ఏపీ ఉప ముఖ్యమంత్రికి కరోనా.. ఆయన కుమార్తెకు కూడా పాజిటివ్వే....

amjad basha
ఠాగూర్| Last Updated: సోమవారం, 13 జులై 2020 (10:50 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా కరోనా వైరస్ బారినపడ్డారు. అలాగే, ఆయన కుమార్తెకు కూడా ఈ వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది.

కడప జిల్లాలో డిప్యూటీ సీఎం బాషా కుటుంబ సభ్యులందరికీ నిర్వహించిన కరోనా పరీక్షల్లో డిప్యూటీ సీఎంతోపాటు ఆయన భార్య, కుమార్తెకు కూడా కరోనా వైరస్ సోకినట్టు తేలింది.

కరోనా నిర్ధారణ కావడంతో శుక్రవారం అర్ధరాత్రి దాటాక ఒంటి గంట సమయంలో తిరుపతిలోని కొవిడ్ ఆసుపత్రి (స్విమ్స్)లో చేరారు. వీరి ముగ్గురికీ ప్రత్యేక గదిని కేటాయించిన వైద్యులు చికిత్స అందించారు.

ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఆదివారం వీరు స్విమ్స్ నుంచి హైదరాబాద్‌లోని ఆసుపత్రికి వెళ్లినట్టు వైద్యాధికారులు తెలిపారు. ప్రస్తుతం వీరి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.

దేశంలో కరోనా విజృంభణ...
మరోవైపు, దేశంలో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతోంది. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం ఉదయం తెలిపిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో భారత్‌లో 28,701 మందికి కొత్తగా కరోనా సోకింది. ఒక్కరోజులో నమోదైన అత్యధిక కేసులు ఇవే. అదే సమయంలో 500 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు.దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 8,78,254కి చేరగా, మృతుల సంఖ్య మొత్తం 23,174కి పెరిగింది. 3,01,609 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 5,53,471 మంది కోలుకున్నారు.దీనిపై మరింత చదవండి :