శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : గురువారం, 21 జూన్ 2018 (08:52 IST)

మంత్రి గంటాగారి దారి తెలిసింది.. నాడు 'అన్నయ్య'.. నేడు 'తమ్ముడు' పార్టీలోకి...?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖామంత్రి గంటా శ్రీనివాసరావు అలకపాన్పునెక్కారు. భీమిలి నియోజకవర్గంలో ఏర్పడిన చిచ్చు చివరకు ఆయన పార్టీ మారాలన్న స్థాయికి తీసుకొచ్చింది. ఫలితంగా అమరావతి వేదికగా జరిగిన రాష్ట్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖామంత్రి గంటా శ్రీనివాసరావు అలకపాన్పునెక్కారు. భీమిలి నియోజకవర్గంలో ఏర్పడిన చిచ్చు చివరకు ఆయన పార్టీ మారాలన్న స్థాయికి తీసుకొచ్చింది. ఫలితంగా అమరావతి వేదికగా జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశానికి కూడా గంటా డుమ్మా కొట్టారు. దీంతో ఆయన పార్టీ మారడం తథ్యమని తేలింది. అయితే, ఈ పార్టీలోకి వెళతారన్నదే ఇపుడు సందేహాస్పదంగా మారింది.
 
ఈ పరిస్థితుల్లో ఆయన గురించి ఓ వార్త హల్‌చల్ చేస్తోంది. గంటా శ్రీనివాసరావు త్వరలోనే తెలుగుదేశం పార్టీని వీడి జనసేనలో చేరబోతున్నట్టు వార్తలొస్తున్నాయి. టీడీపీ తనని కావాలనే పరోక్షంగా దూరం పెట్టాలని చూస్తుందని భావించిన గంటా, టీడీపీ మీద అసహనంతో జనసేన వైపు చూస్తున్నట్టు సమాచారం. 
 
గంటాకి ప్రజల నాడి అంచనా వేయడం, రాజకీయ పార్టీలు మారడం కొత్తేమి కాదు. టీడీపీ తరుపున ఎంపీగా చేసిన గంటా, తర్వాత ప్రజారాజ్యంలో చేరి ఎమ్మెల్యేగా గెలిచి, కాంగ్రెస్‌లో విలీనమైన తర్వాత మంత్రిగా చేశారు. ఆ తర్వాత మళ్ళీ టీడీపీలోకి వచ్చి ప్రస్తుతం మంత్రిగా చేస్తున్నారు. అయితే, రాష్ట్రంలో ఎప్పటికప్పుడు చోటుచేసుకునే రాజకీయ పరిణామాలను అంచనా వేయడంలో దిట్ట అయిన గంటా, తాను ప్రాతినిథ్యం వహిస్తున్న భీమిలిలో జనసేన మూలంగా తను ఓడిపోయే అవకాశం ఉందని అంచనా వేసి, జనసేన తరుపున పోటీ చేసి మళ్ళీ గెలవాలని భావిస్తున్నారట. మరి ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే.
 
ఇదీ భీమిలి చిచ్చు కథ... 
 
అమరావతిలో మంగళవారం జరిగిన క్యాబినెట్  సమావేశానికి సీనియర్ మంత్రి గంటా శ్రీనివాస్ రావు గైర్హాజరయ్యారు. ఆయన అమరావతికి రాకుండా విశాఖపట్నంలోనే  గంటా శ్రీనివాస్ ఉండిపోయారు. ఇప్పుడు ఈ విషయం ఏపీ రాజకీయాల్లో  చర్చనీయాంశంగా మారింది. భీమిలి సీటు విషయంలో గంటా అసంతృప్తిగా ఉన్నట్టు సమాచారం. భీమిలి నుంచే ఈసారి పోటీ చేస్తానని ఇప్పటికే గంటా శ్రీనివాస్ ప్రకటించారు. అయితే భీమిలి సీటు అవంతి శ్రీనివాస్‌కు ఇస్తున్నట్లు సీఎం హామీ ఇచ్చారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో గంటా మనస్తాపం చెందారు.
 
భీమిలి నుంచి గంటా పోటీచేస్తే గెలవలేడనే పార్టీ ఇచ్చిన నివేదికలపై గంటా మనస్థాపం చెందారు. తాజా సర్వే పేరుతో తనను అప్రతిష్టకి గురి చేసేలా, సొంత నియోజకవర్గంలో తనకు వ్యతిరేకత ఉందనేలా ప్రచారం జరగటానికి పార్టీయే ఆస్కారమిచ్చినట్లు మంత్రి భావిస్తున్నట్లు తెలిసింది. విశాఖపట్నం భూముల కుంభకోణంపై సిట్‌ నివేదిక ప్రభుత్వానికి చేరిందని, అందులో తన పాత్ర లేనట్లు తేలినా... దాన్ని బయటపెట్టకపోవటం కూడా తనను ఇబ్బంది పెట్టేందుకేనన్నట్లుగా ఆయన సందేహిస్తున్నారని చెబుతున్నారు. 
 
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గురువారం విశాఖపట్నం జిల్లా పర్యటనకు వెళుతున్నారు. నగరంలో పట్టాల పంపిణీతో పాటు మంత్రి గంటా శ్రీనివాసరావు నియోజకవర్గమైన భీమిలిలో ఏర్పాటు చేసిన రెండు కార్యక్రమాల్లోనూ పాల్గొంటారు. వీటికి హాజరవాలా... వద్దా అన్న దానిపైనా మంత్రి తర్జనభర్జన పడుతున్నట్లు ఆయన సన్నిహితుల సమాచారం. అయితే జిల్లాలో 21న జరిగే సీఎం పర్యటన కారణంగానే గంటా కేబినెట్‌కు రాలేదని పార్టీ వర్గాలు, ప్రభుత్వం చెబుతున్నాయి.