్మ‌కంతోనే ప్రాంచైజ్‌గా ఎఫ్ 4కూడా వుంటుంద‌ని చెప్పేసిన దర్శకుడు అనిల్ రావిపూడి అంచనాలను ఏమేర అందుకుందో తెలుసుకుందాం.

 
కథ:
వెంకీ (వెంకటేష్).. వరుణ్ (వరుణ్ తేజ్) మ‌ధ్య‌త‌ర‌గ‌తి వ్య‌క్తులు. వెంకీకి స‌వ‌తి త‌ల్లి, ముగ్గురు చెల్లెల్లు, ఓ త‌మ్ముడు. వారిని పోషించ‌డానికి మీడియేట‌ర్‌గా ఓ ఉద్యోగం చేస్తుంటాడు. వ‌రుణ్‌కు న‌త్తి. డ‌బ్బున్న అమ్మాయిను ప్రేమించి పెండ్లిచేసుకోవాల‌నుకుంటాడు. అలాగే హనీ (మెహ్రీన్)ను చూసి డబ్బున్న అమ్మాయిగా పొరబడి ఆమెకోసం ఫ్రెండ్ అయిన వెంకీ స‌హ‌కారంతో అప్పుచేసి అన్నీ స‌మ‌ర్పించుకుంటాడు. చివ‌రికి హ‌నీ వ‌ల్ల మోస‌పోయాన‌ని తెలుసుకుని ఆ డ‌బ్బును రాబ‌ట్టుకోవాల‌ని ప్లాన్ వేస్తారు. సాధ్యంకాక‌పోవ‌డంతో బెడిసికొట్ట‌డంతో ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డానికి సిద్ధ‌మ‌వుతారు. ఆ స‌మ‌యంలో విజ‌య‌న‌గ‌రంలోని ఓ జ‌మిందారీ ఇంటి వార‌సుడుగా వెళ్ళాల‌ని ఓ ప్ర‌క‌ట‌న ద్వారా ఐడియా వ‌స్తుంది. ఆ త‌ర్వాత ఏమ‌యింది? అనేది మిగిలిన సినిమా. 

 
విశ్లేషణ:
అనిల్ రావిపూడి సినిమా ప‌టాస్‌లో ఎంత హ‌డావుడిచేసి ప్రేక్ష‌కుల‌ను న‌వ్వించాడో ఇప్పుడు ఎఫ్‌3లోనూ అంతే ఇదిగా న‌వ్వించే ప్ర‌య‌త్నం చేశాడు ద‌ర్శ‌కుడు. ప్ర‌తివారికి డ‌బ్బు కావాలి. అది వుంటే ఎలాంటి ఇబ్బందులు వుంటాయి. అదే డ‌బ్బు కోసం లేనివారు ఎంత‌గా ప‌రితపిస్తార‌నేది సినిమాటిక్‌గా తీసే ప్ర‌య‌త్నం చేశారు. వెంకీకి రేచీక‌టి, వ‌రుణ్‌కు న‌త్తి. ఈ రెండు మేన‌రిజాలు పెట్టి స‌న్నివేశ‌ప‌రంగా న‌వ్వించే ప్ర‌య‌త్నం చేశారు. ఆ పాత్ర‌ల‌కు ఇద్ద‌రూ న్యాయం చేశారు. ఇక త‌మ‌న్నా, మెహ్రిన్ అక్కా చెల్లెళ్ళు. ప్రగతి, అన్నపూర్ణ, వై.విజయ, ప్రదీప్ వారి కుటుంబం. వీరంతా అమాయ‌కుడైన వెంకీని మోసం చేసే తీరు, అలాగే ఆ కుటుంబానికి చెందిన మెహ్రిన్ డ‌బ్బున్న అమ్మాయిగా వ‌రుణ్‌ను ఆస్తినంతా నాకించేవిధానం సినిమాటిక్‌గా చూపిస్తూ ఎంట‌ర్‌టైన్ చేశారు.

 
ఫైన‌ల్‌గా వీరంతా క‌లిసి విజ‌య‌న‌గ‌రం జ‌మిందార్ ఇంటికి వార‌సులుగా వెళ్ళి అక్క‌డ చేసిన విన్యాసాలు న‌వ్విస్తాయి. క‌డుపుబ్బ న‌వ్వించే కామెడీ లేక‌పోయినా ఎంత‌టివాడైనా ఒక్క‌సారైనా న‌వ్వే ప్ర‌య‌త్నం చేస్తార‌ని చెప్ప‌వ‌చ్చు. ప్ర‌తి సినిమాలో ఏదో ఒక సందేశాన్ని ఇచ్చే ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి ఈ చిత్రంలోనూ చిన్న‌పిల్ల‌లు ఫోన్ల‌కు అతుక్కుపోతు చ‌దువును నిర్ల‌క్ష్యం చేసేవారిని ఏవిధంగా చ‌దువుపై శ్ర‌ద్ధ క‌లిగేలా చేయ‌వ‌చ్చ‌నే కొత్త పాయింట్‌ను చూపించాడు. ఇలా భారీ తారాగ‌ణంతో అంద‌రినీ న‌వ్వించే క్ర‌మంలో కాస్త శృతిమించిన స‌న్నివేశాలు కూడా వున్నాయి.  

 
వేల కోట్ల ఆస్తి ఉన్న ఒక పెద్దాయన ముర‌ళీ శ‌ర్మ చిన్నపుడు ఇంటి నుంచి పారిపోయిన తన కొడుకు కోసం ఎదురు చూస్తుంటాడు. ఆ కొడుకు వస్తే ఆస్తినంతా అప్పగించేస్తానని టీవీలో ప్రకటన ఇస్తాడు. దానికోసం వెంకీ, వ‌రుణ్‌, త‌మ‌న్నా (అబ్బాయి వేషం)లో వెళ‌తారు. త‌మ‌న్నాను చూసి సోనాల్ చౌహ‌న్ ప్రేమ‌లో ప‌డ‌డం వంటివ‌న్నీ సినిమాటిక్ ఫ‌న్నీగా వుంటాయి. ఇలా ర‌క‌ర‌కాలుగా ప్రేక్ష‌కుల్ని లాజిక్ లేకుండా న‌వ్వించే ప్ర‌య‌త్నం చేశాడు. 

    
 - అమాయ‌కుడు, రేచీక‌టితో మేనేజ్ చేసే పాత్ర‌లో వెంక‌టేష్ జ‌ీవించేశాడు. న‌త్తితో త‌న పాత్ర‌కు పూర్తి న్యాయం చేశాడు వ‌రుణ్‌. నిజాయితీగ‌ల పోలీసు ఆఫీస‌ర్‌గా రాజేంద్ర‌ప్ర‌సాద్‌, పైఅధికారిగా సంప‌త్‌, దొంగ‌గా స‌త్య ఎంట‌ర్‌టైన్ చేస్తారు.. సునీల్.. రఘుబాబు.. వెన్నెల కిషోర్, ఆలీ.. సహాయ పాత్రల్లో తమ పరిధి మేరకు బాగానే నవ్వించారు.

 
- టెక్నిక‌ల్‌గా చూస్తే కెమెరా ప‌నిత‌నం ఓకే.  దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, పాటలు ఫర్వాలేదనిపిస్తాయి. సంభాష‌ణ‌లు కూడా స‌న్నివేశ‌ప‌రంగానే వున్నాయి. అల్ల‌రి న‌రేశ్ చిత్రాల‌లో ఎటువంటి క‌థ‌, లాజిక్‌ లేని స‌న్నివేశాలుంటాయో ఈ సినిమా కూడా అలానే వుంటుంది. ఫైన‌ల్‌గా ఎఫ్‌4 కూడా వ‌స్తుందంటూ ద‌ర్శ‌కుడు క్లారిటీ ఇచ్చాడు. సో. ఈ సినిమా టైంపాస్ ప‌ల్లీబ‌ఠాణీ సినిమాగా పేర్కొన‌వ‌చ్చు.