గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Srinivas
Last Updated : బుధవారం, 20 జూన్ 2018 (10:10 IST)

భీమిలి చిచ్చు... మంత్రి గంటా దారెటు?

అమరావతిలో మంగళవారం జరిగిన క్యాబినెట్ సమావేశానికి సీనియర్ మంత్రి గంటా శ్రీనివాస్ రావు గైర్హాజరయ్యారు. ఆయన అమరావతికి రాకుండా విశాఖపట్నంలోనే గంటా శ్రీనివాస్ ఉండిపోయారు. ఇప్పుడు ఈ విషయం ఏపీ రాజకీయాల్లో

అమరావతిలో మంగళవారం జరిగిన క్యాబినెట్  సమావేశానికి సీనియర్ మంత్రి గంటా శ్రీనివాస్ రావు గైర్హాజరయ్యారు. ఆయన అమరావతికి రాకుండా విశాఖపట్నంలోనే  గంటా శ్రీనివాస్ ఉండిపోయారు. ఇప్పుడు ఈ విషయం ఏపీ రాజకీయాల్లో  చర్చనీయాంశంగా మారింది. భీమిలి సీటు విషయంలో గంటా అసంతృప్తిగా ఉన్నట్టు సమాచారం. భీమిలి నుంచే ఈసారి పోటీ చేస్తానని ఇప్పటికే గంటా శ్రీనివాస్ ప్రకటించారు. అయితే భీమిలి సీటు అవంతి శ్రీనివాస్‌కు ఇస్తున్నట్లు సీఎం హామీ ఇచ్చారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో గంటా మనస్తాపం చెందారు.
 
భీమిలి నుంచి గంటా పోటీచేస్తే గెలవలేడనే పార్టీ ఇచ్చిన నివేదికలపై గంటా మనస్థాపం చెందారు. తాజా సర్వే పేరుతో తనను అప్రతిష్టకి గురి చేసేలా, సొంత నియోజకవర్గంలో తనకు వ్యతిరేకత ఉందనేలా ప్రచారం జరగటానికి పార్టీయే ఆస్కారమిచ్చినట్లు మంత్రి భావిస్తున్నట్లు తెలిసింది. విశాఖపట్నం భూముల కుంభకోణంపై సిట్‌ నివేదిక ప్రభుత్వానికి చేరిందని, అందులో తన పాత్ర లేనట్లు తేలినా... దాన్ని బయటపెట్టకపోవటం కూడా తనను ఇబ్బంది పెట్టేందుకేనన్నట్లుగా ఆయన సందేహిస్తున్నారని చెబుతున్నారు. 
 
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గురువారం విశాఖపట్నం జిల్లా పర్యటనకు వెళుతున్నారు. నగరంలో పట్టాల పంపిణీతో పాటు మంత్రి గంటా శ్రీనివాసరావు నియోజకవర్గమైన భీమిలిలో ఏర్పాటు చేసిన రెండు కార్యక్రమాల్లోనూ పాల్గొంటారు. వీటికి హాజరవాలా... వద్దా అన్న దానిపైనా మంత్రి తర్జనభర్జన పడుతున్నట్లు ఆయన సన్నిహితుల సమాచారం. అయితే జిల్లాలో 21న జరిగే సీఎం పర్యటన కారణంగానే గంటా కేబినెట్‌కు రాలేదని పార్టీ వర్గాలు, ప్రభుత్వం చెబుతున్నాయి.