రైతులను మోసం చేయం... నేను రక్షణ మంత్రినే కాదు.. రైతు బిడ్డను : రాజ్‌నాథ్

rajnath singh
ఠాగూర్| Last Updated: శుక్రవారం, 27 నవంబరు 2020 (13:16 IST)
తమ ప్రభుత్వం రైతులను మోసం చేస్తుందనే భ్రమను విపక్ష పార్టీలు కల్పించాయని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. నిజానికి తాము రైతులన మోసం చేయబోమన్నారు. తాను ఇపుడు రక్షణ మంత్రిని కావొచ్చు.. కానీ, తానూ ఓ రైతు బిడ్డనేనని గుర్తుచేశారు.

కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆరు రాష్ట్రాలకు చెందిన రైతులు ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపట్టారు. వీరంతా ఢిల్లీ సరిహద్దులకు చేరుకోగానే కరోనా వైరస్ వ్యాప్తి కట్టడి ఆంక్షల పేరుతో ఢిల్లీ పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో రైతులపై ఢిల్లీ పోలీసులు టియర్ గ్యాస్‌ను ప్రయోగించారు.

ఈ సంఘటనపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పందించారు. రైతులతో చర్చించడానికి తాను సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. వ్యవసాయ రంగాన్ని సరళీకృతం చేయడానికి ఇటీవల కేంద్రం రూపొందించిన చట్టాలు ఎంతో ప్రయోజనం చేకూరుస్తాయన్నారు.

'రైతులకు భరోసా కల్పించాలని డిసైడ్ అయ్యాం. మేము రైతులను మోసం చేయం అని భరోసా ఇస్తున్నాం. నేను రక్షణ శాఖా మంత్రినే. కానీ ఓ రైతు బిడ్డగా నేను రైతులను చర్చలకు ఆహ్వానిస్తున్నా' అని చెప్పుకొచ్చారు.

కేంద్రం తీసుకొచ్చిన నూతన చట్టాలు రైతుల ఆదాయాన్ని పెంచుతాయని, వచ్చే నాలుగైదేళ్లలో ఆ లాభాలను రైతులు చూడగలుగుతారని ఆయన పేర్కొన్నారు. నూతన చట్టాలు రైతులకు ఏమాత్రం హాని కలిగించవని ధీమాగా ప్రకటించగలనని, ఎందుకంటే చట్టంలోని ప్రతి పేరాను తాను క్షుణ్ణంగా చదవానని ఆయన నొక్కి వక్కాణించారు.

చట్టాలతో వ్యవసాయ మార్కెట్లేమీ నష్టపోవని, అవి కొనసాగుతూనే ఉంటాయని ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలతో కనీస మద్దుత ధరకు ఎలాంటి ముప్పూ లేదని, భవిష్యత్తులో కూడా కనీస మద్దతు ధర కొనసాగుతూనే ఉంటుందని రాజ్‌నాథ్ వివరించారు. కానీ, రైతులతో పాటు విపక్ష పార్టీల నేతలు మాత్రం కార్పొరేట్ శక్తులకు అనుకూలంగానే ఈ చట్టాన్ని తయారు చేశారంటూ ఆరోపణలు చేస్తున్న విషయం తెల్సిందే.దీనిపై మరింత చదవండి :