శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By శ్రీ
Last Modified: మంగళవారం, 26 మార్చి 2019 (20:20 IST)

ప‌వ‌న్ పైన చేసిన సంచ‌ల‌న వ్యాఖ్య‌ల‌కు క్లారిటీ ఇచ్చిన కోన వెంక‌ట్

జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎన్నిక‌ల‌ ప్ర‌చారంలో భాగంగా మాట్లాడుతూ... తెలంగాణ‌లో ఉన్న ఆంధ్రుల‌ను కొడుతున్నార‌ని.. అలాగే తెలంగాణ‌లో ఆస్తులు ఉన్న ఆంధ్ర‌వాళ్ల‌ని బెదిరిస్తున్నార‌ని అన్నారు. ఈ వ్యాఖ్య‌లు సినీ, రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశం అయ్యాయి. ఇదిలా ఉంటే.. స్టార్ రైట‌ర్ కోన వెంక‌ట్ నిన్న ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాట‌లపై అభ్యంత‌రం వ్య‌క్తం చేసారు. అయితే... ఈ రోజు కోన వెంక‌ట్ నిన్న ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ గురించి మాట్లాడిన మాట‌లపై క్లారిటీ ఇస్తూ ప్రెస్ నోట్ రిలీజ్ చేసారు.
 
మా కుటుంబం నేను పుట్ట‌క ముందు నుండే మా సొంత ఊరైన బాప‌ట్ల‌లో రాజ‌కీయాల్లో ఉంది. మీలో చాలామందికి ఈ విష‌యం తెలుసు. మా తాత గారైన శ్రీ కోన ప్ర‌భాక‌ర్ రావు గారు కాంగ్రెస్ పార్టీలో ప‌లుమార్లు ఎం.ఎల్.ఎగా, మంత్రిగా, అసెంబ్లీ స్పీక‌ర్‌గా, ఉమ్మ‌డి రాష్ట్రానికి కాంగ్రెస్ ప్రెసిడెంట్‌గా, మూడు రాష్ట్రాల‌కు గ‌వ‌ర్న‌ర్‌గా ఒక మ‌చ్చ‌లేని నాయ‌కుడిగా త‌న రాజ‌కీయ ప్ర‌స్థానం కొన‌సాగించారు. ఆయ‌న మ‌ర‌ణం త‌ర్వాత మా బాబాయ్ గారైన కోన ర‌ఘ‌ప‌తి గారు 1995 నుండి ప్ర‌జా సేవ‌లోకి రావ‌డం జ‌రిగింది.
 
త‌న సొంత ఆస్తులు క‌రిగించుకుంటూ ప్ర‌జాసేవ‌లో కొన‌సాగారు. 2014 ఎన్నిక‌ల్లో మా కుటుంబానికి, కోన ర‌ఘుప‌తి గారికి ఉన్న ప్ర‌జాద‌ర‌ణ‌ను గుర్తించి జ‌గ‌న్ గారు వైఎస్ఆర్‌సీపీ త‌రపున పోటీ చేసే అవ‌కాశం ఇవ్వ‌డం, గెల‌వ‌డం జ‌రిగింది. ఈ ఎన్నిక‌ల్లో నేను ప్ర‌త్య‌క్షంగా పాల్గొని నా వంతు కృషి నేను చేసాను. 1983 త‌ర్వాత తిరిగి 2014లో బాప‌ట్ల‌లో కోన కుటుంబాన్ని ప్ర‌జ‌లు ఆద‌రించారు. ఆ సంద‌ర్భంలో నా మిత్రుడైన ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా ఆయ‌న్ని అభినందించారు.
 
2014 త‌ర్వాత జ‌న‌సేన‌ని బ‌లోపేతం చేసే సంద‌ర్భంలో, ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లే సంద‌ర్భంలో ప‌లుమార్లు నేను ఓపెన్‌గా స‌పోర్ట్ చేయ‌డం జ‌రిగింది. ఈ క్ర‌మంలో వైఎస్ఆర్‌సీపీ క్యాడ‌ర్ నుండి కూడా లోక‌ల్‌గా విమ‌ర్శ‌లు ఎదుర్కొన్నాను. అయినా ఒక మిత్రుడిగా, ప‌వ‌న్ క‌ళ్యాణ్ శ్రేయోభిలాషిగా అత‌నికి మంచి జ‌ర‌గాల‌నే ఆశించి మౌనంగా ఉండిపోయాను. అది నా వ్య‌క్తిగ‌తం అనే చెప్పాను. నా ప‌ర్స‌న‌ల్ లాయాల్టీ వేరు. 30 సంవ‌త్స‌రాల త‌ర్వాత మా కుటుంబాన్ని న‌మ్మి ఆద‌రించింది వై.ఎస్ఆర్ సీపీ.. జ‌గ‌న్ గారు. అది మేము ఎప్ప‌టికీ మ‌ర‌చిపోలేము. 
 
ఇక నా ఇంట‌ర్వ్యూ సంగ‌తికి వ‌స్తే... మా బావ‌గారైన ద్రోణంరాజు శ్రీనివాస్ గారు వైజాగ్ ద‌క్షిణ నియోజ‌క‌వ‌ర్గం నుండి వైఎస్ఆర్‌సీపీ అభ్య‌ర్ధిగా పోటీ చేస్తున్నారు. అలాగే నా మిత్రుడైన ఎం.వి.వి. స‌త్య‌నారాయ‌ణ గారు వైజాగ్ పార్ల‌మెంట్ అభ్య‌ర్ధిగా పోటీ చేస్తున్నారు. వీరిద్ద‌రికి పోటీ చేయ‌డానికి వైజాగ్ వెళ్ల‌డం జ‌రిగింది. అప్పుడు సాక్షి పేప‌ర్ వారు న‌న్ను ఇంట‌ర్వ్యూ చేయ‌డం జ‌రిగింది. ఆ సంద‌ర్భంగా ప‌లు విష‌యాలపై నా అభిప్రాయాలు ఖ‌చ్చితంగా చెప్ప‌డం జ‌రిగింది.
 
నా మిత్రుడైన ప‌వ‌న్ క‌ళ్యాణ్ గారి గురించి కూడా అడ‌గ‌డం జ‌రిగింది. త‌న నిజాయితీ గురించి, త‌న వ్య‌క్తిత్వం గురించి ద‌గ్గ‌ర నుండి చూసిన వ్య‌క్తిగా నిర్మొహ‌మాటంగా చెప్ప‌డం జ‌రిగింది. పొలిటిక‌ల్‌గా త‌న‌కి మంచి జ‌ర‌గాల‌ని కోరుకునే వాళ్ల‌లో నేను మొద‌టి వ్య‌క్తిని అని చెప్ప‌డం కూడా జ‌రిగింది. (ఇది రాయ‌లేదు) పొలిటిక‌ల్‌గా మీరు విభేదించే అంశాలు ఉన్నాయా అని అడిగిన‌ప్పుడు మాయావ‌తి గారితో పొత్తు విష‌యంలో, తెలంగాణ విష‌యంలో ఎవ‌రు త‌న‌ని మిస్‌గైడ్ చేసారో వాళ్ల‌తో జాగ్ర‌త్త‌గా ఉండాలి అని చెప్ప‌డం జ‌రిగింది. 
 
ఇది కూడా ఎందుకు చెప్పానంటే... కొంతకాలం క్రితం ప‌వ‌న్ క‌ళ్యాణ్, కేసీఆర్ గారిని క‌లిసిన సంద‌ర్భంగా త‌నే స్వ‌యంగా వాళ్ల సామ‌ర‌స్య పాల‌న గురించి మీడియాతో చెప్ప‌డం జ‌రిగింది. అందుకే ఇప్పుడు త‌ను ఇస్తున్న ప్ర‌క‌ట‌న‌ల మీద నాకు అనుమానం వ‌చ్చింది అంతే. చివ‌రిగా నేను చెప్పేదేంటంటే.. మ‌న రాజ‌కీయ ఆలోచ‌న‌లు, మ‌న కులాలు, మ‌తాలు, ప్రాంతాలు, ఆర్ధిక స్థోమ‌త‌లు ఇవేవి స్నేహానికి అడ్డు గోడ‌లు కాకూడ‌దు. 
 
I once again wholeheartedly wish him the best in his journey to achieve what he wants... Kona Venkat.