సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్ టెస్ట్.. గాల్లో ఎగిరే లక్ష్యాలు గురిచూసి ధ్వంసం...
భారత రక్షణ వ్యవస్థ రోజురోజుకూ మరింత పటిష్టంగా మారుతోంది. పొరుగు దేశాల నుంచి ఏ క్షణమైనా ముప్పు పొంచివుందన్న విషయాన్ని గ్రహించిన భారత్.. తన రక్షణ వ్యవస్థను మరింతగా బలోపేతం చేస్తోంది. ఈ చర్యల్లో భాగంగా, గత మూడు నెలలుగా డీఆర్డీవో వివిధ రకాలైన పరీక్షలను విజయవంతంగా నిర్వహిస్తూ వస్తోంది. ఇందులోభాంగంగా తాజాగా క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్ (క్యూఆర్ఎస్ఏఎం) సిస్టమ్‌ను పరీక్షించింది. ఈ వ్యవస్థను పరీక్షించడం ఐదు రోజుల వ్యవధిలో రెండోసారి కావడం గమనార్హం.
భారత రక్షణ పరిశోధనా, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) తయారు చేసిన క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టూ ఎయిర్ మిస్సైల్ (క్యూఆర్ఎస్ఏఎం) సిస్టమ్, ఐదు రోజుల వ్యవధిలోనే రెండో టెస్ట్ పాస్ అయింది. గాల్లో ఎగురుతున్న టార్గెట్‌ను ఈ మిసైల్ విజయవంతంగా ఛేదించిందని అధికారులు వెల్లడించారు. ఒడిశా తీరంలోని చాందీపూర్ టెస్ట్ రేంజ్ నుంచి దీన్ని ప్రయోగించినట్టు రక్షణ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది.
కాగా, ఈ క్షిపణ వ్యవస్థను తొలుత ఈ నెల 13వ తేదీన తొలిసారిగా ప్రయోగించగా, విజయవంతమైంది. ఆపై ఈ మిసైల్ పనితీరును మరింతగా పరిశీలించడంతో పాటు, వార్ హెడ్‌లను మోసుకుంటూ వెళ్లడాన్ని మరింత నిశితంగా సమీక్షించేందుకు రెండోసారి ప్రయోగించారు. ఇందులోభాగంగా, గాల్లోకి విమానాన్ని పోలిన డ్రోన్‌ను వదిలి, దాన్ని టార్గెట్ చేశారు.
ఇక డీఆర్డీఓ మిసైల్ విజయవంతం అయినందుకు రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కృతజ్ఞతలు చెబుతూ ట్వీట్ చేశారు. 23న జరిగిన తొలి టెస్ట్ మన రాడార్, మిసైల్ సామర్థ్యాన్ని పెంచాయని, తాజాగా జరిగిన రెండో పరీక్షతో దాని సామర్థ్యం, లక్ష్యాన్ని గుర్తించే లక్షణం గురించి మరింత సమాచారం తెలిసిందని ఆయన అన్నారు.