శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 13 జులై 2020 (17:15 IST)

డిజిటల్ ఇండియా కోసం గూగుల్ పెట్టుబడులు.. సుందర్ పిచాయ్

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన డిజిటల్ ఇండియాపై ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ కన్నుపడింద. డిజిటల్ ఇండియా కల సాకారం చేసేందుకు వీలుగా రూ.75 వేల కోట్ల మేరకు పెట్టుబడులు పెట్టనున్నట్టు ఆ సంస్థ సీఈవో సుందర్ పిచాయ్ వెల్లడించారు.
 
సోమవారం దేశ ప్రధాని నరేంద్ర మోడీతో సుందర్ పిచాయ్ చర్చలు జరిపారు. ఈ చర్చల తర్వాత సుందర్ మాట్లాడుతూ, భారత ప్రభుత్వం ప్రకటించిన 'డిజిటల్ ఇండియా'ను సాకారం చేసేందుకు రూ.75 వేల కోట్ల మేర వివిధ రూపాల్లో పెట్టుబడులు పెడుతున్నట్టు వెల్లడించారు.
 
భారత్ లో డిజిటల్ ఆర్థిక వ్యవస్థ ఊపందుకోవడానికి తమ నిధులు ఉపయోగపడతాయని భావిస్తున్నట్టు సుందర్ పిచాయ్ అభిప్రాయపడ్డారు. ప్రధాని మోడీ అభిలషిస్తున్న డిజిటల్ ఇండియాకు మద్దతుగా నిలుస్తున్నందుకు గర్విస్తున్నామని ట్విట్టర్లో తెలిపారు. ఈ క్రమంలో భారత కేంద్ర మంత్రులు రవిశంకర్ ప్రసాద్, రమేశ్ పోఖ్రియాల్‌కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని పేర్కొన్నారు.
 
మరోవైపు, కరోనా కట్టడి కోసం ప్రధాని మోడీ సారథ్యంలో ఏర్పాటైన పీఎమ్ కేర్స్ నిధికి గూగుల్ పే ద్వారా రూ.124 కోట్ల నిధులు అందాయని గూగుల్ ఇండియా హెడ్ సంజయ్ గుప్తా తెలిపారు. దాదాపు 20 లక్షల లావాదేవీల ద్వారా ఈ మొత్తం పీఎమ్ కేర్స్‌కు చేరిందన్నారు. 
 
తొలిసారిగా ఆన్‌లైన్ విధానంలో నిర్వహిస్తున్న గూగుల్ ఇండియా ఈవెంట్ 2020లో ఆయన ఈ వివరాలను వెల్లడించారు. వివిధ వర్గాలకు చెందిన వ్యక్తులు గూగుల్ పే ద్వారా పీఎమ్ కేర్స్ నిధికి విరాళాలు ఇచ్చారని తెలిపారు. పీఎమ్ కేర్స్‌కు గూగుల్ పే వంటి యూపీఐ యాప్‌ ద్వారా విరాళాలిచ్చే అవకాశం ఉన్న విషయం తెలిసిందే.
 
కాగా.. ఈ ఈవెంట్‌లో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ప్రసంగించారు. భారత్‌లో డిజిటలీకరణ కోసం గూగుల్ చేపట్టిన చర్యలను ఆయన ప్రస్తావించారు. ఈ కార్యక్రమంలో ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ కూడా పాల్గొన్నారు.